- ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్ కట్టడానికే పరిమితం
- ఇంకా మొదలు మొదలు కాని సెన్సర్ల ప్రక్రియ
- గేట్లు ఎత్తడం, దించడంతో పాటు ఇన్ ఫ్లో పరిశీలనకు అధికారులకు తప్పని తిప్పలు
భద్రాచలం, వెలుగు : తాలిపేరు ప్రాజెక్టు గేట్లకు సెన్సర్ల ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమమైన పనులు వచ్చే జూన్‌లోపు తప్పనిసరిగా పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు కంట్రోలు రూమ్ నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. సెన్సర్ల ఏర్పాటు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లను అడిగితే మరో ఏడాది వరకు పనులు జరుగుతాయని చెబుతున్నారు.
రూ.కోటితో పనులు..
కోటిరూపాయల వ్యయంతో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద ఈ పనులు షురూ చేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, దించడంతో పాటు ఇన్‌ఫ్లో పరిశీలన అధికారులకు, సిబ్బందికి కష్టతరంగా మారింది. నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్లు పైకి ఎత్తుతున్నారు. గేట్లు పైకి లేవకుండా మొరాయిస్తే సిబ్బంది కష్టపడాల్సి వస్తోంది. ఎగువన వర్షాలు కురిస్తే ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో అంచనా వేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు సాగునీటి ప్రాజెక్టులకు అధునాతన సెన్సర్స్ సిస్టం ద్వారా ఇన్‌ఫ్లో అంచనా వేస్తూ గేట్లు ఎత్తే విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో తాలిపేరు ప్రాజెక్టు ఒకటిగా ఉంది.
సెన్సర్ల పనితనం ఇలా..
తాలిపేరు ప్రాజెక్టుకు 25 గేట్లు ఉన్నాయి. ఈ గేట్లకు సెన్సార్లను ఏర్పాటు చేసి కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. రిజర్వాయర్‌లోకి వచ్చిన నీటి ప్రవాహం ఆధారంగా కంప్యూటర్లో ఫీడ్ చేసిన సెన్సర్లు పనిచేస్తాయి. ప్రాజెక్టు వద్దనే కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కంప్యూటర్ ద్వారా కేంద్ర,రాష్ట్ర జలవనరుల శాఖలకు ఈ ప్రాజెక్టుకు వచ్చే వరద ప్రవాహం వివరాలు ఎప్పటికప్పుడు చేరుకుంటాయి. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్న వాతావరణ వివరాల ప్రకారం నీటిని సెన్సర్ల ద్వారా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తారు. సిబ్బందితో పనిలేకుండా గేట్లు పనిచేస్తాయి.
ఇంకా సమయం పడుతుంది..
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద తాలిపేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణను ఆధునీకరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు ప్రాజెక్టు గేట్లకు సెన్సార్లు ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. కంట్రోలు రూమ్ కట్టారు. కేబుల్ వర్కు జరుగుతోంది. ఇవి అయిన వెంటనే గేట్లకు సెన్సార్లు బిగిస్తారు. ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కేంద్రమే చూసుకుంటుంది.
– తిరుపతి, డీఈ, తాలిపేరు