తెలుగు చేదైతే.. GINGER అల్లమెల్లిగడ్డనే అయితది

తెలుగు చేదైతే.. GINGER అల్లమెల్లిగడ్డనే అయితది

‘GINGER– జీ.. ఐ.. ఎన్..జీ..ఈ..ఆర్.. అల్లం ఎల్లిగడ్డ’ అని ఓ చిన్నారి చదివిన12 సెకండ్ల వీడియో నెట్​లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన కొందరు నవ్వుతుండగా.. మరికొంత మంది ఆన్​లైన్​ క్లాస్​ల ఎఫెక్ట్​ అని కామెంట్​ చేస్తున్నారు. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే ప్రైమరీ స్థాయిలో మాతృభాషకు పడుతున్న చీడ ఏమిటో అర్థమవుతుంది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ​మాతృభాషలో లేకపోతే వచ్చే అనర్థాలను తెలియజేస్తోంది. ఇంట్లో అమ్మానాన్న.. అంగట్లో అమ్మే వ్యక్తి అల్లం చూపుతూ.. ‘జింజర్’ అని అంటలేరు. ఇవన్నీ రోజూ చూసిన చిన్నారి ‘జీఐఎన్​జీఆర్’​అని చదివి పక్కనే ఉన్న ఫొటోను చూసి అల్లమెల్లిగడ్డ అన్నాడు. ఇంటా బయటా ఒక భాష.. బడిలో మరో భాష ఇలా పసిమొగ్గలమీద పరభాషను బలవంతంగా రుద్దడం వల్ల వారిలో గందరగోళం ఏర్పడుతోంది.

శ్రీకృష్ణదేవరాయల లాంటి సాహితీ కళాపోషకులతో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ప్రశంసలు అందుకున్న తెలుగు భాష రాను రాను చిన్నబోతోంది. ఇప్పుడు తెలుగు భాష చేదెక్కుతోంది. మాతృభాషలో పట్టుసాధిస్తేనే, మానవ మెదళ్లు స్వతంత్రంగా ఆలోచిస్తాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పేరెంట్స్ ​ఇంటి వద్ద సరైన సహాయసహకారులు లేకపోయినా.. పిల్లల్ని అనాలోచితంగా ఆంగ్ల మాధ్యమంలో వేస్తున్నారు. దీంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. చాలా రాష్ట్రాలు మాతృభాషకు ప్రాధాన్యతనిస్తుండగా.. తెలుగు రాష్ట్రాలు వెనకబడ్డాయి. జులైలో అప్పటి కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్ 2019–-20 అకడమిక్​ ఇయర్​కు సంబంధించి ‘ఏకీకృత జిల్లా విద్యా వ్యవస్థ సమాచారం(యూ‌‌డీ‌‌ఐ‌‌ఎస్‌‌ఈ)’ రిపోర్ట్ విడుదల చేశారు. 26.5 కోట్ల మంది స్టూడెంట్స్,15 లక్షల స్కూళ్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. పశ్చిమ బెంగాల్ మాతృ భాషలోనే స్కూల్​ఎడ్యుకేషన్ ​అందిస్తూ అన్ని రాష్ట్రాల కంటే మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 90% మంది స్టూడెంట్స్​ బెంగాలీ మీడియంలోనే చదువుతున్నారు. త్రిపుర, 1.2% బెంగాలీ మాట్లాడే జనాభా ఉన్న ఒడిశాలో కూడా 80% స్టూడెంట్స్ బెంగాలీ మాధ్యమాన్ని ఎంచుకోవడం ఆసక్తికరమైన అంశం. దేశవ్యాప్తంగా 42% విద్యార్థులు హిందీ మీడియం చదువుతుండగా, కాశ్మీర్​లో మొత్తం స్టూడెంట్స్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్​లో సగానికి పైగా విద్యార్థులు ఆంగ్లమాధ్యమాన్ని ఎంచుకున్నారు. సౌత్​ఇండియాలో కర్ణాటకలో 53.5 శాతం మంది కన్నడ మీడియం, తమిళనాడులో 42.5 శాతం తమిళ మీడియం, కేరళలో 35 శాతం మలయాళంలో చదువుతున్నారు. ఏపీలో 35 శాతం తెలుగు మీడియంలో చేరగా మిగిలిన 65 శాతం ఆంగ్లమాధ్యమంలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 25 శాతం విద్యార్థులు మాత్రమే తెలుగు మీడియం పాఠశాలల్లో చదువుతుండగా, 74 శాతం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చేరారు. ఇలా చాలా రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయి ఎడ్యుకేషన్​కూడా మాతృభాషలో అందకపోవడం భాషా, సామాజిక శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. 

తెలుగు కోసం ఉద్యమాలు 

నిజాం హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలోని బడుల్లో ఉర్దూ మాత్రమే బోధనామాధ్యమంగా ఉన్నప్పుడు తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో బోధన కోసం ఎందరో మహానుభావులు ఏండ్ల తరబడి పోరాటాలు చేశారు. అప్పటి ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలు, తాలూకాల్లోని పాఠశాలల్లో మాతృభాషల్లో బోధనకు అనుమతిచ్చింది.  స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్ర  తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం తెలంగాణ, మరట్వాడా (ఔరంగాబాద్, నాందేడ్, పర్భని, రాయచూర్, ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, తదితర) ప్రాంతాల్లో వారి మాతృభాషల్లోనే పాఠశాల విద్య అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.  ఆ తర్వాత దేశంలోనే మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, భాషను ఆధారంగా చేసుకొని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు దిక్సూచి అయింది. ఆంధ్రరాష్ట్రం మొదలుకొని తెలంగాణరాష్ట్రం ఏర్పాటు వరకు తెలుగు భాష/ తెలంగాణ మాండలికం ఒక  కీలక అస్త్రంగా మారిందంటే, ఒక భాషకున్న సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, అస్తిత్వ బలాలేమిటో అర్థం చేసుకోవచ్చు.  

తెలుగు బతకాలంటే..

తెలుగును ఒక సబ్జెక్టుగా అన్ని బడుల్లో కచ్చితంగా బోధించాలని డాంబికాలు ప్రదర్శిస్తూ, ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత అమలను పట్టించుకోవడమే మానేసింది. ఇక ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి పాఠశాలవిద్యలో తెలుగు మీడియమే లేకుండా చేసింది. కానీ, జాతీయ విద్యా విధానం – 2020 ప్రీప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్​మాతృభాషలోనే కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తదనుగుణంగా గల్లీలో ఉండే బడ్జెటు బడైనా గచ్చిబౌలిలోఉండే ఇంటర్నేషనల్ స్కూలైనా ఖచ్చితంగా తెలుగుమాధ్యమంలోనే బోధించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  కట్టుదిట్టమైనచర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో కర్ణాటకలో అమలవుతున్న విధానాలు అభినందనీయం. తెలుగు మీడియంలో చదివినవారికి ఉన్నత విద్య ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళనాడు రాష్ట్రం మాదిరిగా రిజర్వేషన్ కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘తెలుగు భాషా పరిజ్ఞానం’ పరీక్షను నిర్వహించి దానిలో అర్హత మార్కులు సాధిస్తేనే మిగిలిన పేపర్ల మూల్యాంకనాన్ని చేపట్టాలి. ఈ మూడు అంశాల కూర్పుతో ఒక కొత్త చట్టం తెచ్చి, వాటి అమలుకు  శ్రీకారం చుడితేనే తెలుగు ‘మృతభాష’ గండాన్ని తప్పించుకొని ‘మాతృభాష’గా కలకాలం వర్ధిల్లుతుంది. తెలుగుకు తెగులు రాకుండా చూసుకొనే బాధ్యత ప్రభుత్వానికి ఎంతుందో  ప్రజలపైనా అంతే ఉంది. ప్రజల్లో తెలుగుకు ఆదరాభిమానాలు కరువైనప్పుడు, ప్రభుత్వం ఎన్నిచట్టాలు రూపొందించినా వేస్ట్. ఈ చర్యలన్నీ మాతృభాషను పరిరక్షించుకోవాలనే తపన తప్ప వేరే భాషకు వ్యతిరేకం కాదు. ఇతర భాషలైన హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, మొదలైన వాటిని ద్వితీయ, తృతీయ భాషలుగా బోధించవచ్చు. కనీసం ఈ ‘అల్లం ఎల్లిగడ్డ’ వీడియోతోనైనా తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు, అధికారులు, ప్రభుత్వ పెద్దల్లో ప్రాథమిక విద్యాభ్యాసానికి మాతృభాషైన తెలుగు ఆవశ్యకత బోధపడి, ఆ దిశగా పాటుపడితే అదే మహాభాగ్యం.   

ప్రైవేటు బడుల్లో మితిమీరిన రూల్స్

ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో తెలుగు ఉచ్ఛారణే మహాపాపం అయింది ఈ రోజుల్లో. పిల్లలు వారి ఫ్రెండ్స్​, టీచర్స్ తో స్వేచ్ఛగా, సులువుగా వారి మాతృభాషల్లో మాత్రమే మాట్లాడగలిగే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో తప్పకుండా ఆంగ్లంలోనే మాట్లాడాలనే మితిమీరిన రూల్స్​పెడుతున్నారు. దీని వల్ల పిల్లలు ఏ భాషలోని పదాలనూ సరిగ్గా అర్థం చేసుకోలేక, ఏ పదాన్ని ఏ సందర్భంలో ఎలా వాడాలో తెలియక సతమతమవుతున్నారు. ఒక రకంగా వారిని మూడేండ్ల ప్రాయం నుంచే ‘బట్టీ’ పట్టే పద్ధతిలోకి బలవంతంగా నెట్టివేస్తున్నారు వారి తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తు కోసమై వారికి నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని బ్రిటన్ కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ఫిలిప్ బ్రౌన్ చెప్పారు. అయితే బ్రెజిల్ దేశానికి చెందిన విద్యావేత్త పౌలో ఫ్రేరే మాత్రం విద్యార్థికి, టీచర్​కు, సమాజానికి మధ్య సత్సంబంధాలు నెలకొల్పి, విద్యార్థి నిజ జీవితానికి సంబంధించిన రకరకాల పదాల అర్థాలను తనకుతానే తెలుసుకొని వివరించేలా టీచర్​ ప్రేరేపిస్తూ, ప్రేమతో మెలుగుతూ, ఓపికతో నేర్పించాలని సూచించారు. 

- డాక్టర్ శ్రీరాములు 
గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్