
నుమకొండ సిటీ, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేల ఇండ్లను ఆశా కార్యకర్తలు ముట్టడించారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇండ్లను ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రూ.18 వేల కనీస ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులతో పాటు 5 లక్షల బీమా సదుపాయం డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాగుల రమేశ్, బొట్ల చక్రపాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.