వైట్నర్ మత్తులో గొడవ..బీర్​బాటిల్​తో దాడి

వైట్నర్ మత్తులో గొడవ..బీర్​బాటిల్​తో దాడి

ఒకరికి తీవ్ర గాయాలు.. అసెంబ్లీ సమీపంలో ఘటన

బషీర్ బాగ్, వెలుగు : వైట్నర్​ మత్తులో ఓ యువకుడిపై బీర్​బాటిల్​తో దాడి చేసిన ఘటన నాంపల్లి పీఎస్​పరిధిలో జరిగింది. బుధవారం పబ్లిక్ ​గార్డెన్​సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వైట్నర్ మత్తులో నాంపల్లి ఆఘపురాకు చెందిన గౌస్(28)పై బీర్​బాటిల్​తో దాడిచేశారు. అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగినా పోలీసులు రాలేదని, అంబులెన్స్​కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలతో రక్తరపు మడుగులో పడి ఉన్న గౌస్​ను 30 నిమిషాల తర్వాత నాంపల్లి పోలీసులు వచ్చి ఉస్మానియాకు తరలించారన్నారు.

దాడి చేసినవారు పరారీలో ఉన్నారని నాంపల్లి సీఐ  రాజు నాయక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో కొంతమంది వైట్నర్ తీసుకుని తరచూ గొడవలు పడుతున్నారని, సమీప బస్ స్టాండ్ లో మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.