- పాత బస్ స్టాండ్ చౌరస్తా ఎదుట ధర్నా
- పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించిన దరఖాస్తుదారులు
జగిత్యాల, వెలుగు : స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని మినీ స్టేడియంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ రసాభాసగా మారింది. నూకపల్లిలో నిర్మించిన 4 వేల డబుల్ ఇండ్ల లో 2,600 ఇండ్లను మొదటి విడతగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మైనార్టీల కోసం బుధవారం ఉదయం 302 ఇండ్లను డ్రా తీసి అర్హులను ప్రకటించారు. అయితే తమకు రావాల్సిన 12 శాతం రిజర్వేషన్ ప్రకారం ఇండ్లు కేటాయించలేదని, మిగిలిన వాళ్లకు కూడా ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారులు పట్టుబట్టారు. అనంతరం డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తున్న ప్లేస్లో ధర్నాకు దిగారు. మరికొందరు పాత బస్టాండ్ చౌరస్తా ఎదుట నిరసన తెలిపారు.
ఆందోళన తగ్గకపోవడంతో బీసీ, ఓపెన్ కేటగిరీలకు చెందిన 1,512 ఇండ్లు, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలకు చెందిన 786 ఇండ్ల పంపిణీని వాయిదా వేసినట్లు ఆఫీసర్లు మధ్యాహ్నం ప్రకటించారు. దీంతో బీసీ, ఓపెన్ కేటగిరీల దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా లబ్ధిదారులమేనని ఉదయం నుంచి కూర్చోబెట్టి ఇప్పుడు వాయిదా వేస్తారా..? అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిన సముదాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ప్రకాశ్, ఎమ్మార్వో ఆరీఫ్ లబ్ధిదారులతో మాట్లాడి సర్ది చెప్పడంతో లబ్ధిదారులు ధర్నా విరమించారు. కాగా లబ్ధిదారులకు మద్దతుగా బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి ధర్నా లో పాల్గొన్నారు.