సాత్విక్ ఆత్మహత్యపై ఇంటర్ బోర్డు విచారణ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో సూసైడ్ చేసుకున్న సాత్విక్ ఘటనపై ఇంటర్ బోర్డు విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సాత్విక్ సూసైడ్ ను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ (టీఎస్ సీపీసీఆర్ ) సీరియస్ గా పరిగణించింది. సుమోటోగా కేసు స్వీకరించామని కమిషన్ సెక్రటరీ స్వరూపరాణి తెలిపారు. ఘటనపై నిజనిర్ధారణ చేసి, త్వరగా రిపోర్టు ఇవ్వాలని ఇంటర్మీడియెట్ కమిషన్ ను ఆదేశించారు. 

కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి, క్లాస్ రూమ్ లో సాత్విక్ ఉరేసుకున్నాడు. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. షాద్ నగర్ లోని ఫారూఖ్ నగర్ కు చెందిన నాగుల సాత్విక్ (16) టైన్త్ లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఎంపీసీ)లో జాయిన్ అయ్యాడు. హాస్ట్ ల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే.. తనకు ఫుడ్ సరిగా పడడం లేదని, స్టడీ అవర్స్ లో లెక్చరర్లు, వార్డెన్ వేధిస్తున్నారని, కొడుతున్నారని చాలాసార్లు తలిదండ్రులకు చెప్పి బాధపడ్డాడు సాత్విక్. వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య, లెక్చరర్ కృష్ణారెడ్డి, వార్డెన్ నరేశ్ వేధిస్తున్నారని చెప్పాడు. సరిగా చదవడం లేదని అవమానిస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని వాపోయాడు. 

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న సాత్విక్ క్లాస్ రూమ్ లోనే ఉరేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు.. సాత్విక్ ను లెక్చరర్ కొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. మార్చి 1న ఉదయం నార్సింగిలోని కాలేజీ వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాలేజీ యాజమాన్యం సెలవు ప్రకటించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు సాత్విక్ పేరెంట్స్ కు మద్దతుగా ఆందోళనలు చేపట్టాయి.