ములుగు, వెలుగు: మావోయిస్టు వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ సభ్యుడు లేఖం లచ్చు అలియాస్ అశోక్ మంగళవారం ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ములుగులో ఇన్చార్జి ఓఎస్డీ ఎన్.రవీందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. చత్తీస్ గఢ్రాష్ర్టం బీజాపూర్ జిల్లా టెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద గెలూర్ కు చెందిన లచ్చు ఏటూరునాగారం మహదేవ్ పూర్ ఏరియా కమిటీ సభ్యుడు నలమారి అశోక్‌తో కలిసి 2022లో మావోయిస్టు పార్టీలో చేరి 2023 జనవరి వరకు మిలీషియా సభ్యుడిగా పనిచేశాడు. అనంతరం రెండేండ్ల పాటు పార్టీ సభ్యుడిగా పనిచేశాడు.
2024 ఏప్రిల్ లో వెంకటాపురం పరిధిలోని కర్రిగుట్టపై జరిగిన ఎన్కౌంటర్ లో లచ్చు తప్పించుకున్నాడు. కర్రిగుట్ట అటవీ ప్రాంతం పరిధిలో పలు ప్రెషర్ మైన్స్ అమర్చిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి ప్రశాంతమైన జీవనాన్ని గడిపేందుకు నిర్ణయించుకున్న లచ్చు మంగళవారం ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావాలని, పోలీసులకు లొంగిపోవాలని ఓఎస్డీ పిలుపునిచ్చారు. ఆయన వెంట ఆర్ఐ ఆపరేషన్స్ సంతోష్ ఉన్నారు.