న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలి

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు, మీడియా… ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు. వీటిలో ఏ ఒక్కటీ మరోదాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినా అది దేశానికే మంచిది కాదు. ముఖ్యంగా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వాటి పరిమితులను దాటి మరో వ్యవస్థ అధికారాల్లో, నిర్వహణలో జోక్యం చేసుకునే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. రాజ్యాంగ లక్ష్యాలను కాపాడుతూ వ్యవస్థలన్నీ స్వేచ్ఛగా పని చేయగలగాలి. మన రాజ్యాంగ మూల సూత్రాలను ఏ వ్యవస్థ అయినా ఉల్లంఘించేలా వ్యవహరిస్తే కట్టడి చేసే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు కట్టబెట్టారు మన రాజ్యాంగ నిర్మాతలు. కానీ అటువంటి వ్యవస్థకు కూడా మకిలి అంటుకునే పరిస్థితి దాపురించింది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. న్యాయ వ్యవస్థలో అంతర్గతంగా లోపాలు ఉంటే వాటిని తనంతట తానే సరిదిద్దుకోవాలి. మరొకరు జోక్యం చేసుకునేదాకా వెళ్లకూడదు. అవినీతి లాంటి వాటికి చోటు లేకుండా చూసుకుంటూ, లోపాలను సవరించుకుని న్యాయవ్యవస్థ తన స్వతంత్రత కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.

ఎటువంటి భయానికి రాగద్వేషాలకు తావులేకుండా తీర్పులిస్తానని హైకోర్టులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పదవి స్వీకరణ చేసేటప్పుడు ప్రమాణం చేస్తారు. అంటే పిటిషనర్లు ఎవరైనా సరే, డబ్బు, అధికారం కలవారైనా, నిరుపేదలైన, మధ్యతరగతి వారైనా,  కుల, మత జాతి, ప్రాంత వివక్షకు, పక్షపాతానికి తావు లేకుండా తీర్పులిస్తామని ఆ ప్రతిజ్ఞ ఉద్దేశం. చట్టాల్లో  లోసుగులుంటే అది  వేరే విషయం. ఆ చట్టాలను సవరించే బాధ్యత శాసనాలు చేసే పార్లమెంటు, అసెంబ్లీలది.

పార్లమెంటు, అసెంబ్లీలు సరైన చట్టాలు చేస్తున్నాయా? ప్రభుత్వ పాలసీలు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అనే అంశాన్ని ప్రస్తుతం చర్చించదలుచుకోలేదు. కార్యనిర్వాహక వ్యవస్థ తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నదా లేదా అనేది కూడా అప్రస్తుతం. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే శాసన, కార్యనిర్వాహక విభాగాలు క్రమంగా ప్రజల విశ్వాసం కోల్పోతున్నాయనేది వాస్తవం. రాజకీయ నాయకులు, అధికారులు పరస్పరం సహకరించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతుండడమే దీనికి ప్రధాన కారణం.

మరోవైపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత పాలనా తీరులో పెద్దగా మార్పులేకపోవడం, వ్యవస్థ గాడి తప్పకుండా చట్టాలను చేసే విధి నిర్వహణలో ఫెయిల్ అవ్వడం వల్ల.. “ఏ రాయి అయితేనేం పళ్లు రాలగొట్టుకోవడానికి” అనే భావన ప్రజల్లో బలపడుతోంది. కొన్నేళ్లుగా న్యాయ వ్యవస్థలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.

జడ్జిల నియామకంలో ప్రభుత్వాల జోక్యం తగదు

న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక విభాగం లేదా శాసన విభాగం ఎట్టి పరిస్థితుల్లోను  జోక్యం చేసుకోవద్దు. న్యాయమూర్తుల నియామకాల నుంచి మొదలు పెడితే కోర్టుల సంఖ్యను పెంచే విషయమైనా, కోర్టుల నిర్వహణ అయినా మొత్తం న్యాయవ్యవస్థ చేతిలోనే ఉండాలి. న్యాయమూర్తుల ప్రమోషన్లలో, జిల్లా జడ్జిలను హైకోర్టు జడ్జిలుగా నియమించేటప్పుడు, హైకోర్టు జడ్జిలను సుప్రీంకోర్టు జడ్జిలుగా లేదా చీఫ్ జస్టిస్ లుగా నియమించేటప్పుడు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేసేటప్పుడు కొలీజియం నిర్ణయమే ఫైనల్ గా ఉండాలి. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నియామకంలో కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ కావాలి. ఇక్కడ ప్రభుత్వాలకు అధికారాలిస్తే వారు తమకు అనుకూలమైన వారి వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది.

సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ తమకు అనుకూలమైన వ్యక్తి ఉండాలని పాలకులు ఆలోచన చేస్తే.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడమే. ఉన్నత న్యాయస్థానాల జడ్జిలను ప్రభావితం చేయాలని చూడడం డైరెక్టుగా, ఇండైరెక్టుగా బెదిరించడమే.- న్యాయ వ్యవస్థను కూల్చివేయడంతో సమానం-. కోర్టుల్లో పిటిషన్లు అప్పీలకు వెళ్లినప్పుడు అంతిమంగా న్యాయమే గెలవాలి.

ఎమర్జెన్సీ కాలంలో బీజం

న్యాయమూర్తులు తమకు అనుకూలమైన వారుగా ఉండాలనే భావన ఎమర్జెన్సీ కాలంలో ప్రారంభమైంది. అప్పటి ప్రధానమంత్రి ఎన్నికను అలహాబాద్ కోర్టు రద్దు చేయడం, సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లడం.. అక్కడ తీర్పు తమకు అనుకూలంగా రావాలని ఆలోచించడంతో న్యాయవ్యవస్థలో జోక్యం ప్రారంభమైంది. అప్పుడు సీనియార్టీ ప్రకారం నియమించాల్సిన సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిని కాదని 4వ స్థానంలో ఉన్న జడ్జి సీజేగా నియమించడంతో సీనియర్ జడ్జీలు రాజీనామాలు చేశారు. క్రమంగా అప్పటి నుంచి జడ్జీల నియామకాల్లో, బదిలీల్లో ప్రభుత్వ జోక్యం పెరిగి పోయింది. రాజకీయాల్లో అంతులేని అవినీతి పెరగడం… ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతం అవినీతి కేసుల్లో జైలుకెళ్లడం ఇటీవల చూశాం. న్యాయవ్యవస్థ తమ చెప్పుచేతల్లో ఉంటే తమ అన్యాయాలకు,అవినీతికి అడ్డు లేకుండా ఉంటుందని అవినీతి రాజకీయ నాయకులు, అధికారులు ఆలోచిస్తున్నారు.

పెద్దన్న పాత్ర పోషించాలి

అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి ఇతరులను సక్రమంగా ఉండమని చెప్పలేడు. అవినీతికి పాల్పడుతున్న వ్యక్తి అవినీతిపరులపై చర్యలు తీసుకోలేడు.   కానీ కొంతమంది తీరు ఇలానే ఉంది. ప్రజల హక్కులు ముఖ్యంగా ప్రాథమిక హక్కులు హరింపబడుతున్న న్యాయ వ్యవస్థ నుండి సరైన స్పందన కనిపించడం లేదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను కాపాడడం, అవినీతి, అక్రమాలను అరికట్టడంలో ముందుండాలి. పేద ప్రజల రక్షణకై ఉన్న చట్టాల అమలు సక్రమంగా జరగకపోతే.. ఆ వ్యవస్థల్ని గాడిలో పెట్టి న్యాయం జరిగేలా చూసే పెద్దన్నలా వ్యవహరించాలి.

లోపాలను సవరించాల్సిందే, కానీ..

న్యాయ వ్యవస్థలోని లోపాలను సవరించడం ఎంత అవసరమో, న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడడం అంతే అవసరం. న్యాయమూర్తులపై రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి మీద లేనిపోని ఆరోపణలు చేయడం, న్యాయమూర్తులను లొంగదీసుకునే ప్రయత్నాలు అవుతాయి. న్యాయ వ్యవస్థలో అవినీతి ఎంత ప్రమాదకరమో, న్యాయమూర్తులను లొంగదీసుకునే ప్రయత్నాలూ అంతే ప్రమాదం. అయితే న్యాయ వ్యవస్థపై, అందులోని వ్యక్తులపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ విచారణ చేపట్టాలి. ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలి. తప్పు జరిగి ఉంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తినైనా శిక్షించాలి. ఒకవేళ అవి ఎటువంటి ఆధారాలు లేని నిందలే అని తేలితే.. ఆరోపణలు చేసిన వాళ్లను శిక్షించాల్సిందే. అలా చేయకుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది. వచ్చిన ఆరోపణలను పట్టించుకోకుంటే న్యాయవ్యవస్థను లొంగదీసుకోవాలనుకునేవారికి తేలిక భావన ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా  తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుందన్న భరోసా జనాల్లో కలిగేలా సుప్రీం కోర్టు వ్యవహరించాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. రాజకీయ స్వార్థాలకు లొంగే పరిస్థితి న్యాయ వ్యవస్థలో ఉండదన్న  మెసేజ్ ఇవ్వాలి. అప్పుడే అన్ని స్థాయిల్లో కోర్టులు జడ్జిల్లోనూ నైతికత పెరుగుతుంది.

న్యాయవ్యవస్థలోనూ అవినీతి దురదృష్టకరం

న్యాయ వ్యవస్థలో అవినీతి చీడ చేరడం దేశ హితం కోరుకునే వాళ్లలో ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి వాటి కారణంగా కొంతమంది జడ్జీలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. గతంలో ఓ అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడి నుంచి కోట్ల రూపాయల లంచం తీసుకుని బెయిల్ ఇచ్చారన్న ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఆ జడ్జి ఆత్మహత్య చేసుకోడం సంచలనం రేపింది. ఇలా అవినీతికి న్యాయ వ్యవస్థలో చోటుందన్న ఆలోచనే రాజకీయ నాయకులకు అలుసుగా మారుతుంది. జడ్జిలను తమ అధికారం, డబ్బుతో లోబరుచుకునే ప్రయత్నం చేస్తారు.

– జస్టిస్ బి.చంద్రకుమార్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

For More News..

తెలంగాణ యువత గోస కనబడతలేదా?

దుబ్బాక రిజల్ట్స్​ ప్రకటించొద్దు

మాట్లాడాలని పిలిచి గ్యాంగ్ రేప్, మర్డర్