
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ లో భార్య ఆకస్మిక మరణంతో మనస్తాపం చెందిన భర్త ఆమె దశదినకర్మ తెల్లారే చనిపోయాడు. గ్రామానికి చెందిన నార్లపురం యాదమ్మ (60) ఈ నెల 16న నర్సరీ వద్ద కూలి పనుల కోసం వెళ్లింది. అక్కడి ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ తీగ తెగిపడడంతో దానికి తగిలి చనిపోయింది.
25న బంధువుల సమక్షంలో ఆమె దశదిన కర్మ నిర్వహించారు. వచ్చిన చుట్టాలు ఒక్కొక్కరుగా ఆది, సోమవారాల్లో తమ ఇండ్లకు వెళ్లిపోయారు. అయినవాళ్లు అందరూ వెళ్లిపోవడంతో భార్య మరణాన్ని తలుచుకుంటూ భర్త నర్సయ్య (65) అదేరోజు సాయంత్రం ఆకస్మికంగా చనిపోయాడు. ఒకరి తర్వాత ఇంకొకరు చనిపోవడాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.