- కాల్వలు లేని కాళేశ్వరం
- కొండపోచమ్మ వైపు తప్ప మిగిలిన ప్యాకేజీల పనులు ఏడియాడనే
- కెనాల్స్, టన్నెల్స్, డిస్ట్రిబ్యూటరీలు కాలే
- ఇంకా లింక్ -1 కాల్వలకే దిక్కులేదు
- ప్రాజెక్టు ప్రారంభించి నాలుగేండ్లయినా
- కొత్త ఆయకట్టుకు నీళ్లు పారుతలె
నెట్వర్క్/ జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : లక్ష కోట్లతో ప్రపంచం నివ్వెరపోయేలా నిర్మించామని రాష్ట్ర సర్కారు పెద్దలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు నేటికీ కాల్వలు గతిలేవు. ప్రాజెక్టు ప్రారంభించి నాలుగేండ్లు కావొస్తున్న సీఎం ఇలాకా సిద్దిపేట జిల్లాలో తప్ప ఎక్కడా కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాలేదు. మొత్తం ఏడు లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టగా.. లింక్– 4 పనులు మాత్రమే చకచకా పూర్తిచేసి మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు నింపుతున్నారు.
ఈ నీళ్లను చూపి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తున్నామని సర్కారు కలరింగ్ ఇస్తున్నది. నిరుడు వరదల కారణంగా కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌లు నీటమునగడంతో ఈసారి ఆ రిజర్వాయర్లనూ నింపుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక ఫండ్స్ లేక అన్ని జిల్లాల్లోనూ కెనాల్స్, టన్నెల్స్, డిస్ట్రిబ్యూటరీల పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాలా జిల్లాల్లో భూసేకరణ కూడా పూర్తికాక పనులు ముందరపడ్తలేవు. 2019 జూన్21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు.. 18 లక్షల 25 వేల 700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పినప్పటికీ నేటికీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లందడంలేదు. నాలుగేండ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తాయని ఆశపడ్తున్న రైతులకు ఎప్పట్లాగే ఎదురుచూపులు, బోరుబావులే దిక్కయ్యాయి.
లింక్-1 కింద తట్టెడు మట్టి ఎత్తలే..
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఏటా గోదావరి నుంచి 225 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 18.83 లక్షల ఎకరాల పాత ఆయకట్టుతోపాటు కొత్తగా మరో 18.25 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. ఈ రిజర్వాయర్ల కోసం భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు 2 వేల ఎకరాల భూములు సేకరించారు.
ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ఈ రెండు జిల్లాలకే కాళేశ్వరం ద్వారా మొదటి ఫలితం దక్కాలని కేసీఆర్ చెప్పారు. లింక్‒1 కింద ఈ 2 జిల్లాల పరిధిలో 30వేల ఎకరాలకు నీరిస్తామని ప్రాజెక్టు ప్రారంభం రోజే ప్రకటించారు. కానీ, పంపింగ్ స్టార్ట్ చేసి మూడేండ్లు దాటినా లింక్–-1 పనులు షురూ కాలేదు. ఈ 2జిల్లాల్లో ఇప్పటిదాకా తట్టెడు మట్టి ఎత్తలేదు. కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల కోసం భూములు కూడా సేకరించలేదు. మెట్ట ప్రాంతాలకు నీళ్లు రాక పోగా, ఏటా వానాకాలంలో ఈ మూడు బ్యారేజీల పరిధిలో బ్యాక్‌వాటర్ కారణంగా వందలాది ఎకరాల్లో పంటలు మునిగి రైతులు నష్టపోతున్నారు.
కొండపోచమ్మ, మల్లన్నసాగర్ కేనా?
‘కాళేశ్వరం కట్టింది ఎందుకు అంటే.. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ నింపుకునేందుకు’ అన్నట్టుగా సర్కారు తీరు ఉన్నది. కాళేశ్వరం పక్కనే ఉన్న పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో లింక్–1తోపాటు వివిధ జిల్లాల్లోని ఆయా ప్యాకేజీలన్నింటినీ పక్కనపెట్టి సిద్దిపేటకు నీళ్లిచ్చే లింక్– 4, 5,6 పనులు మాత్రం సర్కారు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది. 10 నుంచి19 ప్యాకేజీల కింద మెయిన్కెనాల్స్నిర్మించి సీఎం సొంత జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లను ఒకటి, రెండుసార్లు నింపింది. నిరుడు వరదల కారణంగా కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌లు నీట మునగడంతో ఈసారి ఆ రిజర్వాయర్లనూ నింపుకునే చాన్స్‌లేకుండా పోయింది. ఇక, నాటి ప్రాణహిత– చేవెళ్ల పరిధిలోకి వచ్చే జిల్లాలను కూడా కాళేశ్వరం కిందికి తెచ్చిన సర్కారు ఆయాచోట్ల వివిధ ప్యాకేజీల కింద మెయిన్కెనాల్స్, టన్నెల్స్పనులు మొదలుపెట్టినా ఫండ్స్ లేక నత్తనడకన సాగుతున్నాయి. అదే సమయంలో మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లిచ్చేందుకు ఇటీవల ఏకంగా రూ.300 కోట్లతో పనులు ప్రారంభించడం ముమ్మాటికీ వివక్షేననే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్లి చ్చుకునేందుకు కేవలం అక్కడే పనులు చేయిస్తూ మి గిలిన జిల్లాలపై తీవ్ర వివక్ష చూపుతున్నారని ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ఆరోపించారు.
జిల్లాలవారీగా ఇదీ పరిస్థితి..
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 20, 21,22 ప్యాకేజీలున్నాయి. మంచిప్ప నుంచి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం దాకా టన్నెల్ ద్వారా నీటిని తీసుకురావాలి. పనులు 60% మాత్రమే అయ్యాయి. భూంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించినా మెయిన్ కెనాల్ కంప్లీట్ కాలేదు. రైట్, లెప్ట్ కెనాల్స్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టన్నెల్, మెయిన్ కెనాల్స్, రిజర్వాయర్లు, డిస్ట్రి బ్యూటరీలకు 4,422 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 1,400 ఎకరాలు మాత్రమే సేకరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలానికి నీళ్లిచ్చే 22వ ప్యాకేజీ పనులు పెండింగ్‌పడ్డాయి. కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభించినప్పుడు 15 రోజుల్లో జిల్లాకొచ్చి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇటు రాలేదు.
- మెదక్ జిల్లాలో ప్యాకేజీ 13, 14, 15 కింద 4 మండలాల్లోని 76 చెరువులను నింపడం ద్వారా 19,452 ఎకరాలకు సాగునీరివ్వాలి. మెయిన్ కెనాల్ పూర్తయ్యి నీళ్లు రిలీజ్ చేసినా 79 కి.మీ పొడువునా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించలేదు. భూసేకరణ పూర్తి కాలేదు. 17, 18, 19 ప్యాకేజీల కింద 8 మండలాల్లో 75,473 ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించారు. కెనాల్స్, టన్నె ల్స్ కోసం 4,791 ఎకరాలు సేకరించాల్సిఉండగా.. 1,634 ఎకరాల సేకరణే జరిగింది. నర్సాపూర్ మండలంలో కొంత టన్నెల్ పని పూర్తి కాగా, వెల్దుర్తి మండలంలో అసంపూర్తిగా ఉన్నాయి. 17, 18, 19 ప్యాకేజీ పనులు గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది డిసెంబర్ దాకా పొడిగించారు.
- సంగారెడ్డి జిల్లాలో మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించేందుకు 17, 18, 19 ప్యాకేజీల కింద పనులు చేపట్టారు. ఈ ప్యాకేజీల కింద సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్టుల ద్వారా రెండు పంప్ హౌజ్‌లు, కాల్వలు నిర్మించాలి. మెయిన్ కెనాల్ పనులు ఏడాది నుంచి కొనసాగుతుండగా.. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. మొదటి పంపు పరిధిలో ఐదులాపూర్ నుంచి వెంకటాపూర్ డెలివరీ సిస్టం వరకు, రెండో లిఫ్టు కింద హోతికుర్దు నుంచి గోవిందాపూర్ వరకు మెయిన్ కెనాల్స్నిర్మించాల్సి ఉన్నప్పటికీ భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు.
మల్లన్నసాగర్‌కు 12టీఎంసీలు..
గత రెండున్నరేండ్లలో మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ కు 35 టీఎంసీలు ఎత్తిపోయగా.. అక్కడి నుంచి 18 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్‌కు , 12 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ కు ఎత్తిపోశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ గతేడాది ప్రారంభం కావడంతో, అంతకుముందే కొండపోచమ్మ సాగర్ఓపెన్ చేశారు. దీంతో ప్రత్యేక కాల్వ ద్వారా మల్లన్నసాగర్‌కు సంబంధం లేకుండానే కొండపోచమ్మకు 7 టీఎంసీల నీళ్లు మళ్లించారు. మల్లన్న ప్రాజెక్టు ప్రారంభం తర్వాత మరో 5 టీఎంసీలు తీసుకెళ్లారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ కింద మిడ్ మానేరును మల్కపేట రిజర్వాయర్ తో లింక్ చేసి అప్పర్ మానేరును నింపాలి. కోనరావుపేట మండలం మల్కపేటలో 3 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి సింగసముద్రం మీదుగా అప్పర్ మానేరుకు నీటిని తరలించారు. ఈ ప్యాకేజీ ద్వారా సిరిసిల్ల జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని భావించినా పనులు స్లోగా సాగుతున్నాయి. అదే సమయంలో మిడ్ మానేరు నుంచి సిరిసిల్ల మీదుగా సిద్దిపేట, గజ్వేల్ వరకు నీళ్లను తరలించే 10, 11, 12 ప్యాకేజీ పనులు మాత్రం కంప్లీట్ అయ్యాయి.
కాళేశ్వరం ద్వారా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది టార్గెట్. ఇందుకోసం చేపట్టిన డి 27,28 హై లెవెల్ కాల్వల పనులు నిధుల కొరత వల్ల ఎనిమిదేండ్లుగా నిలిచి పోయాయి. కాంట్రాక్ట్ ఏజెన్సీ లు తమ అగ్రిమెంట్ ను కూడా రద్దు చేసుకున్నాయి. ప్రాణహిత– చేవెళ్ల స్కీమ్ కింద అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కాల్వల పనులు ప్రారంభించారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందికి మార్చింది. నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ సుశి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేతులెత్తేసింది.
సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్, మల్లన్న సాగర్నిర్మాణం పూర్తయినా మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం లేటవుతున్నది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కొంత బెటర్అని చెప్పవచ్చు.11వ ప్యాకేజీలో భాగంగా చిన్న కోడూరు మండలం చంద్లాపూర్ వద్ద 3 టీఎంసీల కెపాసిటీతో శ్రీరంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను రెండేండ్ల కింద ప్రారంభిం చారు. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల, సిద్ది పేట, జనగామ జిల్లాల్లోని 1.10 లక్షల ఎకరా లకు సాగునీరందించాలి. గజ్వేల్ నియోజక వర్గం పాములపర్తి వద్ద కొండ పోచమ్మ రిజ ర్వాయర్‌ను ఏడాదిన్నర కింద ప్రారంభిం చారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చ ల్, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీరివ్వాలనేది లక్ష్యం. 7 కాల్వల వర్క్ నత్త నడకన సాగుతున్నాయి.
యాదాద్రి జిల్లాలో 16వ ప్యాకేజీ కింద బస్వాపూర్ నృసింహ రిజర్వాయర్ నిర్మాణం ఆరేండ్లుగా సాగుతున్నది. 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా తొమ్మిది మండలా ల్లోని 1.88 లక్షల ఎకరాల కు నీరందిస్తామని గతంలో సర్కార్ చెప్పింది. రిజర్వాయర్ కోసం 4,232 ఎకరాలకు గాను 2,491 ఎకరాలు, కెనాల్స్ కోసం 5,099 ఎకరాలకు గాను 1,323 ఎకరాలను మాత్రమే ఇప్పటివరకు సేకరించారు. కెనాల్స్ పనులు కేవలం 25 శాతం పూర్తయ్యాయి. 15వ ప్యాకేజీ కింద గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తామని గత ఎన్నికల టైమ్‌లో హామీ ఇచ్చినా ఇంకా సర్వే కూడా పూర్తికాలేదు.