సిమెంట్ ఫ్యాక్టరీ కట్టనేలేదు.. మళ్లీ భూములెందుకు..?

సిమెంట్ ఫ్యాక్టరీ కట్టనేలేదు.. మళ్లీ భూములెందుకు..?
  • ఆదిలాబాద్ జిల్లాలో ఊసేలేని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ
  • ఏడేండ్ల కిందట రైతుల నుంచి 107 ఎకరాలు సేకరణ 
  • తాజాగా మరో 300 ఎకరాల తీసుకునేందుకు సిద్ధం 
  • భూ సర్వేకు రైతులకు నోటీసు ఇస్తున్న అధికారులు 
  • గతంలో ఇచ్చినవే తిరిగివ్వాలంటున్న భూ నిర్వాసితులు  
  • మరోసారి భూములివ్వంటూ తేల్చిచెబుతున్న రైతులు 

 ఆదిలాబాద్, వెలుగు : రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని రామాయి గ్రామం వద్ద నిర్మించేందుకు కంపెనీ ప్రతినిధులు ఏడేండ్ల కిందట రైతుల వద్ద భూములు కొన్నారు. ఆ తర్వాత పనులు చేపట్టకుండా పత్తాలేకుండా పోయారు. ఫ్యాక్టరీ నిర్మాణంపై గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు జోరుగా ప్రచారం చేసుకోగా.. అనంతరం ఊసే ఎత్తడంలేదు. తాజాగా కంపెనీ మరో 300 ఎకరాలు భూముల సేకరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా భూములిచ్చేది లేదంటూ రైతులు తేల్చి చెబుతున్నారు. ఇచ్చినవే తిరిగివ్వాలంటూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇంకొన్ని భూముల కావాలంటూ కొందరు రైతులకు నోటీసులు కూడా ఇచ్చారు. వారంతా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో తక్కువ ధరకు భూములు తీసుకున్నారని, ఇప్పుడు కూడా అదే ధరకు కొనేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఏడేండ్లుగా అడుగు ముందుకు పడలె..

2017లో రామాయి గ్రామ సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రైతుల నుంచి సదరు కంపెనీ107 ఎకరాల భూమిని తీసుకుంది. కంపెనీ ప్రతినిధులు జాబ్ లు ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో రైతులు తక్కువ ధరకే ఎకరానికి రూ. 9.25 లక్షల రేటుకే భూములు ఇచ్చారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదు. దీంతో  రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రూల్స్ మేరకు మూడేండ్లలోనే ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉండగా.. ఏడేండ్లుగా నిర్లక్ష్యం చేశారని రైతులు మండిపడుతున్నారు. అప్పట్లో మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి రూ. 15 లక్షలు ఉండగా.. తమ పిల్లలకు జాబ్ వస్తాయని,  సుమారు 5 వేల మంది నిరుద్యో గులకు ఉపాధి దొరుకుతుందని ఆశించి తక్కువ ధరకే ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలు ధర పలుకుతుందంటున్నారు. దీనిపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సైతం పట్టించు కోలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.  ఫ్యాక్టరీ అయినా నిర్మించాలని, లేదంటే తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని భూ నిర్వాసితులు స్పష్టంచేస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా..  

ఫ్యాక్టరీ నిర్మాణంపై గత బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డా యి. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కంపెనీకి సహకరించారని, ఫ్యాక్టరీ ఏర్పాటులోనూ నిర్లక్ష్యం చేశారని ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేయగా.. తీవ్ర రాజకీయ దుమారం రేగింది. మరోవైపు భూ నిర్వాసితులు రెండేండ్లుగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.  గతేడాది తమ భూములను దున్నుకునేందుకు నిర్వాసితులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేపట్టాయి. 

భూ సర్వేతో  రైతుల ఆందోళన 

తాజాగా ఫ్యాక్టరీ కోసం భూ సర్వే చేస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రామాయి శివారులోని సర్వే నంబర్ 20/ఎ లో కొలాం తెగకు చెందిన రైతులకు సీలింగ్ యాక్ట్ ద్వారా1979లో ఒక్కొక్కరికి 5 ఎకరాలు భూమి ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత  రైతులకు ఇప్పటి వరకు డిజిటల్ పట్టాలు రాలేదు. దీంతో  రైతుబంధు, ఇతర పథకాలకు దూరమయ్యారు. ఇప్పుడేమో భూములను తీసుకునేందుకు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నోటీసులు ఇస్తోంది. కానీ, ఎంత భూమి ఉందో ఆ మొత్తాన్ని చూపించకుండా సగం కట్ చేసి అధికారులు ఫ్యాక్టరీకి చూపించే ప్రయత్నం చేస్తున్నారని కొలాం రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. తమకు పాత పట్టాపాస్ బుక్ లో ఎంత భూమి ఉంటే అంతే నష్ట పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొలం సంఘం నేతలు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఎకరానికి రూ. 40 లక్షలు ఇవ్వాలి

 సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇవ్వాలని నోటీసులు ఇస్తున్నారు. కానీ మా భూములకు సరైన ధర పెట్టడం లేదు. ఎకరానికి రూ. 8.10 లక్షల వరకు ఇస్తామంటున్నరు. రూ. 40 లక్షలు ఇస్తేనే న్యాయం జరుగుతుంది. మా భూములు ఇవ్వాలంటే పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. 
- కొడప సోనేరావు, రైతు, అడ్డగుట్ట