కరీంనగర్ : చొప్పదండికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన చావుకు సెంట్రల్ ఇంటలిజెన్స్ (ఐబీ) సీఐ గోపికృష్ణ కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి.. చనిపోవడం చర్చనీయాంశంగా మారింది.
సూసైడ్ నోట్ లో పేర్కొన్న అంశాల ఆధారంగా..
చొప్పదండి మండలంలోని భూపాలపట్నంలో సెంట్రల్ ఇంటలిజెన్స్ (ఐబీ) సీఐగా పనిచేస్తున్న గోపికృష్ణ (గోపాలకృష్ణ)కు 30 గుంటల స్థలం ఉంది. దీన్ని అమ్మి రూ.10 లక్షల లాభం వచ్చేలా చూస్తానని బొడిగ శ్యామ్.. గోపికృష్ణకు హామీ ఇచ్చి.. అమ్మించలేకపోయాడు. దీంతో తనను తీవ్ర వేధింపులకు సీఐ గోపాలకృష్ణ గురి చేశాడని సూసైడ్ లెటర్ లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు శ్యామ్. తన చావుకు గోపి సార్ కారణమంటూ సూసైడ్ లెటర్ తో పాటు డైరీలోనూ లేఖ రాసి.. తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా కుటుంబంతో కలిసి కరీంనగర్ లో నివాసం ఉంటున్న శ్యామ్.. ఏప్రిల్ 21న చొప్పదండి వెళ్లి... తన సొంత ఇంట్లో ఉరి వేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు.
సీఐ గోపికృష్ణ నుంచి తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని, తాను రాసిన సూసైడ్ నోట్ ను, డైరీని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి అందించాలని తన బంధువులు, స్నేహితులను కోరాడు శ్యామ్.
విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్యామ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు.. సీఐ గోపికృష్ణ తీరు పోలీస్ డిపార్ట్ మెంట్ లో చర్చనీయాంశంగా మారింది.