నేటితో ముగియననున్న కేంద్ర ప్రభుత్వ గడువు 

  • ఎంపానల్​మెంట్ పట్టించుకోని ప్రైవేట్​ఆస్పత్రులు
  • స్కీమ్​లో నేటికీ 40 శాతం కూడా నమోదు చేసుకోలె..
  • పర్మిషన్లు లేక నమోదు చేసుకుంటలేరని విమర్శలు 
  • స్పెషల్ డ్రైవ్ చేపడుతామంటున్న  వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు

యాదాద్రి/సూర్యాపేట, వెలుగు: ‘ఆయుష్మాన్​భారత్–​- ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’  స్కీమ్​ను వెంటనే అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించినా యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో డిలే అవుతోంది. ఎంపానల్​లో నమోదు చేసుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు కేంద్రం  ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్నా.. సగం ఆస్పత్రులు కూడా నమోదు చేసుకోలేదు. అన్ని ప్రైవేట్​హాస్పిటళ్లతో పాటు, డయాగ్నస్టిక్, స్కానింగ్, ఫిజియోథెరపీ సెంటర్లు‘ఆయుష్మాన్​భారత్ ​- ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఆస్పత్రుల ఎంపానల్​మెంట్​ ఆస్పత్రులు 40 శాతం కూడా దాటలేదు.  ఆస్పత్రుల ​నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతామని అధికారులు చెప్తున్నారు.

ఎన్నో  ప్రయోజనాలు..

‘ఆయుష్మాన్​ భారత్​ - ప్రధాన్​మంత్రి జన్​ఆరోగ్య యోజన’  కింద ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.  అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పేదలకు ఒక కుటుంబానికి  ఏడాదికి రూ. 5 లక్షల వరకు కవరేజీ  వస్తుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద  పేషంట్లు ఎంపానల్డ్​ ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫ్రీ ట్రీట్మెంట్ పొందవచ్చు.  ఇందుకోసం ముందుగా  ఎంపానల్​మెంట్​లిస్టులో చేరేందుకు  జిల్లాలోని  అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు  ఆయుష్మాన్ భారత్ పోర్టల్ లో నమోదు కావాల్సి ఉంటుందంటున్నారు. 

సూర్యాపేట, యాదాద్రి  జిల్లాల్లో..  

సూర్యాపేట జిల్లాలో 229 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా118 డయాగ్నస్టిక్ , 50 స్కానింగ్ ,  10 ఎక్స్ రే , 12 ఫిజియోథెరపీ సెంటర్లు, 34 డెంటల్ క్లినిక్స్ ఉండగా మొత్తం 453 వైద్యారోగ్యశాఖ డిపార్ట్​మెంట్​లో రిజిస్టర్​అయి ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 119 ప్రైవేట్ హాస్పిటల్స్​ఉండగా..59 డయాగ్నస్టిక్స్​సెంటర్లు  ఉన్నాయి. నేటి వరకు సూర్యాపేట జిల్లాలో 20 శాతం మాత్రమే.. పోర్టల్ లో నమోదు చేసుకోగా యాదాద్రి జిల్లాలో 50 ప్రైవేట్ హాస్పిటల్స్  నమోదు చేసుకున్నాయి.  ఆయుష్మాన్ భారత్ పోర్టల్ లో నమోదు చేసుకోవడానికి  ఇంకా ఒక్క రోజు  గడువే ఉండడంతో అన్ని ఆస్పత్రులు నమోదు చేసుకోవడం కష్టమేనని ఆఫీసర్లు అంటున్నారు. పర్మిషన్​లేకుండా లాబొరేటరీ, స్కానింగ్ సెంటర్లు,  క్లినిక్​లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉండగా.. ఇప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్​ఉండాలన్న రూల్ ఉండడంతో హాస్పిటల్స్ బాగోతం బయటపడుతుందనే భయంతో  పోర్టల్ లో నమోదు చేసుకునేందుకు  ఆస్పత్రులు వెనుకడుగు  వేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. 

స్పెషల్ డ్రైవ్  

పోర్టల్ లో నమోదు గడువు ఒక్క రోజే ఉండడంతో ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్  చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.  సూర్యాపేట జిల్లాలో 20 శాతం హాస్పిటల్స్ మాత్రమే నమోదు కావడంతో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొని పోర్టల్ లో నమోదు చేసుకునేలా ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు.  ఇందుకోసం ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా 
నియమించారు.

స్పెషల్ డ్రైవ్ చేపడుతం 

 ‘ఆయుష్మాన్​ భారత్-​- ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’   కింద ప్రైవేట్ హాస్పిటల్స్ నమోదు చేసుకునేలా స్పెషల్ డ్రైవే చేపడుతున్నాం.  కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు లోపు అన్ని హాస్పిటల్స్ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నం.     
– డాక్టర్ కోట చలం, డీఎంహెచ్ వో, సూర్యాపేట