20వ శతాబ్దం చివరి అంకం ..21వ శతాబ్దం తొలి అంకంలో ఎలక్ట్రానిక్ పుస్తకాలు లేదా డిజిటల్ పుస్తకాల ప్రాధాన్యత పెరుగుతున్న మాట వాస్తవం. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుత సాంకేతిక సమాజంలో ప్రతి వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించడం లేదా తనకు అనుకున్న సమయంలో అవసరమైన సమాచారం అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ముద్రణకు సంబంధించి చాలా సాధక బాధకాలు ఉన్నాయి. ముద్రణ ఖర్చు, రాను రాను భారంగా మారుతోంది.
ఈ భూమి మీద రీడర్స్ ఎక్కువగా ఉన్న ఖండం ఆసియా ఖండం మాత్రమే. తరువాత ఉత్తర అమెరికా, యుకె, ప్రాన్స్, న్యూజిలాండ్ దేశస్థులు ఉన్నారు. ప్యూ రిసెర్చ్ ప్రకారం వారానికి భారతీయులు 10.42 గంటలు, థాయ్‌లాండ్ 9.24 గంటలు, చైనా ఎనిమిది గంటలు, ఫిలిప్పీన్స్ 7.36, ఈజిప్షన్స్ 7.30, రష్యా 7.06, యూఎస్, యూకే దేశస్తులు 5:00 గంటలు సమయాన్ని చదివేందుకు కేటాయిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 61శాతం పట్టణ వాసులు,58శాతం గ్రామీణ ప్రాంత వాసులు పుస్తకాలు చదువుతున్నారు. భారత దేశ వ్యాప్తంగా 47శాతం పట్టణ ప్రాంత పుస్తక చదువరులు, 53% గ్రామీణ ప్రాంత చదువరులు ఉన్నారు. వీరిలో 33% మరాఠీ13%బెంగాలీలు, 8%, ఇంగ్లీష్, 5.5%, తెలుగు14%. హిందీ 26% చదువుతున్నారు.
పుస్తక అమ్మకాల శాతాలు ఇలా..
ప్రపంచ వ్యాప్తంగా పుస్తకపు అమ్మకాలు పరిశీలిస్తే 29% ఫాంటసీ, 29% రొమాన్స్, 21% సైన్స్ ఫిక్షన్, 26% ఆదర్ ఫిక్షన్స్ అమ్ముడవుతున్నాయి. ఫిజికల్ పుస్తకాలు చదవాలి అనే వారి అంశంగా పరిశీలిస్తే 57% మంది ప్రింట్ పుస్తకాలు చదువుతున్నామని, 41 % పేపర్ బ్యాక్ పుస్తకాలను, 16% హార్డ్ కవర్ పుస్తకాలను, 32 % రీడర్లు ఎలక్ట్రానిక్ పుస్తకాలు, 20% కిండెల్, 12 శాతం ఇతర ఎలక్ట్రానిక్ పుస్తకాలు, 11% ఆడియో పుస్తకాలు (కామిక్, బ్రెయిలీ పుస్తకాలు) చదువుతున్నారు.
కరోనా కాలంలో రీడర్స్ పెరిగారు
ఫిజికల్ పుస్తకాలు అయినా ఎలక్ట్రానిక్ పుస్తకాలైనా పుస్తకం చదివే అలవాటు మాత్రం తగ్గలేదు అని నిరూపితం అయింది. ప్రపంచవ్యాప్తంగా జెండర్ రేషియోను పరిశీలిస్తే 56% మహిళలు పుస్తకాలు చదువుతుండగా 42% పురుషులు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 2021 సర్వే ప్రకారం కరోనా కాలంలో రీడింగ్ హాబిట్ 35% పెరిగింది. 30% అమెరికన్ చదువరులు ఎలక్ట్రానిక్ పుస్తకాల మీద ఆధారపడి చదువుతున్నారు. 75% అమెరికన్ పౌరులు కనీసం సంవత్సరానికి మూడు లేదా నాలుగు పుస్తకాలను చదువుతున్నారు.
రీడర్ టేస్ట్‌కు తగ్గ పుస్తకాలు రావాలి
ఇక తెలుగు బాషా పుస్తకాల గురించి చర్చకు వచ్చినట్లయితే ఎక్కువ భాగం ఫిజికల్ రూపంలో పుస్తకాలు ముద్రణ అవుతున్నాయి. పురాతన, అపురూపమైన పుస్తకాలను డిజిటల్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. చాలా చోట్ల చాలా మంది కవులు, రచయితలు చాలా సార్లు అంటున్న విషయమేమంటే మా పుస్తకాలను విద్యార్థులు, చదువరులు ఉపయోగించట్లేదు, మా పుస్తకాలు గ్రంథాలయంలో కొనుగోలు చేయడం లేదు, మా పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోవడం లేదు రానురాను రీడర్ షిప్ (చదివే అలవాటు) తగ్గిపోతున్నది అని పుస్తక ముద్రణ తగ్గుతున్నదని అంటున్నారు. ఒక విషయం చర్చించినట్లయితే ఇక్కడ రచయిత అభిలాష, సామర్థ్యంతో ఎంతో కష్టపడి ఒక పుస్తకాన్ని ప్రింటింగ్ చేసి చదువరుల అవసరార్థం ఉంచుతున్న మాట వాస్తవమే. వాస్తవ విషయాలను పరిశీలిస్తే, కవి, రచయిత ముద్రించిన పుస్తకం చదువరులకు అందుబాటులో ఉన్నదా లేదా, పుస్తకం ముద్రణ అయిన సమాచారం చదువరికి తెలుస్తుందా లేదా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది అంటే ఆ పుస్తకాన్ని చదువరి ఎందుకు చదవాలి అనుకుంటున్నాం. మనం రాస్తున్న పుస్తకం సమాజంలో డిమాండ్ ఉన్నదా లేదా, ఒకవేళ డిమాండ్ ఉన్నట్లయితే చదువరి సామర్థ్యానికి తగిన విధంగా రేటు ఉన్నదా లేదా అనే విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది.
పోటీపరీక్షల చదువరులే ఎక్కువ
రీడర్షిప్ గురించి చర్చించుకున్నట్లయితే రిడర్షిప్ తగ్గలేదు.కానీ వారు చదివే పుస్తకాల తీరు అవెన్యూ లు (ఎలక్ట్రానిక్ పుస్తకాలు, కిండేల్) వారి అవసరాలు మాత్రం మారాయి . ప్రస్తుత సమాజంలో విద్యార్థులు గానీ, చదువరులు కానీ గ్రంథాలయాల్లో అవసరానికి సంబంధించిన పుస్తకాలు గురించి చర్చించినట్లయితే నేడు 90 శాతం మంది కాంపిటేటివ్ కు సంబంధించిన పుస్తకాలు మాత్రమే చదువుతున్నారు. దానికి కారణం విద్యార్థులకు నవలలు, పోయెట్రీ, కథలు, జీవిత చరిత్రలు చదవాలని ఆసక్తి ఉన్నప్పటికిని అవసరం కోసం ఉద్యోగార్థం, ఉన్నత చదువుల కోసం కాంపిటేటివ్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది. ఒకనాడు పుస్తక పరిచయ కార్యక్రమాలు, సమీక్షలు గ్రంథాలయాలో, కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించి చదువరులకు పుస్తకాలపై ఆసక్తిని పెంచేవారు ప్రస్తుతం పుస్తక పరిచయ కార్యక్రమాలు ప్రైవేటు కార్యక్రమాలుగా మారిపోయాయి. ఏదీ ఏమైనా పుస్తకం ముద్రణ , రీడర్ షిప్ తగ్గుతుందన్న మాట హైపోతిటికల్ మాత్రమే. పుస్తక పఠనం నిత్య నూతనం. అదొక జీవనది.
- డా. రవి కుమార్ చేగొని,
ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ గ్రంథాలయ సంఘం