విటమిన్ - డి లోపానికి సూర్యరశ్మి.. సీ ఫుడ్​..

విటమిన్ - డి లోపానికి సూర్యరశ్మి.. సీ ఫుడ్​..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలి. విటమిన్స్, మినరల్స్.. ఇలా వీటిలో ఏది తక్కువైనా వెంటనే దాని ప్రభావం శరీరంపై పడుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ, కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్య వచ్చినా అది దేనివల్ల వచ్చిందో తెలుసుకోలేకపోతారు. అలాంటప్పుడు చిన్నది కాస్తా పెద్ద సమస్యగా మారి మెడకు చుట్టుకుంటుంది.

అప్పుడు లబోదిబోమనడం కంటే ముందే మేల్కొంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఇటీవల జరిగిన ఒక రీసెర్చ్​లో విటమిన్​ – డి లోపం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే తగు చర్యలు తీసుకోకపోతే దానివల్ల అనేక అనర్థాలు జరగొచ్చని చెప్తున్నారు. అసలు ఆ స్టడీ ఏంటి? విటమిన్​ – డి లోపం గురించి డాక్టర్లు 

ఏంచెప్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 


ఐసీఆర్​ఐఇఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్​ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) ఇనిస్టిట్యూట్, ఎఎన్​వికెఎ హెల్త్​కేర్ ఫౌండేషన్ కలిసి ఇండియాలో డి – విటమిన్ డెఫీషియెన్సీపై స్టడీ చేశారు. ఈ స్టడీలో డి – విటమిన్​ లోపంతో బాధపడుతున్న ప్రాంతాల గురించి తెలియజేశారు. స్టడీ ప్రకారం ప్రాంతాన్ని బట్టి ఈ సమస్య హెచ్చుతగ్గులు ఉన్నట్టు గుర్తించారు.

ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో 39 శాతం ప్రజలు విటమిన్​ – డి లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. ఈ లోపాన్ని వెంటనే గుర్తించలేమని, ఇది కేవలం ఎముకల ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే కాదని తెలిపారు. శరీరంలోని ఇమ్యూనిటీని బాగా ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉందని రీసెర్చ్​లో పాల్గొన్న డాక్టర్లు చెప్పారు. అలాగే ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, దేశ ఆరోగ్య శాఖ, ఆర్థిక పరిస్థితులపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందన్నారు.

వీళ్లకు రిస్క్!

విటమిన్​ – డి ఎక్కువగా చిన్నపిల్లలు, కౌమారదశ, గర్భిణీలు, వృద్ధుల్లో లోపిస్తుందని ఈ రీసెర్చ్​లో తేలింది. అయితే అందులోనూ ఆడవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని రీసెర్చర్లు చెప్పారు. దీనికి అసలు కారణాలేంటి? అనే అంశంపై డాక్టర్ చంద్రశేఖర్ ఇలా స్పందించారు.

ఆ టైంలో ఎండ తగిలితే..

విటమిన్​ – డి బయట తయారుచేసేది కాదు. మన శరీరంలోనే తయారవుతుంది. అందుకు సూర్యరశ్మి ఉపయోగపడుతుంది. అదెలాగంటే.. సూర్యరశ్మి నుంచి అల్ట్రా వయెలెట్ (యూవీ) కిరణాలు శరీరాన్ని తాకాలి. తద్వారా మన శరీరంలోని కొలెస్ట్రాల్​ లివర్​, కిడ్నీల్లో రసాయన చర్య జరిగి విటమిన్ – డి ​గా మారుతుంది.

అయితే ఒక్కో ప్రాంతాన్ని బట్టి అల్ట్రా వయొలెట్ రేస్ ఒక్కో టైంలో బలంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో అయితే పది గంటల నుంచి మూడు గంటలలోపు ఎండ తగిలితే విటమిన్​ – డి తయారవ్వడానికి ఉపయోగపడుతుంది.15 నుంచి 30 నిమిషాల వరకు ఎండలో ఉంటేనే విటమిన్ – డి తయారవుతుంది. అయితే చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఆ టైంలో ఎండలోకి వెళ్లరు. వెళ్లినా ఎక్కువసేపు ఉండలేరు. దానివల్ల వాళ్లలో డి– విటమిన్​ లోపిస్తుంది. 

ఎముకల కోసం..

అసలు విటమిన్​ – డి శరీరంలోని కాల్షియాన్ని గ్రహిస్తుంది. అది ఎముకల్లోకి వెళ్లి బలంగా తయారవుతాయి. విటమిన్ – డి లోపిస్తే.. కాల్షియం ఎంత తీసుకున్నా శరీరం దాన్ని ఉపయోగించుకోలేదు. అందువల్ల ఎముకలు బోలుగా, మెత్తగా అయిపోయి విరిగిపోతుంటాయి. సాధార ణంగా ఈ స్థితి పిల్లల్లో కనిపిస్తుంది.16 ఏండ్ల లోపు పిల్లల్లో డి– విటమిన్ లోపించ డం వల్ల కాళ్లు వంకరలు తిరుగుతాయి. దాన్ని రికెట్స్ వ్యాధి అంటారు. ఇదంతా అస్థి పంజరం ఎదుగుదల ( స్కెలిటల్ మెచ్యూరిటీ) కాక ముందు కనిపించే స్థితి.

అదే స్కెలిటల్ మెచ్యూరిటీ అయ్యాక విటమిన్​ – డి లోపిస్తే ఎముకలు నొప్పులు, వెన్నుపూస విరిగి పోవడం, చిన్నగాయాలకే ఫ్రాక్చర్స్​ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. ఈ కండిషన్​ని ఆస్టియోమలాసియా అంటారు. విటమిన్​ – డి లోపిస్తే కాల్షియం శోషణ తగ్గుతుంది. తద్వారా ఎముకల్లో దృఢత్వం తగ్గి, ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

పల్లె - పట్నానికి తేడా లేదు

ఈమధ్య టెస్ట్​లు ఎక్కువగా చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ సమస్యలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. విటమిన్ – డి లోపం విషయంలో పల్లె, పట్నం ప్రజలకు పెద్దగా తేడా లేదు. సౌత్​ ఇండియాలో
ప్రజలకు మెలనిన్​ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల విటమిన్​ – డి శోషణకు కాస్త అడ్డం పడుతుంది. అలాంటివాళ్లు రోజూ గంట, అంతకంటే పైనే ఎండలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు. తెల్లని చర్మం ఉన్నవాళ్లకు సూర్యరశ్మి తగలగానే విటమిన్​ – డి సింథసిస్ ఈజీగా జరుగుతుంది. అలాగే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే బట్టలు వేసుకునేవాళ్లకు సూర్యరశ్మి అస్సలు తగలదు. అలాంటివాళ్లలో  కూడా విటమిన్​ – డి లోపం కనిపిస్తుంది.

విటమిన్​ లోపించకుండా.. 

ప్రెగ్నెన్సీలో విటమిన్​ – డి అవసరం ఎక్కువ. కాబట్టి గర్భిణీలు ఎక్కువగా విటమిన్​ – డి మెయింటెయిన్ చేయాలి. సరిపడా లేకపో తే లోపం కనిపిస్తుంది. అలాంటప్పుడు సరైన ఆహారం తీసుకోవాలి. కాడ్ లివర్ అయిల్, సాల్మన్​ ఫిష్​, ట్యూనా ఫిష్​ వంటివి తీసుకోవాలి. కానీ, ఇవి మనదగ్గర రెగ్యులర్​గా తీసుకోరు. విదేశాల్లో అయితే వాళ్లు తినే ఫుడ్, డ్రింక్స్​లో ఫోర్టిఫికేషన్ ఉంటుంది. అంటే.. విటమిన్స్​ని జోడిస్తారు. మన ఫుడ్స్​లో అలాంటివేం ఉండవు. కానీ, ఫోర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఎండ తగలకపోయినా శరీరానికి డి– విటమిన్ అందుతుంది. 

ఇకపోతే మన దగ్గర దొరికే వాటిలో ఫోర్టిఫికేషన్ చేయరు. కాబట్టి కోడిగుడ్డు, మాంసం, సీ ఫుడ్​, సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే సప్లిమెంట్స్ అనేవి డాక్టర్ సలహాతో మాత్రమే వాడాల్సి ఉంటుంది. డాక్టర్స్ కూడా వీటిని రెగ్యులర్​గా తీసుకోమని చెప్పరు. 65 ఏండ్ల లోపు వాళ్లకు కనీసం 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరమ వుతాయి. అదే అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లు, ప్రెగ్నెంట్ లేడీస్​కు1000 ఇయూ అవసరమవుతుంది. దాన్నిబట్టి విటమిన్​ – డి లెవల్స్​ని బ్యాలెన్స్ చేసుకోవాలి. 

భయపడాల్సిన పనిలేదు

రీసెర్చ్ ప్రకారం విటమిన్​ – డి లోపం వల్ల కండరాల బలహీనత, అలసట, మూడ్​ చేంజెస్​, డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. ఇంకా ముదిరితే గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్​ వంటి వాటికి కారణమవ్వొచ్చు అని తెలిపారు. కానీ, విటమిన్​-డి లోపం వల్ల ఈ సమస్యలు రావడం చాలా అరుదు. ఎందుకంటే ఇది డైరెక్ట్​గా ఎఫెక్ట్ చూపించే అవకా శమే లేదు. అందువల్ల భయపడాల్సిన పనిలేదు. - డాక్టర్. చంద్రశేఖర్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ డిపార్ట్​మెంట్, నిమ్స్