మోటార్లకు మీటర్లనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్నది. విద్యుత్‌వ్యవస్థ గురించి తెలుసుకుంటే ఈ అంశం మీద ఒక అవగాహనకు రాగలుగుతాం. మనకు థర్మల్పవర్ప్లాంట్ల నుంచి, జల విద్యుత్, సౌర విద్యుత్ ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతున్నది. అయితే కరెంట్‌ను నిల్వ చేయడం చాలా కష్టమైన పని. దాదాపు అందుకు అవకాశం లేదనే చెప్పొచ్చు. అందుకే కరెంట్ వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూనే ఉంటది. ఇండియాలో విద్యుత్ ఉత్పత్తికి కొరత ఏమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే రికార్డు స్థాయిలో ఏడాదిలో నూటికి 94 గంటలు విద్యుత్ వాడకం జరుగుతున్నది. అంటే ఉత్పత్తిలో పెద్దగా సమస్య లేదు. కానీ దాన్ని పంపిణీ చేసే దగ్గరే గొడవంతా. పంపిణీ వ్యవస్థతోనే నష్టాలు వస్తున్నాయి. ఆశించిన స్థాయిలోపెట్టుబడులు లేకపోవడం, సరైన టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం, పట్టించుకోకపోవడం లాంటి ఎన్నో సమస్యలు అందులో ఉన్నాయి. ఎంతో ఖర్చు పెట్టి ఉత్పత్తి చేసి, ట్రాన్స్‌మీట్ చేస్తున్న కరెంట్చాలా వరకు వృథా అవుతున్నది. వీటిని ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు అంటాం. ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి సుమారు ఐదారు కోట్ల వరకు ఖర్చవుతుంది. ఆ ఖర్చు మీద వడ్డీలు చెల్లించాలి. ట్రాన్స్‌మిషన్ కోసం లక్షల్లో ఖర్చవుతుంది. విద్యుత్ తయారీ కోసం పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వాలి. ఇంత చేస్తే ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌లో చాలా వరకు నష్టం వస్తున్నది. ఒకప్పుడు ఈ నష్టం 40 శాతం ఉండేది, ఇప్పుడు ఇంకాస్త పెరిగి ఉండచ్చు. ఇంత నష్టం ఎలా వస్తున్నది? ఎందుకు వస్తున్నదని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేవారే లేరు. ఎందుకంటే రైతులకు ఎంత కరెంట్ ఇస్తున్నామో సరైన లెక్క ఉండటం లేదు. వేరే చోట ఎక్కువ కరెంట్ వినియోగం జరిగితే అది కూడా రైతుల ఖాతాల్లోనే పడుతున్నది.
ప్రజలు కట్టే పన్నులే..
ఉచితాలు ఎక్కువయ్యే కొద్దీ మనం కట్టే పన్నులు కూడా ఎక్కువవుతాయి. నేడు దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో ఓ వికృత వ్యవస్థ కొనసాగుతున్నది. మనం పన్నుల రూపంలో కట్టే డబ్బు సద్వినియోగం కాకపోతే నష్టపోయేది మనమే. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పాలకులు ఈ విషయం ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నారు. ఉదాహరణకు తెలంగాణలో గత మూడేండ్లలో ప్రభుత్వం రూ.76 వేల కోట్లు అప్పులు తీసుకుంది. అందులో సమాజ అభివృద్ధికి రూ.16, 859 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే మిగతా 60 వేల కోట్లు ఏమైనట్టు? ఆ మొత్తం రోజు వారీ, నెల వారీ ఖర్చులకు పోయిందా? ఎంత బీద కుటుంబమైనా రోజు వారీ ఖర్చులకు అప్పులు చేసి తమ పిల్లలపై అప్పుల భారం పెంచుతుందా? ఎంత సంపాదించినా అందులో ఒక్క రూపాయైనా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సంపాదన 5 రూపాయలైతే 10 రూపాయలు అప్పు చేసి బతకడాన్ని ఏమంటాం? తల్లిదండ్రులు దుబారాలు చేసి పిల్లలపై అప్పుల భారాన్ని మోపడం లేదు. కానీ మన ప్రభుత్వాలు మాత్రం అప్పులు చేసి మనపై భారాన్ని పెంచుతున్నాయి. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా రైతులకు ఉపయోగపడాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చే విమర్శలు ఇలాంటివే. పెట్టే ఖర్చుకు వచ్చే రాబడికి సంబంధం గిట్టుబాటు కావాలి. అలా జరగనప్పుడు ఏ కుటుంబానికైనా, రాష్ర్టానికైనా, దేశానికైనా నష్టమే మిగులుతుంది.
ఖర్చు ఎంతో తెలియాలి..
ఒక వ్యవస్థ బాగుపడాలంటే దేని పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. లక్ష ఆదాయం వచ్చే దగ్గర రెండు లక్షలు ఖర్చు జరుగుతుంటే.. అంత ఎలా జరుగుతున్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా!. నష్టం ఎక్కడ జరుగుతున్నదో తెలిసినప్పుడే దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎక్కడెంత విద్యుత్ ఖర్చు అవుతుందో తెలియకపోతే అది దుబారా అయిపోతూనే ఉంటుంది. మనమంతా పన్నుల రూపంలో డబ్బు కడుతున్నాం. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సబ్సిడీలు ఇస్తున్నది. ఉదాహరణకు100 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసి, కేవలం 30, నలభై యూనిట్లకు మీటరు పెట్టి అమ్మితే, మిగతా 60 యూనిట్లను మీటరు లేకుండా పంపిణీ చేస్తున్నందున దాదాపు 40 యూనిట్ల వరకు వృథా అవుతున్నది. అది నష్టంగా మారి భారం పడుతున్నది. అందుకే టారిఫ్‌లు పెరుగుతున్నాయి, ఒక్కో యూనిట్‌కి ఖర్చు పెరిగిపోతున్నది. మధ్యలో కరెంట్ దొంగలుంటారు. అసమర్థంగా పనిచేసే వారుంటారు. ఆ నష్టాలను ఉచిత విద్యుత్పేరుతో రైతుల ఖాతాలో వేయడం సరికాదు. తాను ఎంత కరెంట్ ఖర్చు చేస్తున్నాడో రైతుకు తెలియదు. మీటరు లేదు కాబట్టి ఎన్ని యూనిట్లు కాలుతున్నాయో అన్నదాతకు అర్థం కాదు. ఎలాగూ బిల్లు లేదు కదా అని కరెంట్ ను వృథా చేసేవారు ఉంటారు. కొన్ని చోట్ల మోటార్లు సరిగా లేక ఎక్కువ విద్యుత్వినియోగం జరగొచ్చు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా జాతీయ స్థాయిలో విద్యుత్ పంపిణీని బాగు చేయడం ఎలా అన్నది కచ్చితంగా ఆలోచించాలి. ఆ ప్రయత్నం 25 ఏండ్ల నుంచి జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగానే కరెంట్ఎంత ఖర్చు అవుతున్నదో తెలియాలంటే మీటర్లు పెట్టాలనే యోచన తెరమీదకు వచ్చింది. మీటరు వల్ల ఎంత విద్యుత్ వినియోగం జరుగుతున్నది కచ్చితంగా తెలుస్తుంది.
సమాజానికి నష్టం వద్దు.. రైతుకు మేలు జరగాలి
ఎన్టీఆర్ హయాంలో స్లాబ్ రేటు పెట్టగానే మీటర్ల అవసరం లేకుండా పోయింది. విద్యుత్ బోర్డ్ కూడా కొంత డబ్బు ఆదా చేద్దాం అనుకుని మీటర్లు పెట్టడం మానేసింది. కానీ ఎక్కడ ఎంత విద్యుత్ వినియోగం జరుగుతుందో తెలియకపోతే నష్టం ఏటా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మోటార్లకు మీటర్ల విషయంలో ‘ఒక్కో మోటార్‌కు ఇన్ని వేల యూనిట్ల వరకు విద్యుత్ఫ్రీగా ఇస్తం.. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే బిల్లు కట్టాలి?’ అని చెబితే రైతుల్లో బాధ్యత ఉంటుంది. బిల్లు కట్టడం అంటే వందలకు వందలు, వేలకు వేలు వసూలు చేయడం కాదు.. యూనిట్‌కి రూపాయే వసూలు చేయొచ్చు. ఇలాంటి చర్యల వల్ల ఎక్కడైనా కరెంట్ దుబారా ఉంటే తగ్గి, పొదుపు పెరుగుతుంది. తద్వారా రైతులకు, వ్యవస్థకు మేలు జరుగుతుంది. భూగర్భ జలాలు కూడా వృథా కావు. దేశం ఒక్క విద్యుత్ రంగంలోనే లక్ష కోట్ల రూపాయల నష్టాలను చవి చూస్తున్నది. అదంతా పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బే. కాబట్టి విద్యుత్‌ను పొదుపుగా వాడటం ఎట్లా? విద్యుత్ ఎక్కడ ఎంత ఖర్చవుతున్నదో ఆడిట్ చేయడమెట్లా? వ్యవస్థను బాగుచేయడమెట్లా? అని ఆలోచిస్తే మీటర్లు పెట్టడంలో తప్పు ఏం లేదు. ఇంట్లో ఖర్చు పెట్టే డబ్బుకే మనం వంద లెక్కలు వేస్తాం. అలాగే ప్రభుత్వ ఖర్చులకు కూడా లెక్కలు తప్పనిసరి. అప్పుడు ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించే ప్రయత్నం చేసే వీలుంటుంది. వృథాను అరికట్టొచ్చు. అలాంటి చర్యలు మానేసి, దాన్ని పట్టించుకోకపోతే జాతికి చాలా నష్టం. నేనెప్పుడూ రైతుల పక్షపాతినే. రైతులకు ఎంతైనా చేయొచ్చు. అది సమాజానికి నష్టం లేకుండా రైతుకు లాభం జరిగేలా చేయాలి. రైతులకు మంచి చేస్తున్నామన్న భ్రమలో రూ.100 ఖర్చు పెడితే రూ. 30 తిరిగి వస్తున్నది. మిగతా 70 రూపాయలు ఎక్కడికి పోతున్నాయ్? అధికారులు, మంత్రులు మనదేం పోయిందనుకుంటున్నారు, రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందాన డబ్బు వృథా అవుతున్నది. అందుకే రాయితీలు ఎప్పుడూ బీదరికాన్ని, అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఇచ్చే రాయితీ వల్ల నిజంగా రైతు ఆదాయం పెరుగుతుందా ? అన్నదాన్ని బేస్ చేసుకుని ఇవ్వాలి. కానీ ఈ ఓట్ల వేటలో అవేమీ యంత్రాంగానికి పట్టడం లేదు. నాకు ఓటు వస్తుందా ? లేదా అనేదే చూసుకుంటున్నారు.
జయప్రకాశ్ నారాయణ,లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు