మాఫీ అయిన లోన్లు మళ్లీ కట్టుమంటున్నరు! 

మాఫీ అయిన లోన్లు మళ్లీ కట్టుమంటున్నరు! 

మాఫీ అయిన లోన్లు మళ్లీ కట్టుమంటున్నరు! 
2008-09లో మాఫీ చేసిన గత సర్కారు
అదే అమౌంట్‌ను 2017లో లోన్‌గా ఇచ్చినట్లు లిస్ట్  
రీ పేమెంట్​చేయాలని జీపీ బోర్డుపై  డిస్‌ప్లే
ఉమ్మడి గండీడ్‌ పీఏసీఎస్ అధికారులు నిర్వాకం..
ఆందోళన వ్యక్తం చేస్తున్న     బాధిత రైతులు

మహబూబ్​నగర్, గండీడ్‌, వెలుగు : ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో మాఫీ అయిన రుణాలను మహబూబ్‌నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ పీఏసీఎస్‌ అధికారులు మళ్లీ కట్టుమంటున్నారు. మాఫీ అయిన ఎనిమిదేళ్ల తర్వాత అంతే అమౌంట్‌ రుణంగా ఇచ్చినట్లు లిస్ట్‌ రెడీ చేశారు. ఇటీవల గండీడ్‌ మండలం రెడ్డిపల్లికి చెందిన లిస్టును గ్రామపంచాయతీ బోర్డుపై అతికించారు. లిస్టు ప్రకారం ఒక్కో రైతు పేరు మీద వడ్డీతో కలిపి రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉండటంతో రైతులు ఖంగుతిన్నారు.  పీఏసీఎస్​అధికారులే తమ పేరుమీద లోన్లు తీసుకొని, తమతో కట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రూ. కోటికి పైగానే డ్యూస్..​

గండీడ్ మండలం రెడ్డిపల్లి, రంగారెడ్డిపల్లి, చెన్నారెడ్డిపల్లి, సల్కార్​పేట్​, గండీడ్, నంచర్ల గ్రామాలకు చెందిన 149 మంది రైతులు 2001-–02లో  పీఏసీఎస్​ ద్వారా క్రాప్​ లోన్లు తీసుకున్నారు. 2008-–09లో వైఎస్సార్​ ప్రభుత్వం ఈ క్రాప్​ లోన్​లను మాఫీ చేసింది.  ఇందులో భాగంగా ఈ రైతులు తీసుకున్న రూ.74,63,447  మాఫీ అయ్యాయి. అయితే, పీఏసీఎస్‌ సిబ్బంది మార్చి 31, 2017న ఇచ్చిన రుణాలు డ్యూ ఉన్నాయంటూ నవంబర్‌‌ 30, 2022న లిస్టు తయారు చేశారు.  149 మంది రైతులకు రూ.74,63,447 పంపిణీ చేశామని, వడ్డీ రూ.30,00,581 కలుపుకొని మొత్తం రూ.1,04,64,028 డ్యూస్​ఉన్నట్లు లిస్టు రెడీ చేసి.. రెడ్డిపల్లి  గ్రామ పంచాయతీ బోర్డు మీద అతికించారు. ఇది చూసిన రైతులు తాము తీసుకున్న లోన్లు ఎప్పుడో మాఫీ అయ్యాయని, ఇవెక్కడివని మండిపడుతున్నారు. 

లిస్టులో చనిపోయిన వారి పేర్లు

లిస్టులో ఉన్న 149 మందిలో కొందరు 2012, 2013, 2015లో చనిపోయారు. వీరి పేరు మీద ఉన్న భూమిని వారసులు విరాసత్​ చేసుకొని, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఇస్తున్న ‘రైతుబంధు’ పైసలు కూడా వీరి అకౌంట్లలోనే జమ అవుతున్నాయి. కాగా, ఇటీవల వీరు పీఏసీఎస్​లలో వడ్లను అమ్ముకున్నారు. ఆ టైంలో ఆధార్ నంబర్లను ఇవ్వడంతో సిబ్బంది వీరి అకౌంట్‌ను చనిపోయిన వారి అకౌంట్లకు లింక్​ చేశారు.  దీంతో  కేంద్రం నుంచి వస్తున్న ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మన్​ నిధి డబ్బులను చనిపోయిన వ్యక్తుల బ్యాంకు అకౌంట్​లో జమ అవుతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మీ వాళ్లు లోన్​ బాకీ ఉన్నారని, వాటి కింద ఈ డబ్బును జమ చేస్తున్నట్లు సిబ్బంది సమాధానమిస్తున్నారు.

నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తలేరు..

పీఏసీఎస్​లో చాలామంది రైతులు లాంగ్​టర్మ్ ​లోన్లు తీసుకున్నారు.  కొందరు నెల నెలా కిస్తీలు కట్టి లోన్లు క్లియర్ ​కూడా చేసుకున్నారు.  కొందరి కిస్తీలు డ్యూ ఉంటే సిబ్బంది రైతుల ఇళ్ల వద్దకు వచ్చి కట్టించుకున్నారు. రసీదులు ఇచ్చినా వాటి మీద తేదీలను మెన్షన్​ చేయలేదు.  కొత్త లోన్ల కోసం రైతులు నో డ్యూ సర్టిఫికెట్లు అడిగితే.. ఆఫీసర్లు  తర్వాత రమ్మని చెబుతున్నారు.  ఈ లోన్లు కూడా డ్యూస్​ కిందనే ఉన్నాయోమేనని రైతులు అనుమానం వ్యక్తం 
చేస్తున్నారు.

అకౌంట్ స్టేట్​మెంట్​ ఇస్తలేరు

మా అమ్మ వెంకటమ్మకు సర్వే నంబర్​ 508లో రెండు ఎకరాల భూమి ఉంది.  గతంలో కోఆపరేటివ్​ బ్యాంక్​లో లోన్​ తీసుకుంటే 2009లో మాఫీ అయ్యింది. ఆమె 2012‌లో చనిపోతే నా పేరు మీద  విరాసత్​ చేసుకున్న. ఇంతకుముందు ఎస్​బీఐ అకౌంట్​లోనే ‘రైతుబంధు’, పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పైసలు పడుతుంటే. మొన్నటి విడత పైసలు నా అకౌంట్లో పడలేదు. ఎంక్వైరీ చేస్తే కోఆపరేటివ్​ బ్యాంక్​ అకౌంట్‌లో పడ్డయని చెప్పారు. అక్కడికి పోయి చూస్తే మా అమ్మ లోన్​ బాకీ కింద జమ చేసుకున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అకౌంట్​ స్టేట్​మెంట్​ అడిగితే ఇస్తలేరు.

- కుడుముల బాల్​రెడ్డి, రైతు, గండీడ్​ మండలం

వడ్డీ అమౌంట్‌ను కూడా మాఫీకి పెట్టినం

గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న లోన్లకు సంబంధించి ప్రిన్సిపల్​అమౌంట్‌కు మాత్రమే రుణమాఫీ అయ్యింది. వడ్డీ అమౌంట్ దాదాపు రూ.30 లక్షల వరకు రైతులు చెల్లించాల్సి ఉంది. ఈ అమౌంట్‌ను కూడా మాఫీకి పెట్టినం. ఈ క్రమంలో లోన్స్​ తీసుకున్న వారిలో ఎవరెవరూ చనిపోయారు..? బతికున్నారో..? తెలుసుకునేందుకు లిస్ట్​ను తయారు చేసినం.

- ఆంజనేయులు, పీఏసీఎస్‌ మేనేజర్, మహమ్మదాబాద్​ బ్రాంచ్