- ప్రైవేట్ జెట్టి కోసం పేదల బోట్లపై నిషేధం
- కృష్ణాలో మరబోట్లకు పర్మిషన్ ఇయ్యని సర్కారు
- వెయ్యి కుటుంబాల ఉపాధికి దెబ్బ.. మూడు నెలలుగా ఆకలి కేకలు
నాగర్‌కర్నూల్, వెలుగు : తెలంగాణ, ఏపీలో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఓ కంపెనీకి చెందిన జెట్టీలు ఏ ఆటంకం లేకుండా కృష్ణానదిలో తిరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెంచులు, మత్స్యకారుల పొట్టకొడుతున్నారు. కృష్ణా తీర గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి కుటుంబాలు నదిలో మరబోట్ల ద్వారా జనాల్ని, సరుకులు రవాణా చేస్తూ, చేపలు పడ్తూ ఉపాధి పొందేవి. మొదట్లో జెట్టీల వల్ల తమ వలలు తెగిపోతున్నాయని మత్స్యకారులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని ఆఫీసర్లు, ఏపీ, తెలంగాణ బోటు నిర్వాహకుల మధ్య జరిగిన చిన్న తగాదాను సాకుగా చూపి మరబోట్లకు ఏకంగా పర్మిషన్ రద్దు చేసి తిరగనివ్వడం లేదు. దీంతో 3 నెలలుగా ఉపాధి కోల్పోయి పేద చెంచులు, మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు.
మరబోట్లు నడిస్తేనే ఇల్లు గడిచేది
నాగర్‌కర్నూల్ జిల్లా కృష్ణాతీరాన ఉన్న 11 గ్రామాల ప్రజలు దాదాపు 20 ఏండ్లుగా నదిలో మరబోట్లు నడుపుకుంటూ జీవిస్తున్నారు. జనాన్ని, సరుకులను రవాణా చేయడంతోపాటు చేపలవేట చేసేవారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కృష్ణాతీర గ్రామాలైన సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, కాలూరు, చెల్లపాడు, అయ్యవారిపల్లె, అమరగిరి, పెద్దమారూరు, చిన్నమారూర్, జటప్రోల్, యాపర్ల నుంచి ఏపీ లోని గుందిమల్ల కొండపాటూరు, సిద్ధేశ్వరానికి బోట్లు నడిపించేవారు. జనవరి రెండో వారంలో ఏపీ, తెలంగాణ బోట్ నిర్వాహకుల మధ్య చిన్న గొడవ జరగడంతో ఏపీ పోలీసులు జోక్యం చేసుకొని, కృష్ణానదిలో బోట్లు నడిపేందుకు పర్మిషన్, లైసెన్స్ఉండాలని, లేకపోతే బోట్లను అనుమతించబోమని ఆంక్షలు పెట్టారు. భద్రతాకారణాలు సాకుగా చూపి తెలంగాణ బోట్లను పూర్తిగా ఆపేశారు.
అప్పటికే ఈ బోట్ల వల్ల తమ జెట్టి రాకపోకలకు ఆటంకం కలుగుతోందని ఆ పెద్ద కంపెనీ అధికారులు ఫిర్యాదు చేయడంతో అదును కోసం చూసిన తెలంగాణ అధికారులకు ఇదో సాకు దొరికింది. ఇలా ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు మరబోట్లను తిప్పేందుకు అనుమతించకపోవడంతో మూడు నెలలుగా బోట్ల నిర్వాహకులు కుటుంబాలను పోషించుకునేందుకు అష్టకష్టాలు పడ్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే తీరప్రాంతాల ప్రజలు అదనంగా 100 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
జెట్టిలతో తెగుతున్న చేపల వలలు
కంపెనీ జెట్టి(డ్రెడ్జ్)లు ఏ పర్మిషన్ లేకుండానే తిరుగుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. నదిలో భారీ పడవలు, డ్రెడ్జ్లు నడపడానికి కేఆర్ఎంబీ, ఫారెస్ట్, ఎన్విరాన్ మెంట్, పోలీస్, రెవెన్యూ శాఖలు, షిప్పింగ్ కార్పొరేషన్ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నదిలోనూ, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోనూ డస్ట్, వేస్ట్ మెటీరియల్స్‌తో కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వైపు నుంచి కంకర, ఇసుక లాంటి మెటీరియల్ తరలిస్తే రాయల్టీ కట్టాలి. కానీ కంపెనీ డ్రెడ్జ్లు ఇవేవీ ఖాతరు చేయకుండానే తిరుగుతున్నాయి. సదరు కంపెనీ ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ప్రాజెక్టు పనులు చేస్తోంది. రెండు సైట్లకు మధ్య మెటీరియల్ సప్లై చేసేందుకు జెట్టీ (డ్రెడ్జ్)లు అటుఇటు తిప్పుతున్నారు. వీటి రాకపోకల వల్ల తాము చేపలు పట్టేందుకు వేసుకున్న వలలు తెగిపోతున్నాయని చెంచులు, మత్స్యకారులు మొదట్లో ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదులను పట్టించుకోని సర్కారు ఇప్పుడు ఏకంగా మత్స్యకారుల బోట్లకు పర్మిషన్రద్దు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జెట్టిల కోసమేనా?
పగలు రాత్రి తేడా లేకుండా కృష్ణానదిలో తిరిగే ఆ కంపెనీ జెట్టికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకే మరబోట్లపై ఆంక్షలు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలుగా దాదాపు వెయ్యి కుటుంబాలు ఉపాధి లేక చేతిలో రూపాయి లేక ఆకలితో అవస్థలు పడుతున్నా ఆఫీసర్లు స్పందించడం లేదు. ప్రైవేట్ కంపెనీ మీద చర్యలు తీసుకుంటే సీఎంవో స్థాయిలో ఒత్తిళ్లు వస్తాయనే అధికారులు జంకుతున్నారు.
అదే మా ఉపాధి
నదిలో బోట్లు తిప్పి బతికెటోళ్లం. మూడు నెలల నుంచి పనులు లేక ఇబ్బందులు పడుతున్నం. ఇల్లు గడుస్తలేదు. బోట్లు నడుపుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలి.
- లక్ష్మీ నారాయణ, సోమశిల, నాగర్‌కర్నూల్ జిల్లా
మా పొట్ట కొట్టొద్దు
కృష్ణమ్మ మా అమ్మ . ఆ తల్లిని నమ్ముకునే 20 ఏండ్లుగా బతుకుతున్నం. తెలంగాణ నుంచి బోట్లు తిప్పొద్దని ఏపీ ఆఫీసర్లు కండీషన్ పెట్టారు. దాదాపు 1,000 కుటుంబాలు దీనిపై ఆధారపడి బతుకుతున్నయ్. మా పొట్ట కొట్టొద్దు.
- వెంకట నర్సింహ, మంచాలకట్ట, నాగర్‌కర్నూల్ జిల్లా