న్యూఢిల్లీ : ఇరాన్–ఇజ్రాయిల్ దేశాల యుద్ధ పరిస్థితులు ఈ వారం కూడా మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనుంది. దీనికి తోడు కంపెనీల క్యూ4 రిజల్ట్స్, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) కదలికలపై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. బ్రెంట్ క్రూడాయిల్, డాలర్ మారకంలో రూపాయి కదలికలను కూడా గమనించాలని అన్నారు. ఇరాన్–ఇజ్రాయిల్ మధ్య గొడవ మరింత ముదిరితే మార్కెట్‌లో పానిక్ సెల్లింగ్ రావొచ్చని, వొలటాలిటీ పెరుగుతుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.
క్రూడాయిల్ ధరలను మార్కెట్ గమనిస్తోందన్నారు. మరోవైపు టెక్ మహీంద్రా, హిందుస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతి క్యూ4 రిజల్ట్స్ ఈ వారం వెలువడనున్నాయి. గ్లోబల్‌గా చూస్తే, బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈ నెల 26 న వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనుంది. యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. యూఎస్ మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ డేటా, యూఎస్ క్యూ1 జీడీపీ నెంబర్లు కూడా ఈ వారం వెలువడనున్నాయి. కిందటి వారం సెన్సెక్స్ 1,157 పాయింట్లు (1.55 శాతం) పడింది. నిఫ్టీ 372 పాయింట్లు క్రాష్ అయ్యింది.