బిగ్బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం (డిసెంబర్ 25న) నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 ఫైనల్స్ సమయంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు తాజాగా 41సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. విచారణ అధికారి ముందు మూడు రోజుల్లో హాజరుకావాలని ఆదేశించారు.
ఈ వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు రెండ్రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై.. సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో 12 మంది నిందితులు సైతం బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మరోవైపు.. పల్లవి ప్రశాంత్‌కు సంబంధించిన కేసులో సోమవారం (డిసెంబర్ 25న) మరో ముగ్గురు అరెస్టయ్యారు. సరూర్‌నగర్‌కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్‌గూడకు చెందిన సుధాకర్, పవన్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు.