
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరచుగా ఫైర్ యాక్సిడెంట్లు.. రూ.కోట్లలో ఆస్తి నష్టం
ప్రపోజల్స్‌కే పరిమితం అయిన ఫైర్ స్టేషన్లు
ఉన్న వాటిలోనూ సిబ్బంది కొరత
హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటేటా పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో సరిపడా ఫైర్ స్టేషన్లు లేకపోవడంతో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకోవడం ఆలస్యం అవుతోంది. దీంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో అగ్ని ప్రమాదాల కారణంగా జిల్లాలో సుమారు రూ. 100 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదాలు జరిగినప్పుడు తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు అంటూ హడావుడి చేస్తున్న ఆఫీసర్లు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. వేసవిలో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉన్నందున ఆఫీసర్లు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కనిపించని ఫైర్ సేఫ్టీ పరికరాలు
నేషనల్ బిల్టింగ్ యాక్ట్ ప్రకారం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే వాటికి మాత్రమే ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి. ఆ లోపు బిల్డింగులకు ఎన్‌వోసీతో సంబంధం లేకుండా సొంతంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కొందరు వ్యక్తులు ఇదేమీ పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా బిల్డింగ్‌లు, షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నారు. ఇరుకుగా ఉన్న సందుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మించడం వల్ల ప్రమాదం జరిగిన టైంలో ఫైర్ ఇంజిన్ స్పాట్‌కు చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే బిల్డింగ్‌లలో సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల కూడా ప్రమాద తీవ్రత పెరుగుతోంది.
అరకొర స్టేషన్లు.. చాలీచాలని సిబ్బంది
ఉమ్మడి జిల్లాలో సరిపడా ఫైస్ స్టేషన్లు లేకపోవడం కూడా సమస్యగా మారింది. వాస్తవానికి ప్రతి 50 వేల జనాభాకు ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. కానీ ఉమ్మడి వరంగల్‌లో వరంగల్, హనుమకొండ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, పాలకుర్తి, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో ఫైర్ స్టేషన్లు ఉండగా, గొర్రెకుంట, మరిపెడ వద్ద ఔట్ పోస్టులు ఉన్నాయి. ఒక్కో స్టేషన్ పరిధి కిలోమీటర్ల దూరం వరకు ఉండడంతో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెహికల్స్ స్పాట్‌కు చేరుకోవడం లేట్ అవుతోంది. ఈ సమస్య ఏజెన్సీ ఏరియాల్లో ఎక్కువగా ఉంటుంది. ఏటూరునాగారం, వెంకటాపురం, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్‌లో ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు గతంలోనే ప్రపోజల్స్ పంపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరో వైపు ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ప్రతి స్టేషన్‌కు ఒక ఫైర్ ఆఫీసర్, రెండు వెహికల్, ఐదుగురు డ్రైవర్లు, నలుగురు లీడింగ్ ఫైర్ మెన్లు, 21 మంది ఫైర్‌మెన్లు ఉండాలి. కానీ 60 శాతం ఖాళీలే ఉండడంతో ఉన్న సిబ్బందిపైనే భారం పడుతోంది. ఉమ్మడి జిల్లాలో 32 డ్రైవర్ పోస్టులు ఉండగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఆర్టీసీ నుంచి సుమారు 16 మంది డ్రైవర్లను డిప్యుటేషన్‌పై ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించారు.
ఇటీవల జరిగిన ప్రమాదాలు
* గతేడాది ఇదే టైంలో గీసుగొండ మండలంలోని స్తంభంపల్లి వద్ద ఉన్న టెస్కో గోదాంలో అగ్ని ప్రమా దం సంభవించి దాదాపు రూ.27 కోట్ల విలువైన మెటీరియల్ కాలిబూడిదైంది. ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగాయని ఆఫీసర్లు గుర్తించారు.
* వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలోని పాత ఫర్నిచర్ షాపులో ఫిబ్రవరి 3న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగగా నిప్పు రవ్వలు ఎగిసిపడడం వల్ల పక్కనే ఉన్న మరో 9 షాపులకు మంటలు అంటుకున్నాయి. పాత ఫర్నిచర్, ఎరువుల దుకాణాలు, మెకానిక్ షాపులన్నీ కాలిపోవడంతో సుమారు రూ.కోటి వరకు ఆస్తినష్టం జరిగింది.
* ఫిబ్రవరి 13న ఎల్కతుర్తిలోని కాకతీయ వన విహార్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హనుమకొండ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్కతుర్తికి ఫైర్ ఇంజిన్ చేరుకునేలోపే సుమారు 40 ఎకరాల్లో కంకవనం కాలిపోయింది.
ప్రపోజల్స్ పంపించాం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరిపడా ఫైర్ స్టేషన్లు, సిబ్బంది లేరు. త్వరలోనే సిబ్బందిని రిక్రూట్ చేసే చాన్స్ ఉంది. కొత్త స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రపోజల్స్ పంపించాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి శుక్రవారం అవగాహన కల్పిస్తున్నాం.
- ఎం.భగవాన్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్