- అక్కడి చెరువులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పై స్టడీ
హైదరాబాద్ సిటీ, వెలుగు : చెరువుల పునరుజ్జీవనంపై మూడు రోజులు స్టడీ చేసేందుకు హైడ్రా టీమ్ బెంగళూరుకు వెళ్లనుంది. గురువారం హైడ్రా అధికారులు, శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బయలుదేరనున్నారు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని కొన్ని చెరువులను సీఎస్ఆర్ కింద అద్భుతంగా డెవలప్చేసింది. అక్కడి అధికారులు తీసుకున్న చర్యలను తెలుసుకుని, హైదరాబాద్ లో అమలు చేయాలని హైడ్రా అధికారులు భావిస్తున్నారు. పాడైన చెరువులను ఎలా బాగుచేశారో స్టడీ చేయనున్నారు.
ఇటీవల లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రంగనాథ్ మాట్లాడారు. చెరువుల పునరుద్ధరణపై చర్చ జరిగింది. తర్వాత నేరుగా బెంగళూరులోని చెరువులను విజిట్ చేస్తే బాగుంటుందని నిర్ణయించారు. అలాగే కొద్దిరోజుల కిందట డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై బెంగళూరు మాజీ డైరెక్టర్ తో సమావేశమై మేనేజ్ మెంట్ విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను రంగనాథ్ తెలుసుకున్నారు. దాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
తక్కువ ఖర్చుతో 35 చెరువుల బ్యూటిఫికేషన్
బెంగళూరులో అతి తక్కువ ఖర్చుతో 35 చెరువులను బాగుచేశారు. కొన్నింటిని సీఎస్ఆర్ కింద వివిధ కంపెనీలు బాగు చేయగా, ఇంకొన్నింటిని అక్కడి ప్రభుత్వమే పునరుద్ధరించింది. చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి స్వచ్ఛమైన నీరు చేరే ఏర్పాట్లు, మురుగు కాల్వల నుంచే శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించింది. మూడు, నాలుగు దశల్లో నీటిని శుద్ధి చేస్తోంది.
ఇక మురుగు కాల్వలకు ఇరువైపులా మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలి వీచేలా ఏర్పాట్లు చేసింది. హైడ్రా అధికారులు బెంగళూరు వెళ్లొచ్చాక మొదటి దశలో భాగంగా బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్ లోని సున్నం చెరువు, కూకట్ పల్లి లోని నల్లచెరువు, రాజేంద్రనగర్ లోని అప్పా చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని ఇప్పటికే నిర్ణయించారు.