బడ్జెట్​లో మిగులు..​ఆడిట్​లో లోటు!

ఎనిమిదేండ్లుగా భారీ బడ్జెట్ షో చూపిస్తున్న.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం వింత పోకడలకు పోతోంది. లక్షల కోట్ల అంకెలుండేలా ఏటేటా ఘనమైన బడ్జెట్​ను సమర్పించేందుకు పోటీ పడుతున్న కేసీఆర్​ సర్కార్.. వాస్తవాలను మాత్రం దాచిపెడుతున్నది. మిగులు బడ్జెట్​ఉన్నట్లు అసెంబ్లీలో చూపించి, ఆడిట్ లో అంతకంతకూ లోటు బడ్జెట్​ ఉన్నట్లు లెక్కలు రాసుకుంటోంది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పటి నుంచి బడ్జెట్​ కహానీ ఇలా ఉన్నది.

నిజానికి ప్రతి ఏడాది ఫిబ్రవరి – మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్.. ఉత్తుత్తి అంచనాలే. ఆర్థిక సంవత్సరం ముగిస్తే తప్ప అసలు రాబడి, అసలు ఖర్చులెంత అనేది సర్కారుకు అర్థమవుతుంది. అది ప్రజల వరకు తెలియాలంటే.. ఆ తర్వాత ఏడాది వెలువడే ఆడిట్​లెక్కలే దిక్కు. అంటే మొన్న ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్​ నిజస్వరూపమేమిటో తెలియాలంటే 2025 వరకు వెయిట్​చేయాల్సిందే.  ఒక సగటు కుటుంబ యజమానికి ఇంటి కిరాయి, పాల బిల్లు మొదలు కరెంట్​బిల్లు వరకు.. నెలనెలా ఖర్చులేమిటో అంచనాగా తెలిసిపోతాయి. అత్యవసర, ఊహించని ఖర్చులు మీద పడితే తప్ప తన బడ్జెట్​తలకిందులు కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం అదే తీరుగా అంచనాలు వేసుకోలేకపోతుందా? ఎందుకు మిగులు బడ్జెట్​చూపించి.. చివరకు లోటు బడ్జెట్​ఉన్నట్లు ఖజానాను బోర్లేస్తుందనే సందేహాలు ఎవరికైనా రావటం సహజం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రెండేడ్లు అసలైన రాబడి అంచనాలు.. ఖర్చుల లెక్కలు తెలియకపోవచ్చు.

అప్పుడు తప్పులు దొర్లేందుకు ఆస్కారముందని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. కానీ.. ఎనిమిదేండ్లుగా వరుసగా రాష్ట్ర బడ్జెట్​అంచనాలు తప్పుతున్నాయంటే.. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అసెంబ్లీలో భారీ బడ్జెట్​ను చూపిస్తోందనే వాదనలున్నాయి. అదే నిజమని ఆడిట్​లెక్కలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మరి అసలైన రాబడి దాచిపెట్టి, అప్పులు దాచిపెట్టి.. అంచనాలకు మించినంత బడ్జెట్​ను చూపిస్తే ప్రభుత్వానికేం లాభం? చట్టసభలకు, ప్రజలకు అబద్ధాలు ఎందుకు చెబుతోందనేది ఆసక్తికరమే. 

బడ్జెట్ ​శాంక్షన్ ఆర్డర్లు.. పెండింగ్​ బిల్లులు

ఇప్పటికే బడ్జెట్​లో కొన్ని కేటాయింపులకు.. ఖర్చు చేసే వాటికి పొంతన ఉండటం లేదు. ఉదాహరణకు ఎంబీసీలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు బడ్జెట్​లో ప్రభుత్వం చెప్పుకుంది. కానీ ఇప్పటికీ కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. వడ్డీ లేని రుణాలకు బడ్జెట్​లో కేటాయింపులుంటాయి. డబ్బులిచ్చిన దాఖలాలు మాత్రం లేవు. నాలుగేండ్లుగా రైతుల రుణమాఫీకి నిధుల కేటాయింపులున్నాయి. కానీ, ఇచ్చింది అరకొరే. అంటే ప్రజలను ఆశపెట్టేందుకు భారీ బడ్జెట్​ను.. ఘనమైన కేటాయింపులను ప్రభుత్వం వాడుకుంటుంది. జనం ఆశలు పెంచటంతో పాటు అనుకున్నన్ని బడ్జెట్​శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చుకునే అవకాశాన్ని యథేచ్ఛగా ప్రయోగిస్తోంది. శాంక్షన్​ఆర్డర్ ఇచ్చేస్తే.. టెండర్లు పిలిచి.. పనులు చేసుకునే వీలుంటుంది. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, తాము అనుకున్న పనులన్నీ తెలంగాణ ప్రభుత్వం ఇదే తీరుగా చేపడుతోందనే వాదనలున్నాయి. తీరా పనులు జరిగాక.. బిల్లులు ఇవ్వకుండా పెండింగ్​లో పెడుతోంది. వివిధ విభాగాలకు సంబంధించి దాదాపు రూ.50 వేల కోట్ల మేరకు బిల్లులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఫైనాన్స్​విభాగం చుట్టూ కాంట్రాక్టర్లు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది. పెండింగ్​బిల్లులుంటే అప్పుల కింద పరిగణించరు. కానీ.. వేల కోట్ల పెండింగ్​ బిల్లులు ఏండ్లకేండ్లుగా పేరుకుపోతే.. అది కూడా బ్యాడ్​ ఫైనాన్సియల్​ స్టేటస్​గానే పరిగణిస్తారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే దురవస్థ కొనసాగితే.. భారీ బడ్జెట్​తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. అప్పుల కుప్పగా మారి పరపతి కోల్పోతే కొత్త పనులు చేపట్టేందుకు.. కనీస నిర్వహణ ఖర్చులకు దిక్కులు చూడాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

ఎఫ్ఆర్​బీఎం నిబంధన ఉల్లంఘించి..

ఏ రాష్ట్రమైనా ఆదాయానికి అనుగుణంగా ఖర్చులను నియంత్రించి, ఆర్థిక క్రమ శిక్షణ పాటించాలి. తాము ఖర్చుపెట్టే ప్రతి పైసా ప్రజల ధనమేనని గుర్తించాలి. బాధ్యతాయుతంగా చట్ట సభల ఆమోదంతో వాటిని ఖర్చు చేయాలి. ఎఫ్ఆర్ బీఎం చట్టానికి లోబడి అప్పులు తీసుకోవటంతో పాటు, లోటు బడ్జెట్ లేకుండా రాష్ట్రాల ఆదాయ వ్యయాలుండేలా జాగ్రత్త పడాలి. కానీ.. రాజకీయ ప్రయోజనాల కోసం.. తెచ్చిన స్కీమ్ లు, ఇచ్చిన హామీలు, కట్టిన ప్రాజెక్టులు, చేపట్టిన పనులకు సరిపడేంత ఆదాయం లేకుంటే అంచనాలు తలకిందులవుతాయి. అప్పుడే సినిమా చూపించాల్సి వస్తుంది.  కేసీఆర్​రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలివ్వలేని దివాళా దశ మొదలైంది. ఆదాయం పెంచుకునేందుకు అప్పులే దిక్కయ్యాయి. లెక్కలేనన్ని అప్పులు చేయటంతో అంచనాలు తప్పిపోయాయి. వడ్డీలు, కిస్తీల భారం పెరిగిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో రూ.70 వేల కోట్లు ఉన్న అప్పులు.. ఏనిమిదేండ్లలో రూ.5 లక్షల కోట్లు అయ్యాయి. రెవెన్యూ రాబడిలో 90 శాతం గ్యారంటీలు తీసుకోవాలనే ఎఫ్ఆర్ బీఎం నిబంధనను.. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఉల్లంఘించింది. ఈ పరిమితిని 200 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది. ఆ చట్టాన్ని కూడా అతిక్రమించి అప్పులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. చివరకు  కేంద్రం జోక్యం చేసుకొని తెలంగాణ  అప్పులపై ఆంక్షలు విధించే పరిస్థితి తలెత్తింది. అందుకే బడ్జెట్​పెంచుకోవాలనే ఆలోచన వెనుక.. అంతకంత అప్పులు తెచ్చుకునే దూరపు ఆలోచన లేకపోలేదనేది ఆర్థిక నిపుణుల మాట.

- బొల్గం శ్రీనివాస్​, బ్యూరో చీఫ్​,  వెలుగు