సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్సులను ఘటనా స్థలంలో ఏర్పాటు చేసుకోకపోవడంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండోసారి రెస్క్యూ చేసిన ఆరుగురిని బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్సులలో తీసుకెళ్లారు.
బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులో సరిపడా వెంటిలేటర్ సదుపాయాలు ఉండవన్న విషయం అధికారులకు సైతం తెలుసు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలి. కానీ.. అక్కడ అలాంటి పరిస్థితి కనిపించలేదు. అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లో కావాల్సిన మందులతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్,CPR రిలేటెడ్ సిస్టమ్ ALS ఉంటాయి. సకాలంలో ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలు అందకపోవడంతో ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఓ యువకుడు అధికారులు, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. బిల్డింగ్ పై అంతస్తులో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ తప్పనిసరిగా కావాలంటూ అధికారులను వేడుకున్నాడు. ఈ యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత అధికారులను వేడుకున్నాడు.
గాంధీ మార్చురీకి మృతదేహాలు
అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గాంధీ మార్చురీలో ఉన్నాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. మార్చురీ వద్ద బాధితుల రోదనలు ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. తమ పిల్లలు ఇక ఎప్పటికీ తిరిగి రాని తెలిసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు గాంధీ హాస్పిటల్ నుంచి మీడియా ప్రతినిధులను పోలీసులు బయటకు పంపించారు.