
పరకాల, వెలుగు : ఇంటర్‌లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. కూతురు దక్కదేమోనన్న బెంగతో తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్‌లో సోమవారం జరిగింది. రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన గాజ శ్రీవిద్య గతేడాది ఇంటర్ ఫెయిల్ కావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఈ ఏడాది మరోసారి పరీక్షలు రాయగా మళ్లీ ఫెయిల్ అయింది.
దీంతో మనస్తాపానికి గురైన శ్రీవిద్య సోమవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను పరకాలలో ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అయితే కూతురు బతుకుతుందో లేదోనన్న బెంగతో ఆమె తండ్రి గాజ కుమారస్వామి (47) కంఠాత్మకూరు శివారులోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీవిద్య పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.