తహసీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం

చేర్యాల, వెలుగు: తహసీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. మద్దూరు మండలం లద్నూరుకు చెందిన రామస్వామి తన పేరిట ఉన్న భూమిలో ఇద్దరు మనవళ్లు హరీశ్, భానుకు 32 గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేసేందుకు శుక్రవారం స్థానిక తహసీల్దార్  ఆఫీసుకు వెళ్లాడు. రామస్వామి చిన్న కొడుకు కనకరాజు వెళ్లి మనవళ్ల పేరిట భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తావని తండ్రితో గొడవ దిగాడు. 

దీంతో  కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో తహసీల్దార్  రిజిస్ట్రేషన్ నిలిపేశాడు. తనకు సమాచారం ఇవ్వకుండా తండ్రి భూమిని ఎలా పంచుతాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంట తెచ్చుకున్న పురుగుల మందును కనకరాజు తాగేందుకు యత్నించగా వెంటనే అక్కడున్నవారు అడ్డుకున్నారు.  తహసీల్దార్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో వచ్చి కనకరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల మధ్య భూ గొడవల కారణంగా రిజిస్ట్రేషన్ నిలిపేసినట్టు మద్దూరు తహసీల్దార్ రహీం తెలిపారు.