
సింధు జలాల ఒప్పందం అనేది భారత్, పాకిస్తాన్ మధ్య నదీ జలాల భాగస్వామ్య ఒప్పందం. కరాచీ కేంద్రంగా 1960లో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందం సింధు నదీ వ్యవస్థను భారతదేశం, పాకిస్తాన్ మధ్య విభజిస్తుంది. పాకిస్తాన్కు పశ్చిమ నదులను(సింధు, జీలం, చీనాబ్) కేటాయించగా, భారతదేశానికి తూర్పు నదులను(రావి, బియాస్, సట్లెజ్) కేటాయించారు.
ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్కు చెందిన మహ్మద్ అయూబ్ ఖాన్, ప్రపంచ బ్యాంకుకు చెందిన డబ్ల్యూఏబీ ఇలిఫ్ సంతకం చేశారు. ఇది 1960, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ఆరు నదుల వినియోగాన్ని క్లుప్తంగా వివరిస్తుంది.
వివాదాలు
ఇటీవల కాలంలో జీలం, చీనాబ్ నదులపై నిర్మించనున్న కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ కేంద్రాల రూపకల్పనపై భారతదేశం, పాకిస్తాన్ మధ్య విభేదాలు ఉన్నాయి. 1960 సింధు జలాల ఒప్పందంలో అందించిన డిజైన్ స్పెసిఫికేషన్లకు లోబడి, ఈ నదులపై జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి భారతదేశానికి అనుమతి ఉన్నది.
సింధు నదీ వ్యవస్థ
టిబెట్లోని కైలాష్ పర్వత శ్రేణి వద్ద ఉన్న బోఖార్చు హిమానీ నదం నుంచి ఇది ప్రారంభమవుతుంది. టిబెట్లోని దీనిని సింగీ ఖంబాన్ అని పిలుస్తారు. ఈ నది పొడవు సుమారు 2900 కిలోమీటర్లు. భారతదేశంలో దీని పొడవు 710 కిలోమీటర్లు మాత్రమే. టిబెట్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత సింధు నది లడఖ్ ప్రాంతం గుండా వాయవ్య దిశగా ప్రవహిస్తుంది.
►ALSO READ | బయటపడిన పాక్ కుట్ర.. ఉగ్రవాదుల్లో ఒకరు పాక్ ఆర్మీలో.. ఒకప్పుడు పారా కమాండోనే..!
తర్వాత దక్షిణ దిశగా తిరిగి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. పాకిస్తాన్లో ఇది విశాలమైన మైదానాల గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. మిథాన్ కోట్ సమీపంలో, పంజాబ్ లోని ఐదు నదుల(జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్) నీరు పాంజ్ నాడ్ పేరుతో సింధు నదిలో కలుస్తుంది.
ప్రధాన ఉపనదులు ఎడమ ఒడ్డు ఉపనదులు
* జీలం: కాశ్మీర్ లోయలోని వెరినాగ్ వద్ద జన్మిస్తుంది. శ్రీనగర్, వూలర్ సరస్సు ద్వారా ప్రవహించి పాకిస్తాన్ లో చీనాబ్ నదిలో కలుస్తుంది.
* చీనాబ్: హిమాచల్ ప్రదేశ్లోని బారా లాచా కనుమ వద్ద చంద్ర, భాగ అనే రెండు నదుల కలయికతో ఏర్పడుతుంది. ఇది సింధు నదికి అతిపెద్ద ఉపనది. పాకిస్తాన్లోని త్రమ్ము వద్ద జీలం నది ఇందులో కలుస్తుంది.
* రావి: హిమాచల్ ప్రదేశ్లోని కులు కొండల్లోని రోహ్ తాంగ్ కనుమ సమీపంలో జన్మిస్తుంది. ఇది పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ లోని సరాయ్ సింధు వద్ద చీనాబ్లో కలుస్తుంది.
* బియాస్: హిమాచల్ ప్రదేశ్లోని రోహ్ తాంగ్ కనుమ సమీపంలోని బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. ఇది పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే చిన్న నది. పంజాబ్ లోని హరికే వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది.
* సట్లెజ్: టిబెట్లోని మానస సరోవరం సమీపంలోని రాకాస్ సరస్సు వద్ద జన్మిస్తుంది. ఇది భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహించి పాకిస్తాన్లో చీనాబ్ నదిలో కలుస్తుంది. ఇది సింధు నదికి పొడవైన ఉప నది.
* జస్కర్: లడఖ్ ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన ఎడమ ఒడ్డు ఉపనది. సురు, పంజ్నాద్ నదులు కూడా ఎడమ వైపు నుంచి ప్రవహించే ఉప నదులుగా ఉన్నాయి.
కుడి ఒడ్డు ఉపనదులు
* ష్యోక్: కారకోరం పర్వత శ్రేణిలో జన్మిస్తుంది.
* గిల్గిట్: గిల్గిట్–బాల్టిస్తాన్ ప్రాంతంలో ప్రవహిస్తుంది.
* హుంజా: కారకోరం పర్వతాల్లో జన్మిస్తుంది.
* కాబూల్: ఆఫ్గనిస్తాన్ లో జన్మించి పాకిస్తాన్లో ఆట్టోక్ సమీపంలో సింధు నదిలో కలుస్తుంది. స్వాత్, కున్నార్, కుర్రం, గోమల్, తోచి నదులు కుడివైపు నుంచి కలిసే ఉపనదులుగా ఉన్నాయి.