ఆదిలాబాద్​లో నలుగురు దుర్మరణం

  • పెండ్లి షాపింగ్​కెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
  • మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు
  • మేడ్చల్-మల్కాజిగిరిలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి
  • శ్రీశైలం వెళ్లి సంగారెడ్డి వస్తుండగా లారీని ఢీకొట్టిన కారు

 

ఆదిలాబాద్/మేడ్చల్, వెలుగు : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. పెండ్లి షాపింగ్​ పూర్తి చేసుకుని హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్​ వెళ్తున్న ఘటనలో నలుగురు, శ్రీశైలం వెళ్లి సంగారెడ్డికి తిరిగి వెళ్తుండగా ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది దగ్గర సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు డ్రైవర్​ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్ నగర్​కు చెందిన సయ్యద్ రఫతుల్లా (56) పంచాయతీరాజ్ లో డిప్యూటీ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈయన చిన్న కూతురు జుబియ హష్మీ పెండ్లి, హైదరాబాద్ కు చెందిన వ్యక్తి తో ఫిక్స్ అయింది. డిసెంబర్ 25న ముహూర్తం పెట్టుకోగా, షాపింగ్​ కోసం 2రోజుల కింద రఫతుల్లా ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్లింది. షాపింగ్​ పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి టీఎస్​ 07ఎఫ్​యూ 3897 నెంబర్​ ఎర్టిగా కారులో ఆదిలాబాద్​కు బయలుదేరింది. రాత్రి 11.30 గంటలకు సితాగోంది వద్దకు రాగానే కారును టీఎన్​88ఈ 7816 నెంబర్​గల లారీ ఢీకొట్టింది. దీంతో కారు వేగంగా వెళ్లి ముందున్న కంటైనర్లో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో సయ్యద్ రఫతుల్లా అహ్మద్ (56), అతని పెద్ద బిడ్డ షబీయా హష్మీ (26), రఫతుల్లా తమ్ముడు అఫ్రోజ్​ అహ్మద్ పెద్ద కొడుకు వజహద్ (20), డ్రైవర్​ షంషుద్దీన్​ (52) చనిపోయారు. రఫతుల్లా చిన్న కూతురు జుబియా హష్మీకి తీవ్ర గాయాలు కాగా, రిమ్స్​లో చికిత్స పొందుతున్నది. 

రెండు కుటుంబాల్లో విషాదం
ఆదిలాబాద్ కేఆర్కే కాలనీకి చెందిన డ్రైవర్​ షేక్ షంషుద్దీన్ (52)కి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు పెండ్లి కాగా, చిన్నకూతురు పెండ్లి ఇటీవలే ఫిక్స్​ అయ్యింది. ఈ యాక్సిడెంట్​ అటు రఫతుల్లా, ఇటు షంషుద్దీన్​ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న ఇచ్చోడ సీఐ నైలు నాయక్, గుడిహత్నూర్ ఏఎస్సై రెహ్మాన్​తో కలిసి స్పాట్ కు సహాయక చర్యలు చేపట్టారు. నలుగురి మృతదేహాలకు రిమ్స్​లో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెనుక లారీ డ్రైవర్​ నిద్రమత్తులో అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం, దీనికితోడు మూలమలుపు, డౌనల్​ ఉండటంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారును ఢీకొట్టిన లారీ, సీతాగోంది వద్ద పెట్రోల్​ బంక్ వద్ద బోల్తా కొట్టిందని, తర్వాత లారీ డ్రైవర్​ పరారైనట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

శ్రీశైలం నుంచివస్తుండగా ప్రమాదం
శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ఘటన మల్కాజిగిరి పరిధిలోని ఓఆర్ఆర్ పై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సంగారెడ్డి జిల్లా చిట్కుళ్లకు చెందిన శంకర్ గుప్తా (46) కిరాణా షాప్ నడుతున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి టాటా వింగర్ వెహికల్లో శ్రీశైలం దేవస్థానానికి వెళ్లాడు. స్వామివారిని దర్శించుకుని సాయంత్రం 5 గంటలకు సంగారెడ్డికి బయలుదేరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కండ్లకోయ-దుండిగల్ ఓఆర్ఆర్ పై రాగానే కారు, ముందున్న కంటైనర్​ను ఢీకొట్టింది. కారు డ్రైవర్ పడమటి నరసింహా రెడ్డి(30), శంకర్ గుప్తా(45), అతని బంధువు సురేశ్ (48) స్పాట్​లోనే చనిపోయారు. మరో 9మందికి గాయాలు కాగా, వారిని పోలీసులు సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్​కు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి క్రిటికల్​గా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. నరసింహా రెడ్డి నిద్రమత్తులోకి వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.