తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పాలన సాగుతోందన్నది వాస్తవం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని భావించిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఏండ్లుగా ఎదురుచూసిన నిరుద్యోగులు ఇక జాబ్వచ్చేలా లేదని భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదు.
లక్షల్లో ఉద్యోగ ఖాళీలు
తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల సంఖ్య లక్షా 7 వేలు. అప్పటి నుంచి నేటి వరకు ఉద్యోగ విరమణ ద్వారా ఏర్పడ్డ ఖాళీలు 70 వేలకు పైమాటే. ఆంధ్రా ఉద్యోగులు స్వరాష్ట్రానికి వెళ్లడంతో ఏర్పడ్డ ఖాళీలు, ప్రభుత్వ రంగ సంస్థలైన వివిధ కార్పొరేషన్లలో ఉన్న ఖాళీలు, కొత్త జిల్లాల ఏర్పాటుతో అవసరమైన పోస్టులు కలిసి ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో భర్తీ చేయాల్సిన ఉద్యోగ ఖాళీల సంఖ్య 2 నుంచి 2.5 లక్షలకు చేరుకుంది. బిశ్వాల్ (పీఆర్సీ) కమిటీ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలోని 31 శాఖల్లో మొత్తం 4 లక్షల 91 వేల 304 ఉద్యోగులు ఉండాలి. వారిలో 3 లక్షల 178 మంది మాత్రమే కొనసాగుతున్నారు. అంటే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే రాష్ట్రంలో 1 లక్షా 91 వేల 126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్య, వైద్యం, పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ వంటి 5 కీలక శాఖల్లోనే లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీలున్నట్లు కమిటీ రిపోర్ట్స్పష్టం చేసింది. బిశ్వాల్ కమిటీ నివేదిక వచ్చిన నాటి నుంచి నేటి వరకు మరో 50 వేల పైచిలుకు ఖాళీలు ఏర్పడ్డాయి. నిజంగా ఆలోచిస్తే...ఉమ్మడి రాష్ట్రంలో కొల్లగొట్టిన ఉద్యోగాలు, ఏర్పడ్డ ఖాళీలు, కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాల్లో పాలనా అవసరాల కోసం కొత్తగా కల్పించాల్సిన ఉద్యోగాల లెక్క చూస్తే కనీసం 4 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలి. కానీ సీఎం కేసీఆర్ ఏడున్నరేండ్ల పాలనలో అందులో 10 శాతం అంటే 40 వేల ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారు. టీఆర్ఎస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాల కంటే... తొలగించిన ఉద్యోగుల సంఖ్యే ఎక్కువ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, స్కూళ్లలో పనిచేస్తున్న వేలాది మంది విద్యా వలంటీర్లను, 22 వేల మంది స్కావెంజర్స్ ను ప్రభుత్వం తొలగించింది. వైద్యశాఖలో పనిచేస్తున్న వేలాది మంది స్టాఫ్ నర్సులను తీసేశారు. అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
నిరుద్యోగ భృతి ఏమాయే
సరిగ్గా మూడేండ్ల క్రితం 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్కో నిరుద్యోగికి ప్రతి నెలా రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. నిరుద్యోగుల ఓట్లతో తిరిగి అధికారంలోకి వచ్చారు. 2019 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ భృతి కోసం రూ.1,810 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ నేటికీ ఆ ప్రకటన అమలు కాలేదు. సీఎం కేసీఆర్ హామీ అమలై ఉంటే ఒక్కో నిరుద్యోగికి ఈపాటికే నిరుద్యోగ భృతి పేరిట లక్ష రూపాయలకుపైగా అందేది. తద్వారా ఉద్యోగాలు లేకపోయినా ఖర్చులకు ఇబ్బంది లేకుండా నిరుద్యోగులకు కొంతలో కొంత ఊరట కలిగేది. కానీ అలా జరగలేదు. ఈ పరిణామాలను గమనిస్తే నిరుద్యోగులను వంచించి రాజకీయ లబ్ధి పొందడానికే ‘నిరుద్యోగ భృతి’ని ఎన్నికల నినాదంగా మార్చారనేది స్పష్టమవుతోంది.
మేలుకో యువత..
ఏడున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనను పరిశీలిస్తే.. ఉద్యోగాల భర్తీ అందని ద్రాక్షే. నిరుద్యోగులు పడుతున్న బాధలను అర్థం చేసుకోవాలి. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉద్యోగాలను భర్తీ చేయాలి. నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలి. తక్షణమే ఉద్యోగ ఖాళీలపై, ఎస్సీ,- ఎస్టీ, -బీసీ బ్యాక్ లాగ్ పోస్టులపై వైట్పేపర్ రిలీజ్చేయాలి. వీటితోపాటు ఇకపై ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏటా నిర్దిష్ట కార్యాచరణతో కూడిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి.ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీజేపీ సోమవారం ఉదయం10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద శాంతియుతంగా ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థి, యువజన సంఘాలతోపాటు మేధావులు, విద్యావంతులు ఈ దీక్షకు హాజరై మద్దతివ్వాలి.
హామీలు.. నీటిమీద రాతలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 7 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడేండ్లు దాటినా ఆ హామీకి అతీగతీ లేదు. ఏడాది కాలంగా ఉద్యోగ ఖాళీల భర్తీపై కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారు. కానీ ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇవ్వలేదు. నిరుడు డిసెంబర్ లో 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి నేటి వరకు త్వరలో నోటిఫికేషన్ అంటూ ఊరించడమే తప్ప ఉద్యోగాలు వేసింది లేదు. ఉద్యోగాల కోసం దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య సుమారు 26 లక్షలు. దీన్ని బట్టి రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరి సారిగా గ్రూప్-1 పోస్టులకు 2011లో, జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2008లో, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు 2013లో, గ్రూప్–-డి పోస్టులకు 2016లో నోటిఫికేషన్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్తగా బోర్డులపై రాతలు మారాయే తప్ప నిరుద్యోగుల తలరాతలు మారకపోవడం బాధాకరం.
- పసునూరు మధు, సీనియర్ జర్నలిస్టు