కాన్పు తర్వాత బాలింత మృతి.. డాక్టర్ నిర్లక్ష్యమేనంటూ బాధిత కుటుంబం ఆందోళన

సత్తుపల్లి, వెలుగు : కాన్పు తర్వాత బాలింత మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి పిల్లి భాస్కర్ హైదరాబాద్ లో ప్రైవేట్ఉద్యోగి. అతని భార్య స్నేహలత(30) నిండు గర్భిణి కాగా.. కొద్దిరోజుల కింద సత్తుపల్లి టౌన్ లోని ఓ సీనియర్ వైద్యురాలి ప్రసూతి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తొలిసారి గర్భం దాల్చడంతో కాన్పుకు ఇబ్బంది పడడంతో డాక్టర్ సిజేరియన్ చేశారు. బిడ్డను ప్రసవించిన తర్వాత స్నేహలతకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  వెంటనే మెరుగైన చికిత్సకు ఖమ్మం తరలించాలని కుటుంబసభ్యులకు డాక్టర్ సూచించారు. 

అనంతరం స్నేహలత తల్లిదండ్రులు, భర్త ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులుగా ఎమర్జెన్సీ లో ట్రీట్ మెంట్ పొందుతూ బుధవారం తెల్లవారుజామున స్నేహలత మృతిచెందింది. కాన్పు చేసిన ఆస్పత్రి డాక్టర్ నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డెడ్ బాడీని సత్తుపల్లిలోని ఆస్పత్రికి తీసుకొస్తున్నారని ముందుగానే తెలుసుకుని యాజమాన్యం రూ. 10 లక్షలతో సెటిల్ మెంట్ చేసుకోగా.. పరిస్థితి సద్దుమణిగింది. నెల రోజుల్లోనే ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో ఆయా ఆస్పత్రులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.