బీసీ కులాలన్నిటినీ..ఓబీసీ జాబితాలో చేర్చాలె

కేంద్ర జాబితాలో ఉన్న ఓబీసీ కులాలు అన్నిటినీ సమీక్షించి ఆయా వర్గాలన్నీ సముచిత రీతిలో రిజర్వేషన్ల ఫలాలు పొందేలా చేయడానికి నియమించిన జస్టిస్​రోహిణి కమిషన్​ తన ప్రాథమిక నివేదికను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. వివిధ రాష్ట్రాల్లో సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ చేసిన కమిషన్.. కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్న  2,633 కులాలను 4 ఉప విభాగాలుగా వర్గీకరించాలని ప్రతిపాదించనుంది. అయితే తెలంగాణలో మొత్తం130 బీసీ కులాలు ఉంటే వాటిలో కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నయి 90 మాత్రమే. ఇంకా 40 కులాలను ఇప్పటి దాకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. పక్క రాష్ట్రం ఏపీ సహా చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఏపీలో 146 బీసీ కులాలు ఉంటే108 కులాలు మాత్రమే కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చకుండా ఓబీసీ వర్గీకరణ చేసి 27 శాతం రిజర్వేషన్లను పంచితే ఓబీసీ జాబితాలో చోటు దక్కని బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి.

బీసీలకు న్యాయం జరగాల్సిందే..

తెలంగాణ నుంచి కేంద్ర ఓబీసీ జాబితాలో చోటు దక్కని సామాజిక వర్గాలు చాలా బీద కులాలు. ఆయా కుటుంబాలకు చెందిన బిడ్డలు విద్య పరంగా రిజర్వేషన్లు ఫలాలు అందుకొని చదువుకోవాలన్నా.., ఉద్యోగాలు పొందాలన్నా వీలు లేని పరిస్థితి ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. బీసీ నాయకులు, అధికారులు, సంఘాల ప్రతినిధులు ఈ సమస్యపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన 3,867 కులాలకు నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని కేంద్ర ఓబీసీ జాబితాలో లేని బీసీ కుల సంఘాలు ఏకమై కొట్లాడాలె. 

ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి. రోహిణి నేతృత్వంలో 2017లో ఏర్పడిన కమిషన్​ఓబీసీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే రిపోర్టు ఆధారంగానే ఓబీసీ కులాల వర్గీకరణ జరగనుంది.ఈ కమిషన్ కాల పరిమితి ముగియగా.. ప్రభుత్వం ఇప్పటికే 11 సార్లు పొడిగించింది. ఈ ఏడాది జులై -31తో ముగియనుంది. విద్య, ఉద్యోగాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ కులాల కోసం ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ సామాజిక వర్గాన్ని ఎలా విభజించాలి? దేనికి ఎంత శాతం రిజర్వేషన్​ కేటాయించాలన్నది రోహిణి కమిషన్ ​రిపోర్టు ఆధారంగానే జరగనుంది. అయితే కమిషన్ ఏర్పాటయ్యేనాటికి దేశ వ్యాప్తంగా 2,633 కులాలు మాత్రమే కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయి. కమిషన్ కూడా ఆ కులాలకు చెందిన ప్రజల జీవన విధానాలనే పరిశీలించింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన బీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చడంపై ఎలాంటి ముందడుగు పడటం లేదు. ఓబీసీ జాబితాలో ఉన్న 2633 కులాలను 4 ఉప విభాగాలుగా వర్గీకరించి, 27 శాతం రిజర్వేషన్లను 2, 6, 9, 10 శాతాలుగా పంచనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల గత కొంత కాలంగా అన్ని రకాలుగా నష్టపోయిన ఓబీసీ కులాలకు మెరుగైన రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ దేశంలో ఇంకా చాలా బీసీ కులాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. 

6500 బీసీ కులాలు!

స్వాతంత్ర్యానికి ముందు 1881 నుంచి 1931 వరకు మన దేశంలో కుల ఆధారిత జనాభా లెక్కలు 6 సార్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు 6500 బీసీ సామాజిక కులాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ కేంద్ర ఓబీసీ జాబితాలో కేవలం 2,633 కులాలు మాత్రమే ఉన్నాయి. అయితే మిగతా 3,867 బీసీ కులాల పరిస్థితేమిటి? అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా.. బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంలో ముందడుగు పడటం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏండ్లు దాటినా కులాల ప్రకారం జనాభా లెక్కలు నిర్వహించడం లేదు. దీంతో బీసీ కులాల లెక్కలు తేలక.. రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోంది. విద్య, ఉద్యోగాల్లో నిరుపేద బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతోంది. బీసీ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ కేవలం కేంద్ర ఓబీసీ జాబితాను మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? దేశంలోని ప్రతి రాష్ట్రంలో బీసీ కులాలుగా గుర్తింపు ఉన్న అన్ని కులాలను పరిశీలించాలి. వాటన్నింటిని పరిగిణణలోకి తీసుకొని రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలుగా గుర్తించిన కులాలను కూడా కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం అన్యాయం. ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మకుంటే ఎలా? తెలంగాణలో 140 బీసీ కులాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ లో ఉంది. కానీ కేంద్ర ఓబీసీ జాబితాలో మాత్రం 90 కులాలు మాత్రమే ఉన్నాయి. 

ఓబీసీ జాబితాలో లేని తెలంగాణ బీసీ కులాలు

బుక్కయ్యవారు, గోత్రాల, బొందిలి, ఆరేమరాఠీ, ఆరె, అఘుముడియార్, సుంది, వారాల, సిస్టకరణ, వీరశైవలింగాయత్, అచ్చుకట్ల వారు, అద్దపువారు, బాగోతుల, బైలు కమ్మర, ఏనుటి, గంజికూటి, గౌడజెట్టి, కాకిపడిగల, పటంవారు, ఓడ్, సన్నాయిల, శ్రీ క్షత్రీయరామజోగి, బైకాని/ తెరచీరల, తోలుబొమ్మలవారు, ఆహీర్ యాదవ్, గౌలి, కుల్లకడిగి, అత్తర్ సాయబ్ లు, దోబిముస్లిం, పక్కిర్ సాయబ్ లు, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం, గుడ్డేలుగులవాళ్లు, నాయిముస్లిం, లబ్బాయి, పక్కర్లు, తురుక కాశ, సరోళ్ల తదితర సామాజిక వర్గాలకు ఇంకా కేంద్ర ఓబీసీ జాబితాలో చోటు దక్కలేదు. 
-తిపిరిశెట్టి శ్రీనివాస్,సోషల్ ఎనలిస్ట్