కరోనా కొత్త వేరియంట్ పైఆఫీసర్ల అలెర్ట్
వరంగల్, వెలుగు : కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్–7 ఉధృతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఆఫీసర్లు అలెర్ట్ అవుతున్నారు. కేంద్రం ఆదేశానుసారం ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ బెడ్లు సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని జిల్లాల డీఎంహెచ్ వోలు దీనిపై రివ్యూలు చేసి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కొవిడ్ విజృంభిస్తే తీసుకోవాల్సిన చర్యలు వివరి స్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంజీఎంలో స్పెషల్ వార్డులు..
వరంగల్ ఎంజీఎంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. గతంలో వెయ్యి బెడ్లతో ఉండగా.. ప్రస్తుతం 1500 బెడ్లకు పెంచి, స్పెషల్ వార్డు కేటాయించారు. ఎంజీఎంలో 1250 బెడ్లు, దీని పరిధిలోనే నడుస్తున్న కేఎంసీలో 250 బెడ్లు అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ పేషెంట్లకు ట్రీట్‍మెంట్ ఇచ్చేందుకు 144 వెంటిలెటర్స్ సిద్ధం చేశారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అవసరమైన ఎక్విప్‍మెంట్ రెడీ చేశారు. చైనాలో వైరస్ తీవ్రతను బట్టి ఈ వేరియంట్ స్పీడ్‌గా వ్యాపిస్తుందని ఎంజీఎం డాక్టర్లు చెబుతున్నారు.
ఆక్సిజన్ ట్యాంకర్లు పెంచుతున్రు..
ఎంజీఎం హాస్పిటల్ లో గతంలో 13కేఎల్, 10 కేఎల్ కెపాసిటీగల ఆక్సీజన్ ట్యాంకులున్నాయి. ఇవి 1000 మందికి సరిపోతాయి. కాగా, ప్రస్తుతం మరో 500 బెడ్లు పెంచినందున ఆక్సిజన్ కెసాసిటీ పెంచేలా ఎంజీఎంలో మరో 10కేఎల్, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్‍లో 10కేఎల్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బూస్టర్ డోస్ కోసం పరుగులు..
కొవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో గతంలో బూస్టర్ డోస్ వద్దన్నవారు ఇప్పుడు కావాలంటూ పరుగులు పెడుతున్నారు. గతంలో బూస్టర్ డోస్ టీకాపై అధికారులు, సిబ్బంది ఎంత ప్రచారం చేసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. గడువు ముగుస్తుండడంతో ఆయా జిల్లాల అధికారులు రెండు నెలల క్రితం తమ వద్ద ఉన్న స్టాక్ వెనక్కి పంపారు. దీంతో సిబ్బంది బూస్టర్ డోస్ పంపిణీ నిలిపివేశారు. మళ్లీ కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఇప్పుడు బూస్టర్ డోస్ కావాలంటూ జనాలు అడుగుతున్నారు. కానీ చాలా చోట్ల ఇవి అందుబాటులో లేవు. కాగా, ఆఫీసర్లు మాత్రం త్వరలోనే బూస్టర్ డోసులు వస్తాయని చెబుతున్నారు.
జనగామలో కొవిడ్ మాక్ డ్రిల్
జనగామ : కొవిడ్ మళ్లీ విజృభిస్తే అనుచరించాల్సి న విధానాలపై జనగామలో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. జనగామ జిల్లా ఆసుపత్రితో పాటు జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం, పాలకుర్తి, జఫర్ ఘడ్, స్టేషన్ ఘన్ పూర్, బచ్చన్నపేట సీహెచ్ సీల్లో ఈ కార్యక్రమం జరిపారు. అందుబాటులో ఉన్న సిబ్బంది, బెడ్ల సంఖ్యను బేరీజు వేశారు. జిల్లాలో మొత్తం 120 బెడ్లు కరోనా పేషెంట్లకు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రెసిడెంట్ టూర్ నేపథ్యంలో కరోనా టెస్టులు
ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. ఈనేపథ్యంలో ఆఫీసర్లకు కరోనా టెస్టులు చేస్తున్నారు. నెగిటివ్ ఉన్నవారినే రాష్ట్రపతి సిబ్బంది విధుల్లోకి అనుమతి ఇస్తున్నారు. బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ కరోనా టెస్టులు చేసుకున్నారు. డీఎంహెచ్ వో డాక్టర్ అల్లెం అప్పయ్య ఆధ్వర్యంలో టెస్టులు జరుగుతున్నాయి.