ఆదిలాబాద్ టౌన్/ఇచ్చోడ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ర్ట నుంచి ఆదిలాబాద్ వైపుకు వెళ్తున్న బైక్, ఆదిలాబాద్ వైపు నుంచి మహారాష్ర్ట వైపు వెళ్తున్న బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇచ్చోడ మండల కేంద్రంలో ఉంటున్న సుర్జిత్ పోల్కర్(35) ఆదివారం ఉదయం అతడి స్నేహితుడి బైక్ తీసుకొని భార్య వందన, కూతురు మనీష(15), కొడుకు సంస్కార్(11)లతో కలిసి తన సొంత గ్రామమైన మహారాష్ర్టలోని నాందేడ్జిల్లా కిన్వట్థాలుకా ఆన్బోరికి వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో హస్నాపూర్వద్ద మహారాష్ర్టకు చెందిన ధన్వి నారాయణ(30) టూవీలర్‌పై ఎదురుగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో సుర్జిత్, సంస్కార్, మనీషాలతో పాటు నారాయణ అక్కడికక్కడే చనిపోయారు. వందన రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. సుర్జిత్ ఇచ్చోడలోని ఓ టెంట్‌హౌస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్
అశ్వారావుపేట : అశ్వారావుపేట టౌన్ లోని కోనేరు బజారుకు చెందిన సత్తి భాస్కరరావు (40) గౌడ బజారు చెందిన సాయి (42)స్నేహితులు. భవన నిర్మాణ పనుల్లో సెంట్రింగ్ వర్క్ చేసేవారు. శనివారం రాత్రి సెంట్రింగ్ పని మీద ఏపీలోని లింగపాలెం వెళ్లి తిరిగి వస్తూ ఒకచోట ఆగారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. అశ్వరావుపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.
సెమీ క్రిస్మస్వేడుకలకు వెళ్లొస్తూ..
జీడిమెట్ల : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు. సీఐ పవన్కథనం ప్రకారం..జీడిమెట్ల దూలపల్లి చౌరస్తాకు చెందిన ఆవుల కృష్ణ కొడుకు సందీప్(21) డిగ్రీ చదువుతున్నాడు. ఇతడు తన ఫ్రెండ్ అయిన కాంత్రి ఉండే ఏరియాలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలకు స్నేహితులైన నితిన్, హేమంత్‌కుమార్ లతో కలిసి వెళ్లాడు. సెలబ్రేషన్స్ అయిపోయాక సందీప్, క్రాంతికుమార్ఒక బైక్‌పై.. హేమంత్, నితిన్ మరో బైక్‌పై సందీప్ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నెహ్రూనగర్వద్ద తెల్లవారుజామున 12.30 గంటలకు క్రాంతి నడుపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో క్రాంతి కుమార్ అక్కడికక్కడే చనిపోగా సందీప్ తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యలో సందీప్ కూడా చనిపోయాడు.
కారు పల్టీ కొట్టి....
శంషాబాద్ : బెంగళూరు జాతీయ రహదారిపై కారు పల్టీ కొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోగా ఏడుగురు గాయపడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం..హైదరాబాద్ నవాబ్ కట్టకు చెందిన డ్రైవర్ మహ్మద్ఇర్షాద్ , ఎండీ అశ్వక్ (18), అబ్దుల్ రెహమాన్ , అనాస్ , నవాజ్ , నవాజ్ తో పాటు మరో ఇద్దరు క్వాలిస్‌లో హైదరాబాద్ నుంచి జేపీ దర్గాకు వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తుండగా గగన్ పహాడ్ ఫ్లైఓవర్ పై కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అశ్వక్ అక్కడికక్కడే చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.