మహంకాళి పీఎస్ పరిధిలో కలకలం రేపిన ఆరేండ్ల బాలిక మిస్సింగ్
సికింద్రాబాద్, వెలుగు : మహంకాళి పీఎస్ పరిధిలో ఆరేండ్ల బాలిక మిస్సింగ్, కిడ్నాప్ ఘటన శుక్రవారం కలకలం రేపింది. ఐదు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు సిద్ధిపేట జిల్లాలో బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ ను అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడలో ఉండే నర్సింగ్, రేణుక దంపతులు సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని ఎలక్ట్రానిక్స్ షాప్‌లో పనిచేస్తున్నారు. వీరి కుమార్తె కృతిక(6) ఒకటో తరగతి చదువుతోంది. శుక్రవారం కృతికను జనరల్ బజార్లో ఉండే అమ్మమ్మ ఇంటి దగ్గర విడిచిపెట్టి రేణుక డ్యూటీకి వెళ్లింది. ఉదయం 11 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటున్న కృతిక కనిపించకుండాపోయింది. వెంటనే రేణుక తల్లి ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మహంకాళి పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. పోలీసులు వెంటనే చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బాలిక ఓ వ్యక్తితో కలిసి నడుచుకుంటూ వెళ్లిన్నట్లు గుర్తించారు.
ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ...
బాలికను తన వెంట తీసుకెళ్లిన వ్యక్తి దగ్గరలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. మహంకాళి ఆలయం దగ్గరకు వచ్చాక సీసీ ఫుటేజ్‌లో ఇద్దరూ కనిపించకపోవడంతో ఆ వ్యక్తి బాలికను ఎటు వైపు తీసుకెళ్లాడో అర్ధం కాక పోలీసులు 10 టీమ్‌లుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక కిడ్నాప్ విషయం తెలుసుకున్న స్థానిక ఆటో డ్రైవర్ మహేందర్ పోలీసులను సంప్రదించాడు. బాగా తాగి ఉన్న ఓ వ్యక్తి బాలికను తీసుకుని తన ఆటో ఎక్కాడని.. అతడిని జూబ్లీ బస్ స్టేషన్లో దింపానని పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు.. జూబ్లీ బస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. బస్‌స్టేషన్‌లో బాలికతో కలిసి ఆటో దిగిన దుండగుడు జేబీఎస్లో కొద్దిసేపు అటు ఇటూ తిరిగాడు. తర్వాత బాలికను తీసుకుని సిద్దిపేట బస్సు ఎక్కాడు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట గ్రామంలో దిగాడు. బాలికను తీసుకుని వెళ్తుండగా.. గ్రామస్తులు అనుమానంతో అతడిని నిలదీశారు. అదే టైమ్‌లో గ్రామ సర్పంచ్ కూడా అక్కడికి వచ్చాడు. ఎక్కడ ఉంటావని బాలిక అడిగాడు. తాను చిలకలగూడలో ఉంటానని కృతిక చెప్పింది. వెంటనే సర్పంచ్, గ్రామస్తులు సదరు వ్యక్తిని పట్టుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే బాలిక కిడ్నాప్ విషయంపై అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందింది. ధూళిమిట్ట పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తితో పాటు బాలికను పీఎస్‌కు తీసుకెళ్లారు. నార్త్‌జోన్ ఆఫీసుకు సమాచారమిచ్చారు. తప్పిపోయిన బాలికను కృతికగా నిర్దారించారు. వెంటనే ధూళిమిట్ట పోలీసులు వీడియో కాల్ ద్వారా బాలికను ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించారు. కేవలం 5 గంటల్లోనే ఈ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను నార్త్‌జోన్ డీసీపీ అభినందించారు. బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని రాము(36)గా పోలీసులు గుర్తించారు. ధూళిమిట్టకి చెందిన రాము మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు.
కిడ్నాప్ తర్వాత కత్తెర కొన్న సైకో రాము
సికింద్రాబాద్ జనరల్ బజార్ దగ్గర కృతికను కిడ్నాప్ చేసిన రాము కొద్ది దూరం వెళ్లాక ఓ షాప్‌లో కత్తెర కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కత్తెరతో పాప చెవులకు ఉన్న ఒక గ్రాము బంగారు కమ్మలను కత్తించి వాటిని ఒక పేపరులో చుట్టి తన జేబులో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఆటోలో జేబీఎస్‌కు చేరుకుని సిద్దిపేట బస్సు ఎక్కి తన సొంతూరు ధూళిమిట్టకు వెళ్లి అక్కడి గ్రామస్తులకు చిక్కాడు. రాము ఏ పని లేకుండా సిటీలో జులాయిగా తిరుగుతుంటాడని..తనకు ఇష్టమొచ్చినప్పుడు సొంతూరికి వెళ్తుంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలికతో పాటు రామును ధూళిమిట్ట నుంచి సిటీకి తీసుకొచ్చిన్నట్లు డీసీపీ చందనా దీప్తి తెలిపారు. కృతికను తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. రాముపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు.