
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
శంకర్పల్లి, వెలుగు: ఒంటరి వృద్ధురాలితో చనువు పెంచుకున్నాడు. ఆమె హత్యకు యత్నించి సొత్తు దోచుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో చోటు చేసుకుంది. నార్సింగి ఏసీపీ లక్ష్మినారాయణ, సీఐ వినాయక్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్కి చెందిన బాలమ్మ(55) వృద్ధురాలు. ఒంటరి ఉంటుండగా, ఆమె ఇంటి పక్కన నివసించే మహిళ తండ్రి షాబాద్ మండలం దోసాడకి చెందిన శంకరయ్య తరచూ కూతురి వద్దకు వచ్చి వెళ్తుండేవాడు.
దీంతో వృద్ధురాలితో ఆయన చనువు పెంచుకున్నాడు. వృద్ధురాలి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆమెను హత్య చేసి సొత్తు దోచుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాలమ్మ ఇంటికి వెళ్లిన శంకరయ్య తలుపుకొట్టి లేపాడు.
అనంతరం ఆమెను కిందపడేసి తలపై దిండును అదిమిపెట్టాగా స్పృహ కోల్పోయింది. చనిపోయిందనుకుని శంకరయ్య ఆమె ఇంట్లోని 50 తులాల వెండి, 7 గ్రాముల బంగారం, 5 వేల నగదు తీసుకుని ఇంటికి తాళం వేసి పారిపోయాడు.
ఉదయం బాలమ్మకు మెలకువ వచ్చి లేచి గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వచ్చి తాళం తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా సీసీ కెమెరాల ఫుటేజ్ ల ఆధారంగా నిందితుడిని 10 గంట్లలోనే పట్టుకుని, సొత్తు రికవరీ చేసి కేసు నమోదు చేశారు.
దొంగను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన డీఐ నాగరాజు, క్రైమ్ ఎస్ ఐ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు నాగభూషణం, శ్రీనివాస్‌లను ఏసీపీ అభినందించారు.