భూ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు భూదందాకు బూస్టింగే​

భూములు, ఇండ్లు, ఆస్తుల విలువతో పాటు  రిజిస్ట్రేషన్ ​చార్జీల పెంపు రియల్​ఎస్టేట్​లో నల్లధనం పాత్రను అరికట్టేదిగా ఉండాలి. కానీ ప్రభుత్వ ఖజానాను నింపుకొనే దిశలో, నల్లధనాన్ని ప్రోత్సహించేదిగా ఉండకూడదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ, రిజిస్ట్రేషన్​ చార్జీల పెంపు ద్వారా భూదందాకు బూస్టింగ్​ ఇచ్చినట్టు కనిపిస్తోంది. దీనివల్ల నల్లధనం పెరిగే ప్రమాదం ఉంది. నేను బయటి దేశాల్లో ఉద్యోగం వదిలి ఇండియాకు రావడంతో నా తెల్లధనం.. నల్లధనంగా మారడం, నాకు నల్లధనం రావడం నన్ను అయోమయంలో పడేసింది. అప్పుడప్పుడే అన్నా హజారే లాంటి కొందరు నల్లధనంపై పోరు, ఢిల్లీలో దీక్షలు చేయడమైంది. 2003లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జడ్జెట్ పై చర్చలు నిర్వహించారు. స్టాంప్స్ అండ్ ​​రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల బడ్జెట్​చర్చకు నన్ను పిలిచారు. అందులో పలువురు మంత్రులు, సెక్రటరీలు పాల్గొన్నారు. ఆ చర్చలో భాగంగా ఒక్కో శాఖపై ఒక్కో సలహా చెప్పాను. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వాటిని రాతపూర్వకంగా ఇవ్వాలని అడిగితే ఇచ్చాను. అవి ఏంటంటే..
1. రియల్​ఎస్టేట్ వ్యాపారంలో నల్లధనం భారీగా చేతులు మారుతోంది. అప్పుడు 20 శాతం తెల్లధనం, 80 శాతం నల్లధనం చొప్పున ఉండేది. దీన్ని అరికట్టేందుకు భూముల విలువను మార్కెట్ విలువకు పెంచి, రిజిస్ట్రేషన్ చార్జీలను 13.50 శాతం నుంచి 5 లేదా 6 శాతానికి తగ్గించాలి.
2. ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. కానీ ఆ సంస్థకు బస్​స్టేషన్లు, బస్సు డిపోల్లో ఉన్న భూములు వ్యాపార కేంద్రాలుగా మారిస్తే ఆదాయం పెరుగుతుంది. అక్కడి అపరిశుభ్రత, కంపు తగ్గుతుంది. సంస్థ నష్టాల నుంచి బయటపడుతుంది. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు ఇచ్చిన సూచన అమలుపరిచింది. అప్పుడు దీన్ని పబ్లిక్​నుంచి వచ్చిన సలహాగా పేర్కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్​విలువలు పెంచారు. అప్పుడు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ఏరియాలో ఐదారువేల రూపాయలున్న భూముల విలువను రూ.38 వేలకు పెంచారు. రిజిస్ట్రేషన్ చార్జీలు13.50 శాతం నుంచి 9శాతానికి తగ్గించారు. క్రమంగా చార్జీలను ఐదారు శాతానికి తగ్గిస్తామని కూడా చెప్పారు. తర్వాత 2013లో రిజిస్ట్రేషన్ చార్జీలు సవరించారు.
భూదందాకు సపోర్ట్​
తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి రియల్​ఎస్టేట్ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖలోని లంచగొండి అధికారుల సాయంతో ప్రభుత్వ స్థలాలు, నీటి వనరులు ఈ దందాలో కలిసిపోతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రభుత్వాలు ఉద్యోగుల, ప్రజాప్రతినిధుల జీతాలు అడ్డగోలుగా పెంచుకుంటున్నారు. దీంతో వారు సంపాదిస్తున్న నల్లధనం.. భూదందాతో తెల్లధనంగా మార్చుకునేందుకు వీలవుతోంది. 2021 జులై 22 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలను 6 నంచి 7.5 శాతానికి పెంచుతున్నట్టు సర్కార్ ఉత్తర్వులిచ్చింది. లాభార్జన కోసం ఇలా చేయడం దురదృష్టకరం. ఇదో తిరోగమన చర్య. నేను గతంలో చేసిన సూచన ప్రభుత్వ ఖజానాకు నష్టం లేకుండా, భూదందాలో నల్లధనాన్ని తగ్గించేదిగా ఉంటే.. కేసీఆర్ సర్కార్ విధానం నల్లధనాన్ని పెంచిపోషించే విధంగా ఉంది. ఇది సమాజానికి, వ్యవస్థలకు నష్టం చేకూరుస్తుంది.
మార్కెట్​ ధరలో 50 శాతంపైన ఉండాలె
భూముల విలువలు మార్కెట్ ధరలో అతి తక్కువైన మొత్తంలో 50 శాతానికి పైన ఉండాలి. ఇలా లేకుంటే లంచగొండితనం పేట్రేగిపోతుంది. ప్రభుత్వ భూములు, ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలు ఆక్రమించుకొని వ్యాపారాలు చేసే రియల్ ఎస్టేట్ మాఫియా విపరీతంగా పెరుగుతుంది. కొందరు బిల్డర్లు 100% తెల్లధనంతో రిజిస్ట్రేషన్లు చేస్తుంటే. మరికొందరు బిల్డర్లు ఇష్టం వచ్చిన ధరలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే పెట్టిన పెట్టుబడి తక్కువగా చూపడం వల్ల, ఆ భూమి, ఇంటిపై ఏవైనా వివాదాలు వస్తే కొనుగోలుదారుడే నష్టపోతాడు. అమ్మిన వారికి ఎలాంటి నష్టం ఉండదు. ఇది ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్న ఎల్ఆర్​ఎస్ తదితరాల వంటివి. భూములు, ఇండ్ల విలువ తగ్గించి రిజిస్ట్రేషన్లు చేసే వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదో అందరికి తెలిసిన విషయమే. శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నారు. అలాంటి వారిపై ఏ ఒక్క చర్యా తీసుకోలేదు.
నల్లధనంపై చర్చే లేదు
భూములు, ఆస్తుల విలువలు సవరించి, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంపై మీడియా పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారమని ఊదరగొట్టింది. ఎంతో ముఖ్యమైన నల్లధనం విషయం మాత్రం ప్రస్తావించలేదు. సామాన్యులు నల్లధనం రూపంలో ఎంత ఇస్తున్నారనేది గాని, ఇదంతా ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి వెళ్తుంది అనే విషయాలేవి చర్చించలేదు. అలాగే తాజాగా కోకాపేట లాంటి ఏరియాల్లో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో భూములు ఎంత ధర పలికితే.. వాటి చుట్టుపక్కల భూముల విలువ కూడా అంతే ఉంటుంది కదా? మరి వాటిని కూడా అదే విలువకు రిజిస్ట్రేషన్ చేస్తారా? అలాగే కోకాపేట భూముల వేలం విషయంలో వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇక్కడ ప్రజలే ప్రభుత్వంపై కేసు పెట్టాలి. ఎందుకంటే జీవో 111, దానిపై సుప్రీంకోర్టు తీర్పు(2000) ప్రకారం.. ఆ పరిధిలో కాలుష్య కారకమైన ఎటువంటి పనులు చేపట్టకూడదు. ఈ వేలంలో భూములు కొన్న పెట్టుబడిదారులు వారి లాభాల కోసం చేపట్టే పనులు, నిర్మాణాల వల్ల జీవో111 పరిధిలో ఉన్న హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్ జంట తాగునీటి జలాశయాలకు కాలుష్యం ముప్పు తప్పదు. సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ విషయాలనే పేర్కొని ‘ప్రికాషనరీ ప్రిన్సిపుల్​’ ను ముందుకు తెచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలన్నింటిని మూసివేయించింది. ఆ పరిశ్రమలు ఇక్కడే ఉండి ఉంటే ఈ తాగునీటి సరస్సులు రెండు ఇప్పటికే కాలుష్యకాసారాలుగా మారేవి. ఇప్పుడు మనం చూస్తున్న ఇలాంటి రియల్ ఎస్టేట్ ఉండేది కాదు. బ్యాంకులు లోన్​కింద తెల్లధనం పార్టు(రిజిస్ట్రేషన్​విలువ) మాత్రమే ఇస్తాయి. ప్రభుత్వాలు మిగతా ధనం ఎక్కడిదనే విషయంపై ఎలాంటి చర్యలు చేపట్టవు. అయితే ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదు. రాజకీయంగా కక్ష సాధించేందుకు మాత్రం కొందరిపై కేసులు పెట్టి వేధిస్తుంటారు.