హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో వారం వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. ఈ నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు వర్షాలు కురుస్తాయని చెప్పింది. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.
మరో 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. జగిత్యా ల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో స్వల్ప వర్షాలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని చెప్పింది. కాగా, రానున్న 3రోజుల్లో రాష్ట్ర వ్యాప్తం గా కొన్ని చోట్ల వర్షాలు పడతాయని ప్రకటించింది.
అలర్ట్గా ఉండాలె: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని జిల్లా కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఢిల్లీ నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వరద నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వికారాబాద్ లో13 సెం.మీ వర్షపాతం
సోమవారం పొద్దున నుంచి మంగళవారం పొద్దున వరకు 24 గంటల వ్యవధిలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో 13 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైందని అధికారులు తెలిపారు. హయత్ నగర్లో 12, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 11, నిజామాబాద్ జిల్లా నందిపేటలో 10 సెం.మీ వర్షపాతం నమోదైందని చెప్పారు. మంగళవారం పొద్దున నుంచి సాయంత్రం వరకు రంగారెడ్డి జిల్లా కందువాడలో 13.3, షాబాద్ లో 12.2 సెం.మీ వర్షం కురిసింది.