కాళేశ్వరం.. ఇంకా మిస్టరీనే!
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద పది నెలలుగా సీక్రెట్‌గానే పనులు
టైట్ సెక్యూరిటీ.. మీడియా, ప్రతిపక్షాలకు నో పర్మిషన్
గేట్లకు తాళాలు వేసి.. నాన్‌లోకల్ కూలీలతో పనులు
గతేడాది జులై14న నీటమునిగిన పంప్‌హౌస్
దెబ్బతిన్న 17 మోటర్లలో ఎన్ని రిపేర్ చేశారో చెప్తలే
తుక్కుతుక్కయిన 6 మోటర్ల స్థానంలో కొత్తవి బిగించిన్రా?
నష్టం వెయ్యి కోట్లా? రూ.1,200 కోట్లా? భరిస్తున్నదెవరు?
మరో రెండు వారాల్లో వానాకాలం సీజన్ ప్రారంభం..
అప్పటిలోగా పనులు పూర్తయితయా?
సర్కారు నుంచి సమాధానం లేని ప్రశ్నలెన్నో
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : రూ.లక్ష కోట్లతో ప్రపంచం నివ్వెరబోయేలా కట్టామని రాష్ట్ర సర్కారు చెప్పుకున్న కాళేశ్వరం.. అంతుచిక్కని రహస్యంలా తయారైంది. తెలంగాణ పర్యాటక రంగానికి మణిమకుటంగా సర్కారు అభివర్ణించిన ఈ ప్రాజెక్టు.. గడిచిన పది నెలలుగా చీమకు సైతం ప్రవేశం లేనంత నిషేధిత ప్రాంతమైంది. గతేడాది జులైలో కన్నెపల్లిలో 17 బాహుబలి మోటార్లు నీట మునిగినప్పటినుంచి పంప్హౌస్సహా రిజర్వాయర్ల వద్ద కట్టుదిట్టమైన సెక్యూరిటీ పెట్టారు. మీడియా, ప్రతిపక్ష నేతలు, రిటైర్డ్ ఇంజినీర్లు, ఆఫీసర్లు.. ఎవ్వరూ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బయట గేట్లకు తాళాలు వేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలతో పనులు చేయిస్తున్నారు. లోపల ఏం జరుగుతున్నదో బయటికి తెలియకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. గతేడాది చుక్క నీటిని ఎత్తిపోయక ముందే పంప్‌హౌస్ నీటమునిగింది. మరో రెండు వారాల్లో వానాకాలం రాబోతున్నది. టైమ్‌కు వర్షాలు పడితే గోదావరికి వరద మొదలవుతుంది. మరి ఈసారైనా నీళ్లు ఎత్తిపోస్తరా? ఇంతకీ ఎన్ని మోటర్లు దెబ్బతిన్నాయి? ఎన్నింటికి రిపేర్లు పూర్తయ్యాయి? ఎంత ఖర్చయింది? ఆ ఖర్చును సర్కారు భరిస్తున్నదా? కాంట్రాక్ట్ సంస్థ పెట్టుకుంటున్నదా? ఇలా అన్నీ ప్రశ్నలే. సర్కారు నుంచి సమాధానం కరువైంది.
నిషేధిత ప్రాంతంలా పంప్‌హౌస్
అప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారైనా చూసి తీరాల్సిన ప్రాంతమని హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూరిజం బస్సులు పెట్టిన సర్కారు.. పంప్‌హౌస్ మునగగానే దాన్ని నిషేధిత ప్రాంతంగా మార్చింది. పంప్‌హౌస్ చుట్టూ ఉన్న ఐదు గేట్లను మూసేసి 30 మంది పోలీసులను కాపలా పెట్టింది. సీఆర్‌పీఎఫ్ పోలీసులతోపాటు మేఘా కంపెనీ సెక్యూరిటీ గార్డులను మోహరించింది. ఏ ఒక్కరినీ లోపలికి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంది. డీవాటరింగ్ తర్వాత కూడా పంప్‌హౌస్ నష్టాన్ని పరిశీలించేందుకు మీడియానుగానీ, ప్రతిపక్ష నేతలనుగానీ, రిటైర్డ్ ఇంజినీర్లు, ఆఫీసర్లనుగానీ అనుమతించలేదు. మోటార్లు ధ్వంసమైన వీడియో ఒకటి కూలీల ద్వారా బయటకురావడంతో లోకల్ కూలీలను బంద్పెట్టింది. బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి నాన్ లోకల్ కూలీలను తెప్పించారు. ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా లోపలికి వెళ్లేటప్పుడు ఇంజినీర్లు, ఉద్యోగులు, కూలీల ఫోన్లను ముందే తీసుకుంటున్నారు.
గతేడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు షిఫ్ట్‌కు 400 మంది చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 800 మందితో పనులు చేయించారు. డిసెంబర్ తర్వాత కూలీలను చాలా వరకు తగ్గించారు. ప్రస్తుతం షిఫ్టుకు 100 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపైనా క్లారిటీ లేదు.
ఏం చేశారు? ఇంకా ఏం చేయాలి?
కన్నెపల్లి పంప్‌హౌస్‌లో గతేడాది డిసెంబర్ వరకు 11 మోటర్లను రిపేర్ చేసినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. జనవరి 5న ఆరు మోటర్లను మాత్రమే ట్రయల్‌రన్ చేశారు. 11 మోటర్లను రిపేర్ చేసినట్లు ప్రకటించి, ఆరు మోటర్లను మాత్రమే ఎందుకు నడిపించారు? మరి మిగిలిన 5 మోటర్ల పరిస్థితి ఏమిటి? అవి పనిచేస్తున్నాయా? లేదా? అనేది తెలియడం లేదు. పూర్తిగా దెబ్బతిన్న మిగతా ఆరు మోటర్ల పరిస్థితి ఏంటనేది చెప్పలేదు. కొత్త మోటర్లకు ఆర్డర్ పెట్టామని, ఆస్ట్రియా నుంచి రాగానే బిగింపు మొదలుపెడ్తామని ఇంజినీర్లు అప్పట్లో లీకులు ఇచ్చారు. కానీ మోటర్లు వచ్చాయో లేదో చెప్పలేదు. పంప్‌హౌస్ ప్రొటెక్షన్ వాల్‌ను తిరిగి నిర్మించినట్లు చెప్తున్నారు. గతంలో ఈ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంలో క్వాలిటీ పాటించకపోవడం వల్లే నష్ట తీవ్రత పెరిగింది. అలాంటి కీలకమైన వాల్‌ను ఈసారి ఎలా నిర్మించారు? మరోసారి వరదలు వచ్చినా కూలిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో బయటకు తెలియనివ్వడం లేదు. కంట్రోల్ రూంను కింది నుంచి పైభాగానికి షిఫ్టు చేసి, కొత్తగా నిర్మించినట్లు చెప్తున్నా దానిపై క్లారిటీ లేదు. మొత్తం మీద రిపేర్లకు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,200 కోట్లు ఖర్చయినట్లు చెప్తున్నా.. అసలు లెక్క ఎంతో సర్కారు బయటపెట్టలేదు. ఈ మొత్తం ఖర్చును కాంట్రాక్ట్ సంస్థతోనే పెట్టిస్తున్నారా? ప్రభుత్వం పెడుతుందా? అనే విషయాన్ని బయటపెట్టాలని రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నాడు చిన్న ప్రమాదంగా చూపే ప్రయత్నం..
గతేడాది గోదావరికి వచ్చిన వరదల వల్ల జులై 14న కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు నీటమునిగాయి. అన్నారంతో పోలిస్తే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు భారీ నష్టం జరిగింది. వరదల నుంచి పంప్‌హౌస్ రక్షణ కోసం కట్టిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయి మోటర్ల మీద పడింది. మొదట్లో దీన్ని చిన్న ప్రమాదంగా చూపేందుకు సర్కారు ప్రయత్నించింది. కేవలం రూ.25 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని, ఆ నష్టాన్ని కూడా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ప్రకటించారు. తర్వాత డీ వాటరింగ్ చేశారు. నీళ్లు తగ్గాకే ప్రమాద తీవ్రత ఎంతో ఆఫీసర్లకు తెలిసింది. మొత్తం 17 మోటార్లు దెబ్బతినగా, ఆరు మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. మోటార్లు ముందుకు జరగడంతో షాఫ్ట్ లు వంగిపోయాయి. కంట్రోల్ రూం నీటిలో మునగడంతో కంట్రోల్ ప్యానెల్స్, కంప్యూటర్లు, ఎలక్ట్రికల్ పరికరాలు పనికిరాకుండా పోయాయి. స్టార్టర్లు, మోటర్లు, బ్యాటరీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో నష్టం రూ.వెయ్యి కోట్లు దాటినట్లు ఆఫీసర్లు ప్రకటించారు.
ఈసారైనా నీళ్లు ఎత్తిపోస్తరా?
గతేడాది జులై నుంచి ఈ ఏడాది జనవరి5 దాకా నీటిని ఎత్తిపోయలేదు. ఈ ఏడాది నాలుగు నెలల్లో 25 టీఎంసీలను లిఫ్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. కొద్ది రోజుల కింద ఇసుక తవ్వకాల కోసం మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో నీళ్లు లేవు. మరో రెండు నెలల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. అప్పటిలోగా అన్ని మోటర్ల రిపేర్లు పూర్తయి, వినియోగంలోకి వస్తాయా? లేదా? ఈసారైనా నీళ్లు ఎత్తిపోస్తారా? లేదా? అనేది తెలియడం లేదు.