కాగజ్ నగర్, వెలుగు : ఆస్తి కోసం సొంత చిన్నమ్మ ను హత్య చేసిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం బెజ్జూర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ విక్రమ్ తెలిపిన ప్రకారంగట్టు చంద్రకళ (60), కేశా గౌడ్ దంపతులకు సంతానం లేదు. గతంలో వెంకటేష్ గౌడ్ ను చేరదీశారు. అయితే వీరి ఆస్తిపై కేశ గౌడ్ అన్న కొడుకు గట్టు వెంకటేశ్ గౌడ్ అలియాస్ తిరుపతి గౌడ్ కన్నేశాడు. ఆస్తి కోసం చిన్నమ్మ, చిన్నాన్నలను హతమార్చాలని ప్లాన్ వేశాడు. శుక్రవారం సొంతూరు కన్నేపల్లి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెజ్జూ ర్ వచ్చాడు. అక్కడ చిన్నమ్మ, చిన్నాన్న లతో ఆస్తి కోసం గొడవ పడ్డాడు.
విచక్షణ కోల్పోయిన వెంకటేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో చిన్నమ్మపై దాడి చేశాడు. అడ్డుపడ్డ చిన్నాన్నపై కూడా దాడి చేశాడు. అప్పటికే కేశ గౌడ్ అరవడం తో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. గాయపడ్డ చంద్రకళ ను హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేయగా ఆమె అప్పటికే మృతి చెందింది. కేశ గౌడ్ గాయాలతో బయటపడ్డాడు. ఎస్ఐ విక్రమ్ , సీఐ సాదిక్ పాషా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.