ఇండియన్ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ(ఐఆర్ఎస్)ను భారత్ మొదటిసారిగా 1988లో ఐఆర్ఎస్–1ఏ ప్రయోగంతో ప్రారంభించింది. ఒక వస్తువు నుంచి వచ్చే వికిరణం ఆధారంగా ఆ వస్తువు లక్షణాలను, దూరాన్ని సుదూరం నుంచి తెలుసుకోవడాన్ని రిమోట్ సెన్సింగ్ అంటారు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం రిజల్యూషన్ శక్తి. రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచే స్పష్టంగా చూడగలగటాన్ని రిజల్యూషన్ శక్తి అంటారు.
ఈ విధమైన అనేక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సముదాయాన్ని ఇండియన్ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ అంటారు. ఈ ఉపగ్రహాల్లోని వివిధ సెన్సర్స్ కావాల్సిన సమాచారాన్ని సేకరించి, దాని విశ్లేషణ కోసం హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సీకి పంపిస్తాయి. ఈ సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు, అంతిమ వినియోగదారులకు చేర్చేందుకు ఐదు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు, డెహ్రాడూన్, జోధ్పూర్, కోల్కత్తా, నాగ్పూర్ల్లో ఉండే ప్రాంతీయ కేంద్రాల ద్వారా ఎన్ఆర్ఎస్సీ రిమోట్ సెన్సింగ్ సమాచారాన్ని దేశమంతటా ప్రసారం చేస్తుంది.
రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాతావరణ సమాచార సేకరణ, విపత్తు నిర్వహణ, రవాణా వ్యవస్థ మెరుగుదలకు, జాతీయ భద్రతకు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఉపకరిస్తాయి.