- ఒక హత్యను కప్పి పుచ్చి మరో హత్య
- మొదటి భార్యను ఇంట్లోనే పూడ్చిపెట్టిన సైకో భర్త
- రెండే భార్యను చంపాక బయటపడ్డ విషయం
వరంగల్ క్రైం, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు భార్యలను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. మొదటి భార్యను ఇంట్లోనే పాతి పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా విడాకుల డ్రామా ఆడాడు. ఇవేం చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కట్నం కోసం గొడవపడి రెండో భార్యనూ చంపేశాడు. ఇప్పటి మర్డర్‌కేసు విచారణలో ఏడేండ్ల కింద జరిగిన హత్య విషయం బయటపడింది. వరంగల్ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన కర్లె కిరణ్పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులతో తరచూ గొడవ పడుతుండటంతో తల్లిదండ్రులు అతన్ని వదిలి కొన్నేళ్ల కింద మహబూబాబాద్ వెళ్లిపోయారు. 2019లో హుజూరాబాద్ మండలం సాధిరెడ్డిపేటలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న వరంగల్అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌కి చెందిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కట్నకానుకలు ఏం తీసుకోకుండా అత్త గారింట్లోనే ఉంటున్నాడు. పెళ్లయిన 3 నెలల తరువాత కట్నం కావాలంటూ అంజలిని వేధించడం స్టార్ట్చేశాడు. ఇతరులతో చనువుగా ఉంటోందని ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో అంజలి, కిరణ్ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో అంజలి తల్లిదండ్రులు కొంత మొత్తాన్ని కట్నంగా ఇచ్చారు. ఆ తర్వాత ఇల్లు అమ్మి ఇంకా డబ్బు ఇవ్వాలని డిమాండ్చేశాడు. ఈ క్రమంలోనే కాపురాన్ని ఏనుగల్లుకు మార్చాడు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి అంజలిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల12న రాత్రి భోజనం చేసిన తరువాత భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. కోపంలో అంజలి తలపై కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 14న చనిపోయింది.
ఏడేండ్ల క్రితం..
అంజలి చనిపోయాక కేసు నమోదు చేసిన పర్వతగిరి పోలీసులు కిరణ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఊహించని నిజాలు బయటపడ్డాయి. ఏడేండ్ల కింద జరిగిన మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. కిరణ్2013లోనే సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన చిలువేరు పద్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత ఏనుగల్లులో ఏడాదిపాటు కాపురం చేశాడు. ఈ క్రమంలో పద్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. 2014లో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. డెడ్‌బాడీని కాపురం ఉంటున్న ఇంటిలోనే పూడ్చి పెట్టాడు. ఆ తరువాత కొద్దిరోజులు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కొన్నిరోజులకు తిరిగొచ్చాడు. స్థానికులు పద్మ గురించి అడుగుతుండడంతో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు అందరికీ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత 2019లో అంజలిని పెళ్లి చేసుకుని ఆమెనూ మర్డర్ చేశాడు. ఇద్దరు భార్యలను హింసిస్తూ సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పైశాచిక ఆనందం పొందేవాడని పోలీసుల విచారణలో తేలింది. కేసును ఛేదించిన మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్, పర్వతగిరి --సీఐ కిషన్, ప్రొబేషనరీ ఎస్సై రాజేందర్, ఏఎస్సై సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, వెంకట్రాం, కానిస్టేబుళ్లు రాజ్‌కుమార్, నాగరాజు, రమణ, లింగమూర్తి రాజశేఖర్, శ్రీనివాస్, సైబర్ క్రైం- కానిస్టేబుల్ కిశోర్‌ను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి అభినందించారు.