
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో పర్యాటకుల భద్రతే ప్రధాన అజెండాగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్లోని 87 పర్యాటక ప్రదేశాల్లో 48 పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేసింది. పర్యాటకులను అనుమతించే 39 పర్యాటక ప్రదేశాల్లో కశ్మీర్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. పర్యాటకులు ఏ టూరిస్ట్ స్పాట్లు విజిట్ చేయడానికి వచ్చారో తెలుసుకుని నిషేధిత పర్యాటక ప్రదేశాలయితే.. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుంచే తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు.
యూస్మార్గ్, దూద్పత్రి, అహర్బల్, బంగాస్వ్యాలీ వంటి కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. పలు ఎకో టూరిజం సైట్లను కూడా ప్రభుత్వం మూసివేసింది. ఎకో పార్క్ ఖాడ్నియర్, పద్సాపల్, చెర్రీ ట్రీ రిసార్ట్ వంటి డెస్టినేషన్స్ కూడా క్లోజ్ చేశారు. పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని పర్యాటక ప్రదేశాలకు అనుమతించడం లేదని, భద్రతను పటిష్టం చేశాక తిరిగి అనుమతిస్తామని జమ్ము కశ్మీర్ ప్రభుత్వం తెలిపింది.
టెర్రరిస్టుల క్రూర దాడితో ఈ నెల 22న ఉలిక్కిపడిన పహల్గాం మెల్లిగా ఊపిరి పీల్చుకుంటోంది. నాలుగు రోజుల పాటు పర్యాటకులు పెద్దగా కనిపించలేదు. ఆదివారం మాత్రం దేశం నలుమూలల నుంచి టూరిస్టులు పహల్గాంను సందర్శించారు. ఇందులో విదేశీ పర్యాటకులూ ఉన్నారు.
సాధారణ రోజుల్లో రోజుకు 5 వేల నుంచి 7 వేల మంది సందర్శకులు వచ్చేటోళ్లు.. ప్రస్తుతం రెండు మూడు వందల మంది మాత్రమే సందర్శించారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ భద్రతను భారీగా పెంచడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దాడి జరిగిన బైసరన్ ప్రాంతాన్ని మాత్రం ఇంకా తెరవలేదు.