- ఇన్చార్జిగా నియమించినా ఒక్కసారి కూడా వెళ్లని ఆఫీసర్
- పరీక్షలు దగ్గర పడుతున్నా.. పనులన్నీ పెండింగ్
- మరో 300 ప్రైవేటు కాలేజీల గుర్తింపుపై స్పష్టత కరువు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌లో ఇన్‌చార్జ్‌ల పాలన నడుస్తోంది. ఆ విభాగానికి రెగ్యులర్ ఐఏఎస్ ఆఫీసర్ లేకపోవడంతో కీలకమైన పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. ఇన్చార్జ్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించినప్పటికీ ఇతర పనుల హడావుడిలో అసలు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ సంబంధించిన పనులేవీ ప్రారంభం కాలేదు. విద్యారంగంలో ఇంటర్ డిపార్ట్ మెంట్ కీలకమైంది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఇంటర్ కమిషనర్ గా ఒక్క ఐఏఎస్‌కే బాధ్యతలు ఇస్తున్నారు. గత నెలలో ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా ఉన్నత చదువుల కోసం విదేశాలకు సెలవుపై వెళ్లారు.
దీంతో సెప్టెంబర్ 16 నుంచి ఆ బాధ్యతలను కాలేజీ విద్యాశాఖ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా రెండు బాధ్యతలు చూస్తున్న శ్రీదేవసేనకు ఇంటర్ బోర్డు సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీల సీట్ల అంశంపై గొడవలు ఎక్కువగా ఉండడంతో ఆమె అటువైపే సమయం ఇచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ దీనిపై అప్పీల్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. ఆ పనుల్లో బిజీగా మారారు. దీంతో ఇంటర్మీడియెట్‌కు సమయమే ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే తనకు ఇప్పటికే రెండు బాధ్యతలున్న నేపథ్యంలో, ఇంటర్ బోర్డు బాధ్యతలను తప్పించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను కోరినట్టు తెలిసింది. అయినా, ఇప్పటికీ ఆ అంశంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు ఇన్చార్జ్ సెక్రటరీ శ్రీదేవసేనను కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రలోని పలు సెగ్మెంట్లలో ఎన్నికల పరిశీలకురాలుగా నియమించింది. దీంతో ఆమె ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.
మొదలు కాని పరీక్షల ఏర్పాట్లు..
ఇంటర్ పరీక్షల పనులు ఏటా అక్టోబర్ మొదటి వారంలోనే ప్రారంభమవుతాయి. కానీ, ఈ ఏడాది మాత్రం ఇంతవరకూ మొదలుకాలేదు. కనీసం ఎగ్జామ్ ఫీజు డేట్లనూ ప్రకటించలేదు. దీంతో ఫైళ్లన్నీపెండింగ్లో ఉన్నాయి. మరోపక్క మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో నడుస్తున్న 300 ప్రైవేటు కాలేజీలకు ఇంతవరకూ ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ఆ కాలేజీల్లో చదువుతున్న సుమారు లక్ష మంది పరిస్థితి అయోమయంలో పడింది. కాలేజీల షిఫ్టింగ్ ఫైళ్లూ ఆగిపోయాయి. అయితే, రెగ్యులర్ ఆఫీసర్ ఉంటే.. ఆయా కాలేజీల సమస్య పరిష్కారం అయ్యేదనే వాదనలూ ఉన్నాయి.
నిర్ణయాల్లో జాప్యం
ప్రస్తుతం బోర్డు సెక్రటరీగా శ్రీదేవసేన ఇన్చార్జ్గా ఉండగా, పరీక్షల విభాగంలోకి కీలక అధికారులూ ఇన్ చార్జ్‌లే కొనసాగుతున్నారు. వరంగల్ ఇంటర్ ఆర్జేడీ జయప్రద బాయి.. ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ గా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బోర్డు జాయింట్ సెక్రటరీ మోహన్‌కు.. ఎగ్జామినేషన్ జేఎస్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన పరీక్షల సమయంలో రెగ్యులర్ బోర్డు సెక్రటరీ లేకపోవడంతో.. ఉన్న ఆఫీసర్లు ఇన్‌చార్జ్‌లే కావడంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని, ఇంటర్ బోర్డుకు రెగ్యులర్ ఆఫీసర్‌ను నియమించాలని లెక్చరర్లు, పేరెంట్స్, స్టూడెంట్లు కోరుతున్నారు.