- తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమార్కులు
- 113 మంది అనర్హులకు కోటికి పైగా విలువైన చెక్కులు
- నేడు ఆదిలాబాద్ కలెక్టర్కుఎంక్వైరీ రిపోర్టు
- మరి కొందరిపై వేటుకు రంగం సిద్ధం
ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదిలాబాద్ ఆర్డీఓ ఆఫీస్‌లో పనిచేసే సీనియర్అసిస్టెంట్ ప్రధాన సూత్రధారిగా ఇచ్చోడ మీ సేవా సెంటర్ అడ్డాగా జరిగిన ఈ స్కాంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులు కాజేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు మండలాల్లో కలిపి113 మంది అనర్హులకు కోటికి పైగా విలువైన చెక్కులు అందినట్లు తెలుస్తోంది. ఇలా అడ్డదారిలో సంపాదించిన సొమ్మును వాటాలు పంచుకునే క్రమంలో తలెత్తిన గొడవ కారణంగా జరిగిన ఓ హత్యతో వెలుగుచూసిన ఈ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఎంక్వైరీ ముందుకు సాగినకొద్దీ రెవెన్యూశాఖలో అక్రమార్కులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు మీసేవా సెంటర్ల నిర్వాహకులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వాళ్లతో పాటు పలువురు తహసీల్దార్ల బ్యాంకు అకౌంట్లను సైతం సీజ్ చేశారు.
లోతుగా దర్యాప్తు ..
ఈ ఇల్లీగల్దందా మూలాలను తెలుసుకునేందుకు పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ స్పీడప్ చేశారు. ఈ ఏడాది కాలంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరయ్యాయి, వీరిలో ఎంతమంది క్యాష్ డ్రా చేసుకున్నారు, ఇంకా తహసీల్దార్ ఆఫీసుల్లో ఎన్ని చెక్కులు ఉన్నాయనే విషయమై రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక మండలాల్లో అనర్హులకు పంపిణీ చేసిన చెక్కులకు సంబంధించి పెట్టిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈక్రమంలో దొరుకుతున్న ఆధారాలను చూసి పోలీస్ ఆఫీసర్లు ఆశ్చర్యపోతున్నారు. కీలక నిందితుడిగా భావిస్తున్న ఆర్డీఓ ఆఫీస్సీనియర్ అసిస్టెంట్ నదీంపై ఇప్పటికే వేటు వేయగా,మరికొందరు రెవెన్యూ ఉద్యోగుల ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నారు. ఈక్రమంలోనే పలువురు రెవెన్యూ ఆఫీసర్లు, ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లను ముందస్తుగా సీజ్ చేసి, ట్రాన్సాక్షన్స్‌ను పరిశీలిస్తున్నారు.
ఇవీ అక్రమాలు ..
డబ్బును పంచుకోవడంలో తలెత్తిన వివాదంలో హత్యకు గురైన జ్ఞానేశ్వర్ కేసును ఛేదించే క్రమంలో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులకు ఈ స్కాం గురించి తెలిసింది. దీనిని సీరియస్‌గా పరిగణించిన జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్.. ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి , ఇచ్చోడ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ స్పీడప్ చేశారు. పోలీసులు జరిపిన ఎంక్వైరీలోనూ తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో నేరడిగొండ 30, బోథ్ 30, బజార్హత్నూర్ 32, గుడిహత్నూర్ 15, మావల 03 కలిపి మొత్తం 113 మంది అనర్హులకు చెక్కులు వచ్చినట్లు గుర్తించారు. ఇందులో కొంతమంది ఇప్పటికే బ్యాంకుల నుంచి క్యాష్ డ్రా చేసుకోగా , మరికొంతమంది చెక్కులు తహసీల్దార్ ఆఫీసుల్లో ఉన్నాయి. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో ఒక్కో కుటుంబానికి చెందిన ముగ్గురు, ఇద్దరు వ్యక్తులకు ఈ స్కీంల ద్వారా చెక్కులు పొందినట్లు ఎంక్వైరీలో గుర్తించారు. ప్రధాన నిందితుడు నదీం పరారీలో ఉండగా ఇచ్చోడ మీసేవా కేంద్ర నిర్వాకులు జాదవ్ శ్రీనివాస్, సిందే అచ్యుత్‌ను పోలీసులు కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. ఇచ్చోడ మీసేవా సెంటర్‌కు తాళం వేయడంతోపాటు నిందితులకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితుల బ్యాంకు అకౌంట్ల నుంచి కొంతమంది రెవెన్యూ ఆఫీసర్ల అకౌంట్లకు డబ్బులు వెళ్లగా, ఆ కోణంలో ఎంక్వైరీ నడుస్తోంది. ప్రధానంగా ఇద్దరు తహసీల్దార్లతో పాటు మరికొంతమంది వీఆర్వోలు, ఆర్ఐల ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఆఫీసర్లు, రిపోర్టును జిల్లా కలెక్టర్‌కు సోమవారం అందజేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ రిపోర్ట్‌లో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయనేదానిపై సర్వత్రా టెన్షన్ నెలకొంది.