- ప్రెసిడెంట్‌ను తొలగించాలని విపక్షాల డిమాండ్
- మొయిజ్జుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న డెమోక్రాట్స్ ఎంపీ
- మోదీకి మద్దతు ప్రకటించిన మాల్దీవ్స్ టూరిజం ఇండస్ట్రీ
మాలె/బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై తమ మంత్రులు చేసిన వివాదాస్పద కామెంట్లతో ఇరకాటంలో పడ్డ మాల్దీవ్స్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపు మాల్దీవ్స్ టూర్లను పెద్ద సంఖ్యలో ఇండియన్లు రద్దు చేసుకుంటుండగా.. మరోవైపు ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జును పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
మోదీపై అనుచిత వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో మొయిజ్జును అధికారం నుంచి తొలగించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని డెమోక్రాట్స్ ఎంపీ అలీ అజీమ్ పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించాలని ఎండీపీ పార్టీని కోరారు. మరో ఎంపీ మీకైల్ నీషమ్.. ఈ వ్యవహారంపై ఫారిన్ మినిస్టర్ మూసా జమీర్‌ను ప్రశ్నించాలని పార్లమెంటుకు విజ్ఞప్తి చేశారు. దేశంలో రాజకీయ దుమారం రేగుతుండగా.. మొయిజ్జు మాత్రం తమ దేశానికి మరింత మంది టూరిస్టులను
పంపాలంటూ చైనాను కోరడం గమనార్హం.
మనకు ఇండియా ‘911 కాల్’: మాజీ మంత్రి
అధికార పక్షానికి దూరదృష్టి లేకపోవడం వల్ల.. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంబంధాలు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఎండీపీ నేత, మాల్దీవ్స్ రక్షణ శాఖ మాజీ మంత్రి మరియా అహ్మద్ దీదీ విమర్శించారు. ‘‘మన దేశానికి ఎల్లప్పుడూ ఇండియా ఫస్ట్ పాలసీ ఉండేది. ఇండియా మనకు 911 కాల్ (ఎమర్జెన్సీ నంబర్) లాంటిది’’ అని చెప్పారు. మరో ఎండీపీ లీడర్ అహ్మద్ మహ్లూఫ్ మాట్లాడుతూ.. ‘మాల్దీవ్స్ టూర్లను ఇండియన్ టూరిస్టులు బాయ్‌కాట్ చేస్తున్నారు. ఇలాగైతే ఎకానమీపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
మోదీపై వ్యాఖ్యలను ఖండించిన టూరిజం శాఖ
ప్రధాని మోదీపై డిప్యూటీ (మాజీ) మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (మాటి) తీవ్రంగా ఖండించింది. ‘‘మాల్దీవ్స్ టూరిజం ఇండస్ట్రీకి స్థిరమైన, గణనీయమైన సహకారాన్ని ఇండియా అందిస్తున్నది. కరోనా సమయంలో మేం కోలుకోవడానికి ఎంతో సహకరించిన దేశం. కరోనా తర్వాత.. మాల్దీవ్స్‌కు టాప్ మార్కెట్ దేశాల్లో ఒకటిగా నిలిచింది” అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా తమకు సన్నిహితమైన పొరుగు దేశమని, భాగస్వామి అని చెప్పింది.
టూరిస్టులను పంపాలంటూ చైనాకు మొయిజ్జు విజ్ఞప్తి
తమ దేశానికి మరింత మంది టూరిస్టులను పంపాలంటూ చైనాకు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు విజ్ఞప్తి చేశారు. ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం చైనాకు వెళ్లిన మొయిజ్జు.. ఫుజియన్ ప్రావిన్స్‌లో జరిగిన మాల్దీవ్స్ బిజినెస్ ఫోరమ్‌లో మాట్లాడారు. చైనా తమకు సన్నిహిత భాగస్వామి అని చెప్పారు. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టులను ప్రశంసించారు. మాల్దీవుల చరిత్రలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించారని చెప్పుకొచ్చారు.