వెటర్నరీ వర్సిటీ భూములొద్దు..సెంట్రల్‌‌‌‌ జైల్‌‌‌‌ స్థలమివ్వండి

వెటర్నరీ వర్సిటీ భూములొద్దు..సెంట్రల్‌‌‌‌ జైల్‌‌‌‌ స్థలమివ్వండి
  •     మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు భూములు ఇచ్చే గుంటూర్‌‌‌‌పల్లి రైతుల డిమాండ్‌‌‌‌
  •     వర్సిటీ భూములు సాగుకు పనికిరావంటున్న గ్రామస్తులు
  •     జైల్‌‌‌‌ కోసం సేకరించిన 101 ఎకరాలు ఇవ్వాలని పట్టు
  •     ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో గ్రామానికి దూరం పెరుగుతుందని ఆవేదన
  •     సమస్యలు పరిష్కరించి, డిమాండ్లు నెరవేర్చాలని ఎమ్మెల్యేను కలిసిన నిర్వాసితులు

వరంగల్‍, వెలుగు : వరంగల్‌‌‌‌లోని మామునూరు ఎయిర్‌‌‌‌పోర్టు రీఓపెనింగ్‌‌‌‌ అంశం ఏండ్ల తరబడి పెండింగ్‌‌‌‌లోనే పడుతోంది. ఈ ఎయిర్‌‌‌‌పోర్టును తిరిగి ప్రారంభించేందుకు, విస్తరణకు అవసరమైన భూముల్లో ఎక్కువ శాతం పరకాల నియోజకవర్గంలోని గుంటూరుపల్లి రైతులకు సంబంధించినవే ఉన్నాయి. దీంతో భూమికి బదులుగా మరో చోట భూమి ఇవ్వాల్సిందేనని ఆ గ్రామ రైతులు పట్టుబడుతున్నారు. అయితే ఆఫీసర్లు ఇప్పటికే ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేసిన భూములు సాగుకు పనికిరావని, వేరో చోట భూములు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ఇలా పలు డిమాండ్లతో ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌‌‌రెడ్డిని కలిశారు.

పీవీ వర్సిటీ భూములు ఇచ్చేలా ప్రపోజల్స్‌‌‌‌

మామునూరులో 1930 సంవత్సరంలో సుమారు వెయ్యి ఎకరాల్లో ఎయిర్‌‌‌‌పోర్టును ఏర్పాటు చేశారు. తర్వాత దీనిపై పర్యవేక్షణ లేకపోవడంతో భూములు ఆక్రమణకు గురై ప్రస్తుతం 737.02 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎయిర్‌‌‌‌పోర్టును ప్రారంభించాలంటే 1,200 ఎకరాలు అవసరం అని ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తర్వాత 2020లో మామునూరు, వరంగల్‌‌‌‌ సిటీలో మట్టి నమూనాలు సేకరించి విమానాలు ఎగరడానికి ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు రిపోర్ట్‌‌‌‌ ఇచ్చింది. అయినా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములు అప్పగించే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

దీంతో కనీసం 253 ఎకరాలైనా ఇస్తే ఏ -– 320 తరహాలో సర్వీస్‌‌‌‌లు ప్రారంభిస్తామని ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా మరో ప్రపోజల్‌‌‌‌ పెట్టింది. ఏఏఐ ఆఫీసర్లు అడిగినట్లుగా 253 ఎకరాల భూములు అప్పగించే క్రమంలో డిజిటల్‌‌‌‌ సర్వే ఆధారంగా గుంటూర్‍పల్లి, నక్కలపల్లి, గాడిపల్లి, బొల్లికుంటలో రైతుల వద్ద 249.33 ఎకరాలు ఉన్నట్లు తేలింది. వాటిని సేకరించే క్రమంలో రైతులకు పరిహారంగా మరో చోట భూమి ఇవ్వాల్సి ఉంటుంది.

అందుకే ఎయిర్‍పోర్ట్‌‌‌‌కు దగ్గరగా ఉన్న పీవీ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన 605 ఎకరాల్లోంచి 373.02 ఎకరాలను ఖిలా వరంగల్‌‌‌‌ మండల పరిధిలోని రెవెన్యూ శాఖకు బదలాయించాలని గతేడాది మేలో కలెక్టర్‍ ప్రావీణ్య ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌ పంపారు. ఈ ఫైల్‌‌‌‌ను సైతం అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌ పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు.

ఊర్లకు రోడ్డు కోసం పట్టు

పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలంలో ఉన్న గుంటూర్‍పల్లిలో సుమారు 463 ఇండ్లు ఉండగా 2000 జనాభా, 1,300 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామస్తులు రంగశాయిపేట నుంచి గవిచర్ల, నెక్కొండ రోడ్‌‌‌‌ గుండా ఆరు కిలోమీటర్లు ప్రయాణించి గుంటూర్‌‌‌‌పల్లి చేరుకుంటున్నారు. ప్రస్తుతం రైతులు ఇచ్చే భూముల్లోనే ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ రన్‌‌‌‌వే నిర్మించాల్సి ఉండడంతో ఈ రోడ్డు పూర్తిగా క్లోజ్‌‌‌‌ అవుతుంది. అదే జరిగితే గుంటూర్‌‌‌‌పల్లి ప్రజలు ఖిలా వరంగల్‍, వసంతపూర్‍, కాపులకనిపర్తి మీదుగా 11 నుంచి 12 కిలోమీటర్ల ప్రయాణించి గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది.

ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌‌‌‌పోర్టును ప్రారంభిస్తే గ్రామానికి వెళ్లేందుకు వీలుగా టన్నెల్స్‌‌‌‌ నిర్మించాలని కోరుతున్నారు. అలాగే ఎయిర్‍పోర్ట్‌‌‌‌కు ఇచ్చే భూముల్లో గాడిపల్లి చెరువు కింద ఉన్న 23 ఎకరాలు కూడా ఉన్నాయి. ఈ భూముల్లో పోచమ్మ ఆలయం, వైకుంఠధామం, ఇండ్లు ఉన్నందున ఈ భూములు ఇవ్వలేమని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా పలు సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేర్చాలంటూ గ్రామస్తులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌‌‌రెడ్డిని కలిశారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సమాచారం. 

సెంట్రల్‌‌‌‌ జైలు భూములు అడుగుతున్న రైతులు

ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా అడిగిన 253 ఎకరాల్లో గుంటూర్‍పల్లితో పాటు నక్కలపల్లి గ్రామ రైతుల భూములు ఉన్నాయి. ఈ భూములు తీసుకున్నందుకు బదులుగా రైతులకు ఇచ్చేందుకు ప్రపోజల్స్‌‌‌‌ పెట్టిన పీవీ వెటర్నటీ యూనివర్సిటీకి చెందిన డెయిరీ ల్యాండ్స్‌‌‌‌ రైతులు తిరస్కరిస్తున్నారు. ఆ భూములు సాగుకు అనుకూలంగా లేవని వాటిని తీసుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో పోలీస్‌‌‌‌ శాఖ ఫోర్త్‌‌‌‌ బెటాలియన్‌‌‌‌కు 344.05 ఎకరాల భూములు ఉన్నాయి. నగరంలోని సెంట్రల్‌‌‌‌ జైల్‌‌‌‌ను కూల్చిన టైంలో కొత్త జైల్‌‌‌‌ నిర్మాణం కోసం బెటాలియన్‌‌‌‌కు చెందిన 101 ఎకరాలు కేటాయించారు.

ఆపై నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ భూములతో పాటు వీటికి దగ్గర్లోని 40, 45 ఎకరాలను తమకు కేటాయించాలని గుంటూర్‌‌‌‌పల్లి రైతులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ఇవి కాదంటే ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం గతంలో నాయుడు పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ సమీపంలో సేకరించిన రాజవారి కంచెకు చెందిన 300 ఎకరాల్లో తమకు స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే భవిష్యత్‌‌‌‌ అభివృద్ధి కోసం తీసుకున్న ఈ భూములు రైతులకు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 

భూములిచ్చిన వారికి న్యాయం చేయాలి  

ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కోసం భూములు తీసుకుంటామని మార్కింగ్‌‌‌‌ పెట్టిన్రు. భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరితే సాగుకు అనువుగా లేని భూములను ఇస్తామంటున్నరు. అందుకే సెంట్రల్‌‌‌‌ జైల్‌‌‌‌ కోసం సేకరించిన భూములు అడుగుతున్నాం. అలాగే ఊరికి వెళ్లేందుకు వీలుగా ఇప్పటిలెక్కనే రోడ్లు వెయ్యాలి. మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నం.

-శ్రీకాంత్‍, రైతు, గుంటూర్‍పల్లి

న్యాయం చేసేందుకు కృషి  

మామునూర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ విస్తరణ కోసం భూములు ఇస్తున్న రైతులు పలు సమస్యలు, డిమాండ్లను పెట్టింది వాస్తవమే. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్‌‌‌‌ చేసే టైంలో ఇలాంటివి ఎదురవుతుంటాయి. గత ప్రభుత్వం మాదిరిగా రైతులకు అన్యాయం చేయాలని అనుకోవడం లేదు.  ఈ ఇష్యూ జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి దృష్టిలో ఉంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తా. 

-రేవూరి ప్రకాశ్‍రెడ్డి, పరకాల ఎమ్మెల్యే