ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవడం లేదని.. భార్యను హత్య చేసిన భర్త

ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవడం లేదని.. భార్యను హత్య చేసిన భర్త
  • డంపింగ్​ యార్డులో పడేసి మిస్సయిందని కంప్లయింట్​
  • కూతురు ఫిర్యాదుతో వెలుగులోకి...

జడ్చర్ల, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన ఓ భర్త తన అత్తమామలకు సంబంధించిన ఆస్తిలో  వాటా ఇవ్వడానికి భార్య ఒప్పుకోవడం లేదని చంపేశాడు. కిష్టారం గ్రామానికి చెందిన బియని అనిత (45)కు చెల్లె, ఇద్దరు తమ్ముళ్లున్నారు. ఓ తమ్ముడికి తన పెద్ద బిడ్డ శ్వేతను ఇచ్చి పెండ్లి చేసింది. తల్లిదండ్రుల ఆస్తిని అనిత చెల్లెతో పాటు మరో ఇద్దరు తమ్ముళ్లు పంచుకుని ఆమెకు వాటా ఇవ్వలేదు.

ఈ విషయంలో తనకు అభ్యంతరం లేదని అనిత చెప్పింది. అనిత భర్త జంగిరెడ్డి పంచాయితీ పెట్టించి అనిత ఫ్యామిలీ ప్రాపర్టీలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనికి అనిత సపోర్ట్ ​చేయకపోవడంతో.. కోపం పెంచుకున్న జంగిరెడ్డి భార్య అనితను చంపేందుకు ప్లాన్​ చేశాడు. ఈ నెల16న గంగాపూర్​ చెన్నకేశవస్వామి టెంపుల్​కు భార్యను వెంటబెట్టుకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు పోలేపల్లి శివారులోని లెదర్​పార్క్​సమీపంలోని ఓ గుంత వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న వైరుతో గొంతుకు బిగించి హత్య చేయబోగా, కుక్కలు అరుస్తూ వెంటపడగా  ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

విషయాన్ని అనిత తన పెద్ద కూతురు శ్వేతకు ఫోన్​చేసి చెప్పింది. జంగిరెడ్డిని ఆమె ప్రశ్నించింది. దీంతో ‘ జోక్​ చేసిన బిడ్డా...నేను మీ అమ్మను చంపుతాన్రా’ అని బుకాయించాడు. మళ్లీ ఈ నెల 17న అనితను పోలేపల్లి లెదర్​పార్క్​సమీపంలోకి తీసుకువెళ్లి అక్కడే వైరుతో గొంతు పిసికి చంపాడు. డెడ్​బాడీని డంపింగ్​యార్డులో పడేశాడు. అదే రోజు అనితను కూతురు వద్దకు వెళ్లమని చెప్పానని, కానీ, వెళ్లలేదని నమ్మించే ప్రయత్నం చేశాడు. భార్య కనిపించడం లేదని 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డ శ్వేతకు అనుమానం రావడంతో కంప్లయింట్​ఇవ్వగా పోలీసులు విచారించారు. దీంతో నేరం ఒప్పుకున్నాడు. డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం జడ్చర్ల దవాఖానకు తరలించామని టౌన్​ సీఐ ఆదిరెడ్డి చెప్పారు.