విశ్వాసం : ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలి

విశ్వాసం :  ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలి

అరణ్యవాసంలో ఉన్న అర్జునుడు ధర్మరాజు ఆదేశానుసారం దివ్యాస్త్రాలను సాధించటం కోసం శివునితో పోరాడి పాశుపతాస్త్రం సంపాదించాడు. అటు పిమ్మట ఇంద్రలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఇంద్రుడు దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. అక్కడే ఐదు సంవత్సరాలు ఉండిపోతాడు అర్జునుడు. ఆ సమయంలోనే ఒకనాడు ఊర్వశి అర్జునుని సమీపించి, తనను మోహించమని కోరుకుంటుంది. అందుకు సమాధానంగా అర్జునుడు నిర్వికారంగా, ధైర్యంగా...

నను పుత్ర స్నేహంబున మనమున మన్నించి శుభ సమగ్రుని చేయం
చనుదెంచితీవు ముదమున జనయిత్రీ యే గృతార్థ జన్ముడనైతిన్‌‌‌‌.

తల్లీ ఈ విధంగా ధర్మద్రోహమైన మాటలు పలకడం న్యాయమా? ఇది దోషం. మనస్సులో కూడా ఇటువంటి ఆలోచన రానీయకూడదు అని సమాధానమిచ్చాడు.

అందుకు సమాధానంగా ఊర్వశి ‘ఈ లోకంలో వనితలు, పురుషులు విచ్చలవిడిగా క్రీడిస్తారు. ఇచ్చట ఇది తప్పు కాదు. ఇది మా ఆచారం. నువ్వు ఇప్పుడు ఈ లోకానికి వచ్చావు కనుక నువ్వు కూడా దివ్య పురుషుడివే. నా కోరిక నెరవేర్చు’ అని పలుకగా అర్జునుడు...

తల్లీ! నీవు మా పూర్వీకుడైన పురూరవుని వివాహమాడావు. నా తండ్రి అయిన దేవేంద్రునికి సన్నిహితురాలవు. అందువల్ల నీవు నాకు మాతృసమానురాలవు. నువ్వు ఈ విధంగా మాట్లాడటం ధర్మం కాదు’ అని వినయంగా సమాధానమిచ్చాడు.

దేవలోకంలోకి ప్రవేశించినవారు కూడా దివ్యపురుషులే అవుతారు కనుక, భూలోకంలోని నీతి ఇక్కడ అవసరం లేదు’ అని ఊర్వశి పలువిధాలుగా అర్జునుడికి చెబుతుంది. మానవ ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తానని అర్జునుడు పలకడంతో, అతడిని పాషండునిగా మారిపొమ్మని ఊర్వశి శపించింది. కామవికారంతో విచక్షణ కోల్పోయిన ఊర్వశి వంటి వారు భారతరామాయణాల కాలంలోనే కాదు, చరిత్రలోనూ కనపడతారు.

ధర్మాలు, ధర్మసూక్ష్మాలు ప్రాంతాలను బట్టి, జాతులను బట్టి మారుతుంటాయి. పశుపక్ష్యాదులు, జంతువుల నీతి వేరు. మానవుల నీతి వేరు. దేవతల నీతి వేరు, వానరుల నీతి వేరు. ఆ నీతిని అనుసరించి మానవ జీవితం నడుచుకోవాలని పెద్దలు చెబుతారు. 

వానర నీతి ప్రకారం... అన్నగారు కాని తమ్ముడు కాని జీవించి ఉండగా వాని భార్యను చెరపట్టడం తప్పు. అందుకే సుగ్రీవుడు జీవించి ఉండగా వాలి, సుగ్రీవుని భార్య రుమను చెరపట్టటం అధర్మమని పలికాడు సుగ్రీవుడు.

రామాయణంలో..

తండ్రి మాటకు కట్టుబడి సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నారు. అలా ఉండగా, ఒకనాడు శూర్పణఖ అనే రాక్షసి వారి వద్దకు వచ్చింది. అందంగా కనిపిస్తున్న రాముడిని సమీపించి, ‘నేను నిన్ను మోహించాను, నన్ను వివాహమాడు’ అని పలికింది. అందుకు రాముడు తిరస్కరించాడు. ఆ పక్కనే ఉన్న లక్ష్మణుని దగ్గరకు వెళ్లి,  తనను వివాహం చేసుకోమని కోరింది. అందుకు లక్ష్మణుడు కూడా తిరస్కరించాడు. భార్య ఉన్న మేము మరో స్త్రీని వివాహం చేసుకోలేము అని మానవ ధర్మసూక్ష్మాన్ని పలుకుతారు. 

అందుకు ఆగ్రహించిన శూర్పణఖ.. సీతాదేవిని మింగేస్తానంటూ మీదమీదకు రాబోయింది. వెంటనే లక్ష్మణుడు దాని ముక్కుచెవులు కోసేశాడు. రెట్టింపు ఆగ్రహంతో శూర్పణఖ తన అన్న అయిన రావణుని దగ్గరకు వెళ్లి, సీతమ్మను చెరపట్టమని కోరింది. కామవశమైన శూర్ఫణఖ విచక్షణ కోల్పోయి, తన కోరిక నెరవేరనందుకు అవమానంతో సీతమ్మ వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఆ దుష్ప్రవర్తన కారణంగానే ముక్కు చెవులు పోగొట్టుకోవడమే కాకుండా, లంక నాశనానికి కారకురాలయ్యింది.

చరిత్రలో సారంగధర కథ తెలిసిందే. రాజమహేంద్రిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజరాజనరేంద్రునికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య చిత్రాంగి వయసులో చిన్నది. ఆమె సారంగధరుడి మీద మనసు పడుతుంది. తన అంతరంగాన్ని సారంగధరుడి దగ్గర బయటపెడుతుంది. విజ్ఞత కలిగిన సారంగధరుడు, ‘నీవు నాకు తల్లితో సమానురాలవు’ అని పలికాడు. కాని అతడి మీద మనసుపడిన చిత్రాంగి, సారంగధరుడి మీద పగబట్టి అతడి వినాశనాన్ని కోరుకుంది. 

సారంగధరుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని రాజరాజనరేంద్రుని నమ్మించింది. సారంగధరుడికి మరణశిక్ష పడిందనే కథ ప్రచారంలో ఉంది. కోరికతో కళ్లు మూసుకుని పోయినవారికి విచక్షణా జ్ఞానం ఉండదనటానికి ఇటువంటి కథలు www నిలుస్తాయి. అందుకే చతుర్విధ పురుషార్థాలలో అర్ధకామాలను ధర్మబద్ధంగా అనుసరిస్తేనే మోక్షం లభిస్తుందని చెబుతారు వేదాంతులు. 

వావివరసలు లేకుండా, విచక్షణా జ్ఞానం కోల్పోయి ప్రవర్తించినవారు దుర్గతులపాలవుతారని ఈ కథలు మనకు చెబుతున్నాయి.

- డా. పురాణపండ వైజయంతి