తండ్రి, కొడుకు.. పక్కింటి వ్యక్తి తల నరికిన్రు

తండ్రి, కొడుకు.. పక్కింటి వ్యక్తి తల నరికిన్రు
  • నరికిన తలను స్టేషన్ కు తీసుకెళ్లిన్రు 
  • మహారాష్ట్రలో దారుణం.. న్యూఇయర్ రోజు గొడవే కారణం  

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో బుధవారం ఉదయం దారుణం జరిగింది. దిండోరి తాలూకాలోని నానాషి గ్రామంలో ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి వారి పక్కింట్లో నివసిస్తున్న వ్యక్తిని గొడ్డలి, కొడవలితో నరికి చంపారు. అంతటితో ఆగకుండా డెడ్ బాడీ నుంచి తలను వేరుచేసి.. దాన్ని తీసుకుని నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. 

నానాషి గ్రామంలోని సురేశ్ బోకె (40)కు తన పక్కింట్లో నివసించే గులాబ్ రామచంద్ర వాగ్మారే (35)మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. ఇటీవల కూడా ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో  డిసెంబర్ 31న ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనతో సురేశ్ బోకె కుటుంబం పగతో రగిలిపోయింది. 

అంతే న్యూఇయర్ వేళ.. బుధవారం ఉదయం సురేశ్ బోకె, తన కొడుకుతో కలిసి గులాబ్ రామచంద్ర వాగ్మారే ను గొడ్డలి, కొడవలితో నరికి హత్య చేశారు. అనంతరం గులాబ్ రామచంద్ర పీకను కత్తితో కత్తిరించి తలను తీసుకుని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

బాధిత కుటుంబ సభ్యులు స్థానికులతో  కలిసి నిందితుల ఇల్లును, కారును ధ్వంసం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసుల బలగాలను పెద్ద మొత్తంలో మోహరించారు.