
హైదరాబాద్: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. అల్పపీడనం 18వ తేదీ నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరానికి చేరే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఏపీ, తెలంగాణల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు.. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం, దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణల్లో ముసురు పట్టింది. చాలా ప్రాంతాల్లో ఒకవైపు ఎండ కాస్తుంటే.. మరో వైపు చినుకులు పడుతున్నాయి. సోమవారం ఏపీలోని తూర్పు గోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.